Thursday, January 6, 2011

మినప సున్నుండలూ బుద్ధిమాంద్యమూ!

విజయవాడ నుంచీ వస్తూవస్తూ మా అత్తగారు మినపసున్నుండలు తెచ్చారని కిందటి పోస్టులో చెప్పా కదా. ఇది దానికి కొనసాగింపన్నమాట.

ఆవిడ సున్నుండలు బయటికి తీయగానే ‘అత్తయ్యా నువ్వవి ఎందుకు తెచ్చావో నాకు తెలుసులే’ అన్నాను. ‘ఎందుకు’ అందావిడ మొహం వెలిగిపోతుండగా (నేనేదో ఆవిడ ప్రేమనూ ఆప్యాయతనూ ఆత్మీయతనూ అనుబంధాన్నీ గుర్తించానని ఫీలైపోయింది పాపం).

మన పాండిత్యం అంతా ఒలకబోసే ఛాన్సొచ్చిందిరా అనుకునేసి ‘అసలికి అత్తగార్లు అల్లుళ్లకీ మినప సున్నుండలు ఎందుకు పెడతారో తెలుసా, దానెనక రెండు ప్రయోజనాలున్నాయంట’అని పే...ద్ద హరికథాభాగవతారులా ఆ కథ చెప్పటాకి తయారయ్యాను.
(ఇక్కడోపాలి గొంతు సవిరించుకున్న సౌండేసుకోండి)

సంసృత కవి శ్రీహర్షుడు తెలుసుగా, ఆయన రాజుగారి కోరికమీద ‘నైషధం’ అనే కావ్యం రాసినాడంట. ఆ కావ్యం ఫస్టుకాపీ హర్షుడి తల్లి మామల్లదేవి చదివిందట. మహామహా పండితులకే అర్థంగానట్టు కొరకరాని కొయ్యలా ఉందా కావ్యం. ఆవిడ కూడా మంచి విదుషీమణి. ఆ కావ్యం అట్టానే రాజుకినిపించినాడంటే కొడుక్కి పేరు రాదనుకుని ‘ఒరే నాయనా, చదివేకి బాగా కష్టంగా ఉందిది, మళ్లోసారి రాయి నాయనా’ అందట. తల్లిమాట మీద మళ్లీ మొదట్నుంచీ మొదలుబెట్టి రెండోసారి రాసేశాడట హర్షుడు.

మొదటిదాని మీద ఆ రెండో కాపీ సుమారుగానే ఉన్నా అదీ ఓ మాదిరి కష్టంగానే ఉండటంతో ఇట్ట లాబం లేదన్జెప్పి హర్షుడికి రోజూ మినుములు తినబెట్టడానికి పూనుకుందటా మహాతల్లి. ఇడ్డెన్లూ(ఇవి అప్పుడు ఉన్నాయో లేవో నాకు తెలీదు, కొంత సొంత పైత్యం కలిపేస్తున్నా), గారెలూ, దిబ్బరొట్టెలూ మినప సున్నుండలూ... ఈ రకంగా ముప్పొద్దులా మినుముల వంటకాలే.

ఆర్నెల్ల తర్వాత...
ఒకరోజు హర్షుడు వంటింట్లో కూర్చుని మినపరొట్టి తింటుండగా ఆయన మేనమామ వచ్చి ‘కిమశ్నాసి’(అంటే... ‘ఏం తింటున్నావోయ్’ అని కాబోలు) అని అడిగాడట.

దానికి హర్షుడు... ‘అశేష శేముషీ మోష మాష మశ్నామి మారిషా’ అని సమాధానం చెప్పాడట.
(ఇదెప్పుడో చిన్నప్పుడు మా నాన్న చెప్పిన చమక్కు. నా కోడిబుర్రకు అర్థమైనంతవరకూ... ‘నా సమస్త బుద్ధినీ తస్కరించే మినుములు(తో తయారుచేసిన రొట్టి) తింటున్నాను ఆర్యా’ అనిదీనర్థం. ఒకవేళ తప్పైతే, సరైన అర్థం పెద్దలు తాలబాసుగారో ఊకదంపుడుగారో చింతారామకృష్ణారావుగారో నేను పేర్లు మరచిన మిగతా పెద్దలో చెప్పాలి).

హర్షుడి సమాధానం ఆ పక్కనే రొట్లు కాలుస్తున్న మామల్లదేవి విన్నది. వినగానే ఆవిడ ముఖం చింకి చాటంత అయ్యిందట. కొడుకు తను అనుకున్న స్టాండర్డుకి వచ్చేసినాడని అర్థం చేసుకుని ‘అబ్బాయ్, ఇంక మళ్లీ మొదలెట్టు నీ నైషధం’ అందట.

భక్తులారా... ఆవిదంగా...
హర్షుడు మూడోపాలి రాసిన నైషధమే మనమిప్పుడు అందరం చెప్పుకొంటోన్న నలదమయంతుల కథ అనే అద్భుత కావ్యం. దీన్నే శ్రీనాథుడు ‘శృంగార నైషధం’గా తెలుగులో రాసేశాడు.

ఈ కథంతా చెప్పుకొచ్చి... మినుములు తిని అల్లుళ్ల బుద్ధి కాస్తంత మందగించితే కూతురు కొంగు పట్టుకు తిరుగుతాడు కదా, అందుకేనమ్మా అల్లుళ్లకు అత్తగార్లు మినప సున్నుండలు బెట్టేదీ.... అని వెటకారం వెలగబెట్టా.

ఆ దెబ్బతో ఆవిడ మొహం చూడాలి. ‘చీ పాపాత్ముడా, పోన్లే తింటావుగదాని ప్రేమగా సున్నుండలు తెస్తే, ఎంత కత చెప్పినావురా... పైగా నా మీద ఇంత అభాండం వేస్తావా’ అన్నట్టుందా చూపు.

మనమేదో పాండిత్యం వొలకబోద్దామనుకుంటే పరిస్థితి తేడాగా మారిపోయిందని అర్థమైపోయి ‘డామిట్, కథ అడ్డం తిరిగింది’ అనుకుంటూ ఓ వెర్రి నవ్వు నవ్వేసి పక్కికి తప్పుకొన్నా.

అంతే ఆవిడ ఇక్కడున్న నాల్రోజులూ మినపసున్నుండల వాసన కూడా నాకు చూపించలా.
నాలుగోరోజు నేనే ఇట్లయితే లాభం లేదన్జెప్పి ఆవిడ సీరియస్సుగా ‘మొగిలిరేకులు’పదొందల డబ్బైమూడో భాగమో పదారొందల తొంబైనాలుగో భాగమో చూస్తుండగా...

‘అత్తయ్యా, సున్నుండలు తెచ్చానంటివే... ఒక్కటి గూడా పెట్టలేదే’ అనడిగా

‘ఏమోలే, తెచ్చానంటేనే అంత కత చెప్పావ్, పెడితే ఇంకేమంటావో అని పెట్టలా’ అని ఓ సన్నాయినొక్కు నొక్కింది.
(ఉట్టిపుణ్యానికి ఆవిడ సహనాన్ని పరీక్షించడానికి అలా అడిగానే గానీ, తెచ్చినరోజు రాత్రే మా హోంమినిస్టరు నాకా సున్నుండలు రహస్యంగా స్మగ్లింగు చేసేసింది. ఈ రహస్యం మా అత్తగారికి చెప్పకండెవరూ. ఏమాటకామాటే... సున్నుండలు సూపరో సూపరు).

ఈ గొడవలో పడి ఆవిడ నేను అన్న ఆ రెండో ప్రయోజనమేంటో అడగనే లేదు : )

Sunday, December 26, 2010

నల్లచీరలో నా అప్సరస

టైటిల్ చూసి ఎఖ్కువ ఊహించుకోవద్దు.
ఇది నా ఎంగేజ్మెంట్  కథ.
మొన్నే ఓ మిత్రుడు ఫోన్ చేసి ‘ఫలానాఫలానా డిసెంబరు ముప్ఫయ్యో తారీఖు(రేపంటే రేపు కాదు, నాల్రోజుల తర్వాత) నా నిశ్చితార్థం రావోయ్’ అని ఇన్విటేషించాడు. 
‘నా ఎంగేజ్ మెంటుకే నేను లేను నీ నిశ్చితార్థానికేమొస్తాను పోవోయ్ పుల్లాయ్’ అని చెప్పేశాను. 
‘అదేంటి? నీ ఎంగేజ్ మెంటుకే నువ్వులేవా... ఏ, ఏ, ఏ, ఏ,ఏ’ అని గీతాంజలిలో నాగార్జునలా తెగబోలెడు ఆశ్చర్యపోయాడు గురుడు. 
కూస్తంత రీలు వెనక్కి తిప్పా...
అది, డిసెంబరు 24, 2005
ఈనాడు జర్నలిజం స్కూల్ ట్రైనింగులో భాగంగా అప్పుడు నేను కుప్పం(అవును మన చంద్రబాబునాయుడి ఇలాకానే)లో ఉన్నాను. అప్పటికి పదిహేను రోజులుగా అక్కడే మకాం. ఇరవయ్యైదో తారీకు(క్రిస్మస్ రోజు) నిశ్చితార్థం ఫిక్సింగ్ చేశారు. అది మా విజయవాడలో. 
             షెడ్యూలు ప్రకారం 26 పొద్దునకల్లా హైదరాబాదుకొచ్చి జర్నలిజం స్కూల్లో రిపోర్టు చెయ్యాలి. మామూలుగా అయితే 24 మద్యాహ్నం బయల్దేరి తెల్లారికల్లా బెజవాడ చేరుకుని నిశ్చితార్థం పని చూసుకుని ఎంచక్కా ఆరోజు రాత్రి బస్సెక్కి బజ్జుంటే తెల్లారి మెలకువొచ్చేసరికి ఐద్రాబాద్లో ఉండొచ్చు. కానీ... కానీ... అనుకున్నామని జరగవుకదా కొన్ని :(
                  మధ్దెలో ఇంకో ఫ్రెండొకడు తగిలి ‘నీకెందుకు నువ్వు తిరపతికొచ్చెయ్, కొండమీద దేవుడి దర్శన చేయించి రాత్రికి ఇజీవాడ బస్సెక్కించే పూచీ నాది’ అన్నాడు. 
                సరేన్జెప్పి కుప్పం టు తిరుపతి వయా చిత్తూరు రాత్రి ఆరూ-ఆరున్నరకంతా తిరపతి జేరుకున్నా.  తిరప్తి కొండమీద మనోడు, కింద నేను. బస్సు దిగ్గానే ఫోన్ చేస్తే మనోడి ఫోన్ స్విచ్చాఫ్. అక్కడే ఎడంకన్ను కొద్దిగా అదిరినట్టనిపించింది. చెయ్యంగా చెయ్యంగా ఏడుంపావుకి ఫోన్లో దొరికాడు. రష్చించావురా తండ్రీ ఎంగటేశ్పరా అనుకుని ‘ఏంవాయ్ ఎక్కడున్నావ్’ అంటే ‘కొండమీదే ఉన్నా అన్నా నువ్వు పైకొచ్చెయ్’ అన్నాడు. సర్లేగదాని వెళ్లాను. తీరా వెళ్లాక నా కర్మం కాలిపోయి ఆడెవుడో కర్ణాటక మంత్రొకడు కొండమీదికొచ్చి కూర్చున్నాడంట. అయ్యగారి కోసం అన్ని దర్శనాలూ రద్దు చేశారు. ఇంక టైమే దొరకనట్టు అవాళే రావాలా ఆయన కూడా! 
                  మావోడు విశ్వప్రయత్నం చేసి చివరికి ‘ఈపూటకి దర్శనం కుదర్దు’ అని తేల్చేశాడు.
             కిందికొచ్చేద్దామంటే కొండమీంచి ఆఖరి బస్సు కిందికి వెళ్లిపోయిందని చెప్పారు. ఇంక చేసేదేం లేక మూతి మూరడు పొడుగు సాగదీసుకుని కూర్చున్నా, మొత్తానికి మావాడు మాత్రం నానాతంటాలూ పడి తెల్లారి సెల్లార్ దర్శనానికి టిక్కెట్లు పట్టాడు. 
            కట్ చేస్తే...
          డిసెంబర్ 25, 2005 అంటే  నా ఎంగేజ్ మెంట్ డే... నేనిక్కడ తిరపతిలో, తను అక్కడ విజయవాడలో. వా....! దర్శనం చేసుకుని కొండ మీంచి కిందికి దిగేసరికి గంట తొమ్మిది కొట్టింది. తిరప్తి బస్టాండులో విజయవాడకి ఒక్క బస్సు కూడా లేదనన్జెప్పనన్జెప్పేసి చెప్పారు. రైళ్ల కోసరం ఎంక్వైరీ చేస్తే మధ్యాహ్నం దాకా అవీ లేవన్నారు. ఇంక చూడరా భగవంతుడా, ఏంచెయ్యాలో అర్థంగాలా. 

            కుంకుమ ఒలికిపోయిన రాగం... తీగలు తెగిపోయిన రాగం... గాజులు పగిలిపోయిన రాగం... అన్నీ కట్టగట్టుకుని వినిపిస్తున్నాయి బ్యాగ్రౌండులో!(అదికాకపోతే ఇంకో బస్సెక్కొచ్చు కదా అంటారా... అసలే ఆత్రం పెళ్లికొడుకుని అంత తెలివైన ఆలోచనలెందుకొస్తాయి సామీ)
                    ఈశ్వరా నేనేమిజేతురా అని బస్టాండ్లో తిరుగుతుంటే ఒంగోలు బస్సు కనపడింది. ఎగ్గిరి గంతేశా(పక్కనున్నోడు కూస్తంత అనుమానంగా చూశాడు). అక్కణ్నుంచి విజయవాడకి గడీకి పన్నెండు బస్సులుంటాయి. ఇంకేముంది, ‘ఎగిరి దూకరా ఎంకటసామీ’ అనుకుంటా బస్సెక్కా. 
                          డ్రైవరు టిఫినుకి పొయ్యాడంటా, ఎంతకీ బస్సు కదల్దే! మొత్తానికి పావుగంట తర్వాత డ్రైవరు కిళ్లీ బిగించి తాపీగా వచ్చి బస్సెక్కాడు. బస్సెంత స్పీడుగా వెళ్తున్నా నాకైతే ఎద్దులబండి మాదిరిగానే ఉంది. సరిగ్గా రెండు గంటల తర్వాత ఏదో ఊళ్లో బస్సాపాడు. 
               ఊరి పేరు గుర్తు లేదు. ఆ ఊళ్లో ఎంతసేపాగుతుంది అనడిగితే పదినిమిషాలన్నాడు. పక్కనచూస్తే ఒంగోలుకెళ్లే బస్సొకటి బయలుదేరబోతోంది. ప్లాట్ఫారం దగ్గర్నుంచి వెనక్కి తీస్తున్నాడు. బ్యాగ్ తీసుకుని ఈ బస్సులోంచి ఆ బస్సులోకి ఒక్క లాంగ్ జంపు. 
           కట్ చేస్తే... (కంగారు పడకండి, ఇదే లాస్టుసారి కట్ చెయ్యడం)
          మళ్లీ ఇంకోఊళ్లో ఆగిందీ బస్సు. అది దిగేసి వేరే బస్సెక్కా. ఈ మాదిర్తో తిరపతి నుంచి ఒంగోలు వెళ్లేలోపు ఐదారు బస్సులు మారాను. ఒంగోలు చేరాక మనసు కుదుటపడ్డది. టైం రెండో పావుతక్కువ మూడుంపావో అయ్యింది. అక్కణ్నుంచి విజయవాడకి కుక్కని తంతే బస్సు రాల్తుంది కాబట్టి నిమ్మళం. 
           ఏమాటకామాటే... వాజ్పేయీ పుణ్యమా అని స్వర్ణచతుర్భుజి రోడ్లమీద రయ్యిరయ్యిన దూసుకొచ్చాయి బస్సులు. అంచేత అంతదూరం జర్నీ చేసినా ఒంటికి పెద్దగా అలుపు తెలీలా.
            మొత్తానికి ఒంగోల్లో బస్సెక్కి(బస్సా అది... ఎద్దుల బండి కన్నా కనా కష్టం) ఆరింటికి విజయవాడ కనకదుర్గమ్మ వారధి దగ్గర బస్సు దిగి ఆటో కట్టించుకుని అర్జెంటుగా (కాబోయే)అత్తారింటికి చేరుకున్నా. అప్పటికి టైము పావుతక్కువ ఆరున్నర. ముహుర్తం దాటిపోతోందని నేను లేకుండానే తాంబూలాలు మార్చేసుకున్నారు. అంతా అయిపోయాక ‘ఊరికి మొనగాడు’ సినిమాలో కిష్టిగాడిలా ఓ బ్యాగు బుజానేసుకుని జిడ్డుమొహంతో ఆటో దిగాను. 
              మెట్లెక్కి పైకెళ్లేసరికి నాకిష్టమైన నల్లచీర కట్టుకుని బాపుగారి అభిసారికలా ఎదురుచూస్తోంది నా అప్సరస(అదేంటో అప్పట్లో అలానే కనిపించేది. పాపం నేను).
             కిక్కు సినిమాలో బ్రహ్మానందంచుట్టూ చేరి వయొలిన్లు వాయిస్తారు చూడండీ... అదీ మన పొజిషను. 
             తను మాత్రం కొంచెం కోపం, కొంచెం సంతోషం, కొంచెం ఉప్పు, కొంచెం నిప్పు, కొంచెం గరళం, కొంచెం అమృతం... కలిపి కొట్టరా కావేటి రంగా అన్నట్టు అన్ని ఎక్స్ ప్రెషన్లూ ఒక్క లుక్కులో చూపించింది.  
            బెటర్ లేట్ దాన్ నెవ్వర్ కాబట్టి సర్దుకుపోయి స్మైలిచ్చింది. ఇద్దరం ప్రైవేటుగా కాసేపు కబుర్లు చెప్పుకొన్నాం. ఇంతలో భోజనాలకు రమ్మన్నారు. తినేసరికి తొమ్మిదిన్నర. పదింటికి హైదరాబాద్ బస్సు.
             టాటా వీడుకోలూ అంటూ భారగుండెతో బైబై చెప్పి బస్సెక్కాను.
             అదండీ సంగతి!         
              ఇతి శ్రీ బాలు నిశ్చితార్థ పురాణం సమాప్త:

తాజాకలం :  మా బుడ్డిదాని పుట్టినరోజు ఫంక్షన్ కోసమని నిన్ననే మా అత్తగారొచ్చారు.  ఇవ్వాళే(అంటే నిన్నే) మా ఎంగేజ్ మెంట్ డే అని చెప్తే ‘అవును కదా,’ అని ఆశ్చర్యం వ్యక్తం చేశారు.  అది పెద్ద మ్యాటర్ కాదుగానీ... ఆవిడ వస్తూవస్తూ మినప సున్నుండలు తెచ్చారు. ఆ కథాకమామిషూ ఇంకో పోస్టులో.

Thursday, December 2, 2010

ఆరెంజ్... నేనూ, మా ఆవిడా

నిన్నే ఆరెంజ్ సినిమా చూశాం. నాకేమో నచ్చీనచ్చకుండా నచ్చింది. మా ఆవిడకు మాత్రం నచ్చింది.
ప్రేమ జీవితాంతం ఉంటుందా ఉండదా అనే పాయింటు మీద సంఘర్షణే సినిమా. కత ఇప్పటికే చాలా బ్లాగుల్లో చెప్పేశారు కాబట్టి దాని జోలికి పోదల్చుకోలేదుగానీ... నాకెందుకో ఈ సినిమా చూస్తున్నంతసేపూ స్వయంవరం సినిమా గుర్తొచ్చింది.
               అందులో వేణు ‘ప్రేమిస్తాగానీ పెళ్లి చేసుకో’నని చెబుతుంటాడు. దానికి సదరు పాత్ర చెప్పే కారణాలు తనచుట్టూ ఉండే భార్యాభర్తలు రోజూ కొట్టుకుంటూ తిట్టుకుంటూ ఉండటమే. కాకపోతే ఆరెంజ్ లో హీరో చెప్పే కారణం ప్రేమిస్తే అబద్ధమాడాల్సి వస్తుంది. అలా ఆడ్డం తనకిష్టం ఉండదు. అన్నీ నిజాలే చెప్తే ఆ ప్రేమ ఎక్కువ కాలం నిలవదన్నది హీరోగారి థీరీ. (ఏప్రిల్ 1 విడుదల సినిమాలో దివాకరంలా బతుకు బస్టాండయిపోతుంది, ఆ మాట నిజమే).
              ఇక్కడో చిన్న చిక్కుంది. యండమూరి వీరేంద్రనాథ్ అదేదో నవల్లో చెప్పినట్టు ‘నేను నిజాన్ని కుండబద్దలు కొట్టినట్టు చెప్తాను’ అంటే చెప్పొచ్చు. కానీ దానివల్ల చాలాసార్లు మిగిలేది కుండ పెంకులే(సినిమాలో కూడా నాగబాబు క్యారెక్టర్ తో ఇదే చెప్పించాడు. ‘ఇలా తప్పులు వెతుక్కుంటూ పోతే కారణాలే మిగులుతాయి... ప్రేమ మిగలదు’ అని).
         వీరేంద్రనాథ్ చెప్పింది కూడా వినాలా అంటారా? అయితే మన పెద్దలు చెప్పిన మాట కూడా ఒకటుంది... సత్యం బ్రూయాత్ ప్రియం బ్రూయాత్... అని. అవతలి వ్యక్తికి ప్రియం కలిగించని నిజాలు చెప్పడం కూడా ఒక్కోసారి పనికిరాదు మరి. అయినా ప్రేమంటే నమ్మకం. ‘అదే ఎంత కాలం ఉంటుందో తెలీదు’ అని అపనమ్మకంతో మొదలెడితే...?
            అదీకాక హీరో చెప్పే కారణం అతని తొలి ప్రేయసికున్న అనుమాన గుణం(లేదా ఓవర్ పొసెసివ్ నెస్) కారణంగా ఇతగాడు ఆ అమ్మాయితో అన్నీ అబద్ధాలే చెప్పాల్సి రావడం. ఇక్కడ మిస్సయిన లాజిక్ ఏంటంటే... అమ్మాయిలందరూ అలాగే ఉంటారని గ్యారంటీ లేదు. పోనీ అలా అనుకుంటే హీరోగారు ‘నిజమైన ప్రేమ’ కోసం వెతక్కూడదు. కానీ వెతుకుతుంటాడు. అమ్మాయి దొరికినప్పుడు మాత్రం నిజమైన(పోనీ లాంగ్ లాస్టింగ్) లవ్ ఉండదంటాడు.

           ఇదెక్కడి పితలాటకంరా నాయనా!
           ఇక సినిమాలో నాకు నచ్చిన పాయింట్లు... ప్రేమలో నిజాయతీ ఉండాలన్నది నాకు నచ్చిన పాయింటు.  సిడ్నీని అందంగా చూపించడంలో 100కి 200 మార్కులు. బ్రహ్మానందం, జెనీలియా ఎపిసోడ్ ఫన్నీగా ఉంది. పాటలు బాగున్నాయి. కానీ.... ఏదో వెలితి!
             అందుకే నాకు నచ్చీనచ్చకుండా నచ్చిందన్నాను.




ఇక మా ఆవిడ వెర్షన్: 
కింద కోట్స్ లో ఉన్న మాటలన్నీ తను చెప్పినవి చెప్పినట్టు రాశా. అచ్చరమ్ముక్క కూడా మార్చలేదని మనస్సాక్షి, దైవసాక్షిగా చెప్తున్నాను(నిన్నటి మంత్రుల ప్రమాణ స్వీకారం ఎఫెక్టు:-))


‘‘అబ్బాయిలతో పోలిస్తే అమ్మాయిలకు పొసెసివ్ నెస్ ఒక పిసరు ఎక్కువ. భర్త (లేదా) ప్రియుడు తన సమక్షంలో ఎక్కువ సేపు ఉండాలనుకుంటారు. నేనయితే అలాగే ఫీలవుతా. సినిమా చివర్లో కూడా చూడు... రాంచరణ్ ని గ్రాఫిటీ మానెయ్యమన్న జెనీలియా, అతను మారగానే గ్రాఫిటీని కంటిన్యూ చేయమంటుంది. నాకోసం నువ్వు మారితే నీకోసం నేను మారతా అన్నట్టు చెబుతుంది. అయినా అమ్మాయిలు అలా చెప్పేది మగవాళ్ల మంచికే. సిగిరెట్లు మానేయమన్నా, అభిరుచి పేరుతో గాలితిరుగుళ్లు తిరిగేకన్నా మంచి ఉద్యోగంలో చేరమని చెప్పినా వాళ్లమంచికే. సినిమాలో ఈ పాయింట్ నాకు బాగా నచ్చింది. కానీ ఈ పాయింట్ ని చెప్పడంలో డైరెక్టర్ కన్ఫ్యూజ్ అయ్యాడు’’

సివరాకరికి నాకర్థమయ్యిందేంటే... ఇద్దరం చెరో యాంగిల్లో చూశాం సినిమాని అని!

Tuesday, November 23, 2010

నలుపు, తెలుపు, కొంచెం కలరు.... తనికెళ్ల భరణి ఇంటర్వ్యూ

తనికెళ్ల భరణి అంటే నాకు చాలా ఇష్టం.
నటుడిగా కన్నా రచయితగా ఇంకా బోలెడంత ఇష్టం.
పద్యాలు అలవోకగా చెప్పే ఆయన కవితా ధార అంటే ఇంకా చాలా చాలా ఇష్టం.
మాటలతో ఆయన ఆడుకునే తీరంటే ఇంకా చాలాచాలాచాలా చాలాచాలాచాలాచాలా ఇష్టం.
 హాసంలో ఆయన రాసిన ‘ఎందరో మహానుభావులు’ చదివి చాలా ఆశ్చర్యపోయాను. 
తర్వాత ఆయన సాహితీఅభిలాష గురించి తెలుసుకుని అభిమానినైపోయాను.
అలాంటిది ఆయన్ని ఇంటర్వ్యూ చేసే అవకాశం రావడం అంటే ఎగిరి గంతేయలేదుకానీ... 
మనసులో అంతపనీ చేశాను. ఆయనతో ఏం చెప్పిస్తే బాగుంటుంది... 
ఆయన సాహిత్యాభిమానం గురించి ఇప్పటికే చాలాచోట్ల పుంఖాను పుంఖాలుగా చెప్పేశారు. 
వ్యక్తిగత జీవితం గురించీ అడపాదడపా చెప్పేశారు.  కాబట్టి కాసేపు ఆలోచించాను.
ఏదడిగినా సరిగ్గా మాట్లాడని వ్యక్తుల దగ్గరికైతే ప్రిపరేషన్ తో వెళ్లాలి కానీ, భరణిలాంటి ప్రతిభావంతుల దగ్గరికెళ్లేటప్పడు ప్రిపరేషన్ కన్నా స్పాంటేనియస్గా మాట్లాడ్డమే కరెక్ట్ అనిపించింది.
సో, ఏం తేల్చుకోకుండానే ఆయనింటికి వెళ్లిపోయాను.

గేటు పక్కగా ఉన్న నేమ్ బోర్డు మీద ఆయన ఇంటి పేరు కనిపించింది... ‘సౌందర్య లహరి’ అని.
జగద్గురువు ఆదిశంకరాచార్యులవారి రచన అది. ఆహా, ఎంతైనా భరణిగారు కదా అనిపించింది.
సరే, పైకెళ్లాను. వెళ్లిన కొద్దిసేపటికి  పక్కా మన పక్కింటాయనలా లుంగీ పాతచొక్కాతో బయటికొచ్చారు.
కుశలప్రశ్నలయ్యాక దేనికీ ఆర్టికల్ అని అడిగారు. సండే మ్యాగజైన్ కోసం అని చెప్పాను. 
నా మనసులో మాట అర్థమైనట్టు... ‘నా వ్యక్తిగత జీవితం గురించి చాలాసార్లే చెప్పాను కదా... 
ఈసారి కొత్తగా ఏమైనా చేద్దామా’ అన్నారాయన. 
       

సడన్ గా అప్పటికప్పడు ఈ వెధవ బుర్రకి ఒక ఐడియా తట్టింది. అదేంటంటే... ఆయన నాటక రచయితగా సినిమా రంగానికి వచ్చారు. సినిమా నిర్మాణంలో దర్శకుడికీ రచయితకీ వేవ్ లెంత్ సరిగ్గా కుదరకపోతే అది ఫట్టే కాబట్టి ఎందరో దర్శకులతో పనిచేసిన  అనుభవాలను చెప్పిద్దామన్న ఐడియా తట్టింది. మనసులోనే వరసపెట్టి నాలుగైదు వీరతాళ్లు నాకునేనే వేసేసుకుని విషయం ఆయనకి చెప్పాను. ‘బావుంది, బావుంది... మంచి ఆలోచన’ అంటూ పెన్నూ పేపరూ పట్టుకుని వరసగా పేర్లు రాయడం మొదలుపెట్టారు. పూజారి పూజచేస్తుంటే చూసే భక్తుడిలా శ్రద్ధగా తలవంచి ఆయన ఏం రాస్తున్నారో చూస్తున్నా. ఏడు పేర్లు రాసి పెన్ను పక్కన పెట్టారు. వీళ్ల గురించి చెప్తాను అని పేపర్ నా చేతికిచ్చారు. ‘అయితే ఓకే’ అనగానే మొదలెట్టారు. నేను  వాయిస్ రికార్డర్ ఆన్ చేశాను. ఆ తర్వాత...
మీరే చదవండి.....
***********************************************

చిన్నప్పటి నుంచి నాకు లెక్కలంటే భయం. ఆ భయాన్ని తెలుగుమీద ఇష్టంగా మార్చుకున్నాను. సిగరెట్లకు ఆశుకవిత్వం చెప్పడంతో వెుదలుపెట్టి క్రమంగా నాటకాలు రాశాను, ఆ నాటకాల ద్వారా రాళ్లపల్లిగారితో పరిచయం అయితే, ఆ పరిచయం సినీరంగ ప్రవేశానికి నాంది అయింది. చిత్రపరిశ్రమలోకి వచ్చాక రచయితగా నాకు బ్రేక్‌ ఇచ్చిన వ్యక్తి... వంశీ.

వంశీ
నేను మద్రాసులో రాళ్లపల్లిగారింట్లో ఉన్నప్పుడు ప్రసాద్‌ ల్యాబ్స్‌లో ఎడిటింగ్‌ జరుగుతోంది. నన్ను పరిచయం చేస్తానని చెప్పి ఒకరోజు పొద్దున్నే ఆయన దగ్గరకు తీసుకెళ్లారు రాళ్లపల్లి. మేం లోపలికెళ్లేటప్పటికి మూవీయోలాలో 'గోపెమ్మ చేతిలో గోరుముద్ద' పాట చూసుకుంటున్నారు వంశీ. పరిచయాలయ్యాక... 'కామెడీ రాస్తావా' అన్నారు వంశీ. రాస్తానన్నాను. ఆయన నాకొక సిట్యుయేషన్‌ చెప్పి 'ఒకవారం రోజులు టైం తీస్కొని, ఏడు సీన్లు రాయండి' అన్నారు. సరేనని ఇంటికెళ్లి సాయంత్రానికల్లా ఏడు సీన్లు రాసుకుని తీసుకెళ్లాను. ఒక్కొక్కసీన్‌ చెప్తుంటే పగలబడి నవ్వారు వంశీ. చెప్పడం పూర్తయ్యాక 'మీరే నా తర్వాత సినిమా రచయిత' అన్నారు. అప్పటికే 'ప్రేమించుపెళ్లాడు' షూటింగ్‌ పూర్తయిపోయింది. కానీ దానికి నాతో ఏదైనా రాయించాలని పట్టుబట్టి టైటిల్స్‌కు ముందు ఒక కామెడీట్రాక్‌ రాయించుకున్నారు. ఆ సినిమాకి రావోజీరావుగారు నాకు 2000 రూపాయలు పారితోషికం పంపించారు. ట్రాజెడీ ఏంటంటే... ఆ డబ్బుల్ని రాళ్లపల్లిగారి అసిస్టెంట్‌ కొట్టేశాడు.

తర్వాత వంశీ 'ఆలాపన' సినిమాకి మాటలు రాశాను. అప్పట్లోనే ఆయన 'లేడీస్‌ టైలర్‌' కథ చెప్పారు. ఆ సినిమాతో మా కాంబినేషన్‌ సెన్సేషనల్‌ అయిపోయింది. వరసపెట్టి కనకమాలక్ష్మీ రికార్డింగ్‌ డాన్స్‌ట్రూప్‌, చెట్టుకింద ప్లీడర్‌, లింగబాబు లవ్‌స్టోరీ... ఇలా చాలా సినిమాలు చేశాం. 'లేడీస్‌టైలర్‌' తీసేటప్పుడు నేను ఆర్టిస్టులకు డైలాగులు చెబుతుంటే చూసి 'మీలో మంచి ఆర్టిస్ట్‌ ఉన్నాడండీ' అన్నారు వంశీ. నేను రంగస్థల నటుణ్ని అనే విషయం తెలీదాయనకి. 'నేను నాటకాలు వేసేవాణ్నండీ' అన్నాను. 'ఔనా, మరి నాకెందుకు చెప్పలేదు' అంటూ తన తర్వాత సినిమా 'కనకమాలక్ష్మీ రికార్డింగ్‌డాన్స్‌ ట్రూప్‌'లో దొరబాబు క్యారెక్టర్‌ ఇచ్చారు. ఆ సినిమాలోని 'సీతతో అదంత వీజీకాదు' అనే డైలాగ్‌తో బాగా పాపులరయిపోయాను.

క్రాంతికుమార్‌
క్రాంతిగారిని అందరూ 'సింహం' అనేవాళ్లు. ఆయన గురించి కథలుకథలుగా చెప్పి భయపెట్టేవారు. రాళ్లపల్లిగారు అప్పుడప్పుడూ ఆయనదగ్గరికి వెళ్తూ నన్ను కూడా రమ్మనేవారుగానీ భయంతో వెళ్లేవాణ్నికాదు. ఒకసారి... వేమూరిసత్యంగారితో కలిసి తప్పనిసరి పరిస్థితుల్లో వెళ్లాను. మేమెళ్లేసరికి క్రాంతికుమార్‌ సిగరెట్‌ కాలుస్తున్నారు. నాకూ ఆ అలవాటుంది. మిగతావాళ్లంతా ఆయనముందు సిగరెట్‌ తాగేవారు కాదు. ఒకసారి నా ముఖం చూసి 'ఏఁవయ్యా, సిగరెట్‌ తాగుతావా' అన్నారు క్రాంతిగారు. తాగుతానన్నాను. 'తీస్కో' అంటూ పెట్టె నా ముందుకి తోశారు. అప్పట్నుంచి మేం సిగరెట్‌ ఫ్రెండ్స్‌ అయ్యాం. ఎన్నో వందల సాయంత్రాలు ఆయనతో గడిపాను. ఆ సమయంలోనే 'శారదాంబ' కథ పుట్టింది. దానికి కథ, మాటలు రాశాను. అందులో 'బేబీరావు' అనే నీచమైన క్యారెక్టర్‌ చేశాను. 'సీతారామయ్యగారి మనవరాలు', '9నెలలు' సినిమాల్లో ప్రేక్షకులకు గుర్తుండిపోయే క్యారెక్టర్లు ఇచ్చారాయన.

రాంగోపాల్‌వర్మ
'రావుగారిల్లు' సినిమా షూటింగ్‌ జరుగుతున్నప్పుడు శివనాగేశ్వరరావు ద్వారా పరిచయమయ్యాడు రాంగోపాల్‌వర్మ. అప్పట్లో తను ఇంగ్లిష్‌ బాగా మాట్లాడేవాడు. అందుకని 'వీడు ఇంగ్లీషు మీడియం వాడు' అన్నారు పక్కనున్నవాళ్లు వేళాకోళంగా. పరిచయం పెరిగేకొద్దీ రామూనేనూ బాగా కనెక్టయ్యాం. ఒకసారి రాము దగ్గర్నుంచి కలవమని ఫోనొస్తే వెళ్లాను. నేనెళ్లేసరికి అన్నపూర్ణస్టూడియోస్‌లోని ఆఫీసులో డైరెక్టర్‌ కుర్చీలో కూర్చుని ఉన్నాడు తను. అదేంటన్నట్టుగా చూస్తే 'నేను సినిమా డైరెక్ట్‌ చేస్తున్నాను' అన్నాడు.
'అప్పుడేనా' అన్నాను. 'నువ్వు నా సినిమాకి రాస్తావో లేదో తెలీదుకానీ, నీ కంపెనీ నాకు బావుంటుంది' అన్నాడు రాము. తర్వాత 'శివ' సినిమా కథ చెప్పాడు. కొద్దిరోజుల తర్వాత ఫస్టాఫ్‌ డైలాగులు రాసి తీసుకెళ్లాను. అప్పటికి వంశీవి చాలా సినిమాలు చేసిన ప్రభావం నా మీద బాగా ఉంది. వెుత్తం కామెడీతో నింపేశాను. ఆ స్క్రిప్టు చూసి షాకయ్యాడు వర్మ.
'ఇదేంటి కామెడీ సినిమా చేశారు, నాది సీరియస్‌ సినిమా, ఒక్క కామెడీ డైలాగ్‌ కూడా ఉండటానికి వీల్లేదు' అన్నాడు.

'అయితే ఇది ఫ్లాపేనేవో' అనుకుని తను అడిగినట్టు రాశాను. ఆ సినిమా ఎంత పెద్ద హిట్టో అందరికీ తెలిసిందే. అందులో 'నానాజీ' క్యారెక్టర్‌కి ముందు నన్ను అనుకోలేదు. వేరెవరో నటుడిని అనుకున్నారు, కానీ అతను కాల్షీట్లు లేవన్నాడు. నేను స్క్రిప్టు రాసిచ్చాక అప్పుడప్పుడూ సరదాగా షూటింగ్‌కి వెళ్తుండేవాణ్ని. ఒకరోజు రామ్‌గోపాల్‌వర్మ 'భరణీ, నానాజీ వేషం మీరే వేసెయ్యండి' అన్నాడు ఉన్నట్టుండి. నావైపొకసారి చూసి 'ఈ గెటప్‌ ఓకే నాకు' అన్నాడు. అప్పట్లో నేను లాల్చీ జీన్స్‌పాంట్‌ వేస్తుండేవాణ్ని. పాన్‌, సిగరెట్‌ సరేసరి. కానీ, స్క్రిప్టు రాయడం వల్ల... ఆ పాత్ర ఎలా ఉండాలో నాకొక ఐడియా మనసులో ఉంది. అదొక తెలంగాణ ప్రాంతపు యాదవ యువకుడి వేషం. నేనిక్కడే పుట్టిపెరిగినవాణ్ని. ఇక్కడి సంస్కృతి నాకు బాగా తెలుసు. అందుకని కొద్దిసేపటితర్వాత లాల్చీ, పైజమా వేసుకుని బొట్టు, కళ్లకి సుర్మా పెట్టుకుని, తాయెుత్తు కట్టుకుని బుగ్గన పాన్‌తో రాము ఎదుటికెళ్లాను. 'పర్‌ఫెక్ట్‌, నాకిదే కావాలి' అన్నాడు. అదీ నానాజీ క్యారెక్టర్‌ వెనక కథ. తర్వాత రాము తీసిన 'గాయం'లో చేశాను. ఇప్పటికీ ఇద్దరం అప్పుడప్పుడూ ఫోన్‌లో మాట్లాడుకుంటుంటాం.

రాఘవేంద్రరావు
నేను చెన్నైలో ఉండేటప్పుడే రాఘవేంద్రరావుగారితో పరిచయం. ఆయన సినిమాలకు రాయకపోయినా రోజూ ఆయనింటికి వెళ్తుండేవాణ్ని. ఈ దశలో నేను చేసిన 'శివ' సినిమా హిట్టయింది. అప్పుడు నాకు ఆయన తీసిన 'జగదేకవీరుడు అతిలోకసుందరి'లో ఒక రోల్‌ ఇచ్చారు. తమాషా ఏంటంటే... అందులో రావుగోపాలరావుగారు ఒక వేషం వెయ్యాలి. అప్పుడాయనకు ఒంట్లో బాగోలేకపోతే ఆ పాత్రను రెండు భాగాలు చేసి ఫైట్ల కోసం రామిరెడ్డినీ, ఎంటర్‌టైన్‌మెంట్‌కి నన్నూ పెట్టారు. అప్పట్నుంచి రాఘవేంద్రరావుగారు తీసిన ప్రతీసినిమాలోనూ ఉన్నాను... ఇటీవలే విడుదలైన 'ఝుమ్మంది నాదం'తో సహా. 'పెళ్లిసందడి' సినిమా షూటింగులో ఒకసారి ఆర్టిస్టులందరం ఒక గదిలో చేరి కబుర్లు చెప్పుకుంటున్నాం. నేల మీద అరంగుళం మందాన దుమ్ము పేరుకుపోయి ఉంది. ఆ గదిలోకి అడుగుపెడుతూనే...
'ఏంటయ్యా బాబూ ఈ డస్ట్‌' అన్నారు రాఘవేంద్రరావు.

'స్టార్‌డస్ట్‌ సార్‌' అన్నాను వెంటనే. పెద్దగా నవ్వి చప్పట్లు కొట్టేశారు. మంచి హాస్యప్రియుడాయన. తమాషా ఏంటంటే... రాఘవేంద్రరావుగారి సినిమాల్లో ఒక్కదానికి కూడా నేను స్క్రిప్టు రాయలేదు. చాలాసార్లు రాయమని అడ్వాన్సులిచ్చారు కానీ నాకు కుదర్లేదు. ఆయనకి నా సాహిత్యం అన్నా నేను రాసిన శివస్తుతులన్నా చాలా ఇష్టం. ప్రతీ సంవత్సరం డిసెంబర్‌ 31న 'సరసవినోదిని' పేరుతో రాఘవేంద్రరావుగారి ఆఫీసులో ఒక సాహిత్య కార్యక్రమం ఏర్పాటు చేసేవారు. ఇటీవలి కాలంలో ఆ అలవాటు తప్పిందిగానీ... నేనివాళ కూర్చుందామన్నా ఆయన రెడీనే. అంత చనువుంది ఆయనతో.

ఇ.వి.వి.సత్యనారాయణ
ఈవీవీ వెుదటి సినిమా 'చెవిలోపువ్వు' డైలాగ్స్‌ నేనే రాశాను. అందులో భగవాన్‌ అనే పరమశాడిస్టు వేషం వేశాను. ఆసినిమా రిలీజయ్యాక ఒకసారి రైల్లో ఎక్కడికో వెళ్తూ నెల్లూరు స్టేషన్‌లో దిగితే అక్కడ ఇడ్లీలమ్ముకునే అతనొకడు నన్ను బూతులు తిట్టాడు. అంత ఇంపాక్ట్‌ ఉన్న పాత్ర అది. 'వారసుడు' సినిమాలోనూ మంచి క్యారెక్టర్‌ ఇచ్చారు ఈవీవీ. ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది 'ఆమె' సినిమాలో పాత్ర. అందులో మరదలి మీద కన్నేసిన దుర్మార్గుడైన బావ క్యారెక్టర్‌ అది. నటుడిగా నా కెరీర్‌కి చాలా హెల్ప్‌ అయిందా వేషం. నా ఖర్మేంటంటే, ఆ సినిమాకి నేనూ మా ఆవిడా మా మరదలూ వెళ్లాం. ఇంక చూడండి నా పరిస్థితి!

ఈవీవీ గొప్పదనం ఏంటంటే... ఆయన స్క్రిప్ట్‌ని అపారంగా గౌరవిస్తారు. టైటిల్స్‌ నుంచి శుభం కార్డు వరకూ ప్రతిసినిమాలోనూ ఏదోఒక కొత్తదనం కోసం తాపత్రయపడుతుంటారు.

ఎస్వీ కృష్ణారెడ్డి
నేను ఆల్‌వోస్ట్‌ పెన్ను మడిచి జేబులో పెట్టెయ్యడానికి కారణమైన వ్యక్తి ఎస్వీకృష్ణారెడ్డి. 'యమలీల'లో ఆయన ఇచ్చిన తోటరాముడి క్యారెక్టర్‌ నన్ను ఆర్టిస్టుగా ఎంత బిజీ చేసిందంటే... ఆ సినిమా రిలీజైన ఏడాదిలో నేను 27 సినిమాల్లో నటించాను. అందులో 'చెల్లి పెళ్లి... జరగాలి మళ్లీమళ్లీ' లాంటివి విని ఆ సినిమాలో డైలాగ్స్‌ నేనే రాశాననుకున్నారు చాలామంది. కానీ నేను ఒక్క అక్షరమ్ముక్క కూడా రాయలేదు. ఆ క్రెడిట్‌ అంతా రచయిత దివాకర్‌బాబుదే. ఆ సినిమా తర్వాత మావిచిగురు, వినోదం, ఘటోత్కచుడు... ఇలా ఎన్నో సినిమాల్లో నాకు మంచి క్యారెక్టర్లు ఇచ్చారు కృష్ణారెడ్డి.

కృష్ణవంశీ
'సముద్రం సినిమాలో చేపలకృష్ణ వేషం నువ్వే వెయ్యాలన్నా' అంటూ ఒకరోజు నాకు ఫోన్‌ చేశాడు కృష్ణవంశీ. తను నాకు 'శివ' సినిమా చేసేటప్పుడు పరిచయం. అప్పట్నుంచి మా ఇద్దరిమధ్యా మంచి అనుబంధం ఏర్పడింది.

'సముద్రం' సినిమాలో నేను చేసిన చేపలకృష్ణ వేషానికి తొలిసారి నంది పురస్కారం వచ్చింది. ఆ సినిమా షూటింగ్‌ చేస్తున్నప్పుడు రషెస్‌ చూసిన ప్రకాష్‌రాజ్‌ అదిరిపోయి, 'బాబోయ్‌ ఈయన ఇలా చేసేస్తుంటే నా పరిస్థితి ఏంటి' అని ఒకరోజు షూటింగ్‌ ఆపేసి తన క్యారెక్టర్‌ని బాగా అధ్యయనం చేసి మళ్లీ పోటాపోటీగా చేశాడు. ఆ సినిమా షూటింగ్‌ చేసేటప్పుడు చాలాకష్టపడ్డాం, కానీ అదంతా ఓ మధురానుభూతి.

తేజ
'శివ' సినిమా చేసేటప్పుడే తేజతో కూడా పరిచయం. ఆ సినిమాకి తను అసిస్టెంట్‌ కెమెరామెన్‌. 1999లో ఒకరోజు ఉత్తేజ్‌ నాకు ఫోన్‌ చేసి 'అన్నా, తేజ మీకొక కథ చెబుదామనుకుంటున్నాడు, అందులో మీకొక వేషం ఉంది, మీరు డబ్బులెక్కువ అడుగుతారేవోనని సంశయిస్తున్నాడు' అన్నాడు. 'సరే, అతని నెంబరివ్వు' అని అడిగి నేనే తేజకు ఫోన్‌ చేసి కథ చెప్పమన్నాను. తను చెప్పాడు. 'నీ కథ నాకు బాగా నచ్చింది. నేను చేస్తున్నాను, సినిమా విడుదలై వంద రోజులు ఆడిన తర్వాత నువ్వు నాకొక రూపాయి ఇవ్వు చాలు' అన్నాను. అదే ఉషాకిరణ్‌ మూవీస్‌ వారి 'చిత్రం'. 'చిత్రం' తర్వాత తన అన్ని సినిమాల్లో నాకు చక్కటి వేషాలిచ్చాడు తేజ. తనుతీసిన 'నువ్వునేను'లో నేను చేసిన క్యారెక్టర్‌ మంచిపేరుతో పాటు నాకు నంది అవార్డునూ తెచ్చిపెట్టింది. అంతకన్నా ఆనందకరమైన విషయమేంటంటే... ఆ సినిమా తర్వాత నేను వేరే సినిమా షూటింగ్‌కి వైజాగ్‌కి వెళ్లాను. కార్లో వెళ్తుంటే వూరంతా 'నువ్వునేను' వందరోజుల పోస్టర్లే. ఆ పోస్టర్లో నేనొక్కణ్నే ఉన్నాను. సాధారణంగా హీరోహీరోయిన్ల పోస్టర్లు వేస్తారు. వెంటనే తేజకి ఫోన్‌ చేసి అడిగితే 'మీరే సార్‌, మాకు హీరో' అన్నాడు. నిజంగా తన అభిమానానికి కళ్లల్లో నీళ్లు తిరిగాయి. ఆ పోస్టర్‌ని ఫ్రేమ్‌ చేయించి నా యింట్లో పెట్టుకున్నాను.

...రచయితగానూ నటుడిగానూ కెరీర్‌ పరంగా నన్ను అనేక మైలురాళ్లు దాటించిన దర్శకులతో ఇదండీ నా అనుబంధం. వీళ్లే కాదు, వి.వి.వినాయక్‌, త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ లాంటి ఈతరం దర్శకులతోనూ మంచి సంబంధాలు ఉన్నాయి. త్వరలో నా ఈ సినిమా అనుభవాలూ బాల్యజ్ఞాపకాలతో ఆత్మకథ రాయాలనుకుంటున్నాను.
దానికి నేను పెట్టాలనుకుంటున్న పేరు...
నలుపు, తెలుపు, కొంచెం కలరు.

Friday, October 29, 2010

రేపే చూడండి... జయప్రకాష్ రెడ్డి ‘ఏకపాత్ర నాటకం’ హైదరాబాద్ లో

అసలు విషయం టపా హెడ్డింగులోనే జెప్పేశాను కాబట్టి కొసరు విషయం చెబుతా...
సమయం:         రేపు సాయంత్రం, అనగా ది.అక్టోబరు 30, 2010 సాయంత్రం ఏడు గంటలకు
వేదిక:               మీ అభిమాన కళావేదిక రవీంద్రభారతిలో!

Sunday, September 19, 2010

విలన్ జయప్రకాష్ రెడ్డితో ముఖాముఖి


జయప్రకాష్ రెడ్డి ఇంటర్వ్యూ కోసం చాలా రోజుల నుంచి ప్రయత్నిస్తున్నా. ఎప్పుడు ఫోన్ చేసినా నాటకం రిహార్సల్స్ లోనో షూటింగ్ లోనో బిజీగా ఉండేవారు. పట్టువదలని విక్రమార్కుడిలా (స్వాతిముత్యంలో కమల్ హాసన్ లా :) అనాలేమో) ఫోన్ల మీద ఫోన్లు చేసి విసిగించి సాధించాను.

‘ చిత్రం భళారే విచిత్రం’ సినిమా చూసేటప్పుడు ఈయన్ని తొలిసారి గమనించాను. అందులో హీరోయిన్ మేనమామ క్యారెక్టర్. మాటిమాటికీ ‘గూచ్’ అని అరిచి హడలగొడుతుంటాడు. ఇంతకీ ఆ గూచ్ అనే పదానికి అర్థమేంటని అడిగితే... ‘పందుల్ని తోలేటప్పుడు అనే మాటట అది’ అని నవ్వేశారు జేపీ. 

అలాగే, రెడీ సినిమాలో నాజర్ ఒక సందర్భంలో ‘మీరు మీ భార్యను ఏమని పిలుస్తారు’ అని అడిగితే....


‘ఇంగేమని పిలుస్తానూ... ‘సేయ్, మేయ్, ద్ద’ అంటాను’ అనే డైలాగ్ నాకు చచ్చేంత ఇష్టం. ఇంటర్వ్యూ మధ్యలో అడిగిమరీ చెప్పించుకున్నానా డైలాగ్. ధనుష్ హీరోగా ఈ సినిమాని తమిళంలో రీమేక్ చేస్తున్నారట. అందులోనూ ఈ క్యారెక్టర్ మళ్లీ ఆయనకే ఇచ్చారట.  అరవ రీమేకులో ఈ డైలాగ్ ‘మేయ్, డేయ్...’ అని ఉంటుందంటూ తమిళ డైలాగు వినిపించారు. భలే తమాషాగా ఉంది.

ఆయన ఆఫీసుగదిలో బాపు గీసిన నవరసాల సెట్ బొమ్మలున్నాయి. వాటిని చూడగానే నాకో ఐడియా వచ్చింది. ఒకవైపు ఇంటర్వ్యూ చేస్తూనే ‘రౌద్రం... హాస్యం...’ అంటూ చాలా ఫొటోలు తీశాను(సాగర సంగమంలో ‘భంగిమా’ అన్నట్టు).  అడిగిన ఫోజు అడిగినట్టు పెట్టారాయన కూడా సరదాగా. మొత్తానికి అరగంట టైమిస్తానన్న జేపీ రెండున్నర గంటలు మాట్లాడారు. ఏం మాట్లాడారంటే....

============
నటుడిగా నేనివాళ ఈ స్థాయిలో ఉన్నానంటే అందుకు కారణం మా నాన్న సాంబిరెడ్డిగారే. సాధారణంగా పిల్లలు నాటకాలూ వేషాలంటూ తిరిగితే తిట్టే రోజుల్లోనే...   'దున్నపోతుల్లాగా అడ్డగాడిదల్లాగా తిరగకపోతే ఏదైనా మంచి నాటకం రాసి రిహార్సల్స్‌ చేసుకోవచ్చుగా' అంటుండేవారాయన.

నాటకాలంటే అంతిష్టం మా నాన్నకి. తాను స్వయంగా నటుడు. పద్యాలు బ్రహ్మాండంగా పాడేవారు. యూనివర్సిటీ(ఆంధ్ర) స్థాయిలో ఉత్తమనటుడి అవార్డు కూడా అందుకున్నారు. సో... నా నటజీవితానికి ఆదర్శం మా నాన్నగారే. నటుడే కాదు... ఆయన ఆలిండియా చెడుగుడు ఛాంపియన్‌ కూడా. స్పోర్ట్స్‌ కోటాలో పోలీస్‌ ఉద్యోగం వచ్చిందాయనకి.

తొలివేషం...
స్కూల్లో చదువుకునేటప్పుడు... రుద్రమదేవి నాటకంలో అంబదేవుడు అనే సామంతరాజు పాత్ర వేశాను. అదే నేను తొలిసారి స్టేజీ ఎక్కడం. నా క్యారెక్టర్‌కి రెండు పద్యాలున్నాయి. పద్యనాటకాలంటే పద్యం చివర్లో పొడుగ్గా రాగాలు తీసేవారు. అలా రాగాలు తీయడాన్ని 'జిలేబి చుట్టలు' అనేవాళ్లం. ఎంతసేపు రాగాలు తీస్తే అంత గొప్ప. అవేవీ లేకుండా భావప్రధానంగా పద్యం పాడటం నేర్చుకున్నాను. వెుత్తానికి నాటకం వేశాక అందరూ బాగా పాడాడు అని మెచ్చుకున్నారు.

స్కూలు చదువయిపోయాక గుంటూరు ఆంధ్రా క్రిస్టియన్‌ కాలేజీలో చేరాను. కాలేజీలో కూడా నిక్కర్లు వేసుకుని తిరిగేవాళ్లం మేం. ఆ టైములో సీనియర్లు 'స్టేజీ రాచరికం' అనే నాటకం వేస్తూ నన్నూ ఒక క్యారెక్టర్‌ వేయమన్నారు. అందులో నాది చెలికత్తె వేషం. తమాషా ఏంటంటే... ఆ నాటకానికి నాకు 'ఉత్తమనటి' బహుమతి కూడా వచ్చింది. అలా నా జీవితంలో మొట్టమొదటిసారి ఆంధ్రా క్రిస్టియన్‌ కాలేజీ అసెంబ్లీహాల్లో నాటకపోటీల్లో పాల్గొన్నాను. ఆ తర్వాత ఆ కాలేజీలో చదివినన్నాళ్లూ సాంస్కృతిక కార్యకలాపాలకు అనధికారిక హెడ్‌లాగా చూసేవాళ్లు లెక్చరర్లు. దాంతో కాలేజీలో పెద్ద స్టార్‌ని అయిపోయాను. ఆరోజుల్లో సన్నగా పొడుగ్గా ఉండేవాణ్ని. రమణారెడ్డితో పోల్చేవాళ్లు నన్ను. నేను కూడా అందుకు తగ్గట్టుగానే కామెడీపాత్రలే ఎక్కువగా చేసేవాణ్ని. పీయూసీ, బీఎస్సీ తర్వాత బీఈడీ కూడా అక్కడే పూర్తిచేశాను. తర్వాత గుంటూరు మున్సిపల్‌ హైస్కూల్లో టీచర్‌గా ఉద్యోగం వచ్చింది. అక్కడ నేను లెక్కల టీచర్‌గా పనిచేశానుగానీ అందరూ నన్ను డ్రిల్లు మాస్టారు అనుకునేవాళ్లు. ఎందుకంటే అక్కడ సాంస్కృతిక కార్యకలాపాలన్నీ నా ఆధ్వర్యంలోనే జరిగేవి.

సినిమాల్లోకి...

నా దగ్గర చదువుకున్న వాళ్లల్లో ఒక విద్యార్థి 'ప్రజాపోరు' అనే పత్రికపెట్టాడు. నల్గొండలో పెద్ద సభ ఏర్పాటు చేసి దానికి దాసరినారాయణరావుగారిని ఆహ్వానించాడు. గురువుగా నన్ను కూడా పిలిచాడు. అక్కడ మేవెుక నాటకం వెయ్యాలనుకున్నాం. కానీ దాసరి చివరిదాకా ఉండరని తెలిసింది. దాంతో నేను మైకందుకుని... 'దాసరిగారు రంగస్థలం నుంచి వచ్చినవారే, కాబట్టి మేం నాటకం వేస్తే చూడకుండా వెళ్లిపోతానని ఆయన అనరనే అనుకుంటున్నాను' అని చిన్న మెలికపెట్టాను. వెంటనే నన్ను పిలిచారాయన. 'భలే ఫిట్టింగ్‌ పెట్టావయ్యా, నిజంగానే నాకు చాలా పనుంది, వెళ్లిపోదామనుకున్నాను. నువ్వంతమాట అన్నావు కాబట్టి వెుదటి పావుగంటా చూసి వెళ్లిపోతాను, ఏమనుకోకు' అన్నారు. సరేనన్నాను. 'గప్‌చిప్‌' అనే నాటిక వేశాం ఆరోజు. పావుగంట మాత్రమే ఉంటానన్న దాసరి నాటిక వెుదలయ్యాక చివరిదాకా చూశారు. అయిపోగానే స్టేజిమీదికొచ్చి 'నేను నిజంగానే వెళ్లిపోదామనుకున్నాను, జయప్రకాష్‌ చిన్న ఫిటింగ్‌ పెట్టి ఆపేశాడు. కానీ ఇవాళ నేను వెళ్లిపోయుంటే ఒక గొప్ప నాటికని మిస్సయిపోయేవాణ్ని. గొప్ప ఆర్టిస్ట్‌ని చూడలేకపోయేవాణ్ని. నిజంగా ఇక్కడొక రత్నం ఉంది, అది ఉండాల్సింది ఇక్కడ కాదు... మా ఇండస్ట్రీలో... నేనిప్పటికే చాలామంది కొత్తవాళ్లకు అవకాశాలిచ్చాను. జయప్రకాష్‌కి కూడా ఇస్తాను, ఇండస్ట్రీలో స్థిరపడిపోతాడు' అన్నారు. చాలా ఆనందం వేసింది.

ఆ రోజు కార్యక్రమం అయిపోగానే నేను మామూలుగా గుంటూరుకెళ్లిపోయాను. వారం తిరక్కుండానే రామానాయుడిగారి దగ్గర్నుంచి ఫోనొచ్చింది. వెంటనే హైదరాబాద్‌ వచ్చాను. 'ఏంటయ్యా, దాసరినారాయణరావు నీ గురించి తెగ చెబుతున్నారు, ఏదో నాటకం వేశావంట నాక్కూడా చూపించు' అన్నారు. వేస్తానండీ అని చెప్పి నా ట్రూపులో ఆర్టిస్టులందరితో కలిసి అన్నపూర్ణస్టూడియోలో నాటకం వేశాను. నాయుడిగారికి కూడా విపరీతంగా నచ్చింది. ఎంతగా అంటే... పరిశ్రమలో నా ఎదుగుదలకి ఆయనే కారణమయ్యేంతగా. వెంటనే నాకు 'బ్రహ్మపుత్రుడు' సినిమాలో ఒక పోలీసు వేషం ఇచ్చారు. తర్వాత 'బొబ్బిలిరాజా', 'ప్రేమఖైదీ' ఇలా వరసగా అవకాశాలిచ్చారు. నెమ్మదిగా చిన్నాచితకా అవకాశాలు వస్తూనేఉండేవిగానీ ఆర్థికంగా చాలా ఇబ్బందిగా ఉండేది. ఎప్పుడూ అప్పులే. ధర్మాత్ములు ఎవరోఒకరు ఐదువేలూ పదివేలూ ఇస్తూనే ఉండేవాళ్లు. 1992 దాకా అలా జరిగిపోయింది. చూసీచూసీ ఇక విసిగిపోయి పిల్లలు పెద్దవాళ్లయిపోతున్నారు. వాళ్లని పైకితీసుకురావాలంటే నేను ఆర్థికంగా బాగుండాలి. దానికి ఈ ఫీల్డు సరిపోదు అనుకొని మళ్లీ గుంటూరుకి వెళ్లిఉద్యోగంలో చేరిపోయాను. పొద్దున ఆరునుంచి తొమ్మిది దాకా ట్యూషన్లు, అప్పట్నుంచి సాయంత్రం అయిదింటిదాకా స్కూలు, మళ్లీ రాత్రి తొమ్మిదిన్నరదాకా ట్యూషన్లు. ఈ రొటీన్‌లో పడి సినిమా, మద్రాస్‌ అనే మాటలకు స్పెల్లింగ్‌ మర్చిపోయాను. సినిమాలంటే ఇష్టం లేక కాదు. పిల్లలను మంచి స్థితికి తీసుకురావాలంటే అక్కడ కుదరదు కాబట్టి.

పునఃప్రవేశం...
ఒకసారి నా స్నేహితుడొకడు హైదరాబాద్‌ అపోలోలో ఏవో టెస్టులు చేయించుకుంటాను తోడు రమ్మంటే హైదరాబాద్‌ వెళ్లాను. ఆసుపత్రిలో ఉండగా వెనక నుంచీ 'ఏయ్‌ జయప్రకాష్‌' అని పిలుపు వినిపించింది. ఎవరాని వెనక్కితిరిగి చూస్తే రామానాయుడుగారు. 'ఏమైపోయావయ్యా ఇన్నాళ్లూ... అంతులేకుండా పోయావ్‌' అన్నారు. 'పిల్లలు పెద్దవాళ్లవుతున్నారు కదా, వాళ్ల కోసం మళ్లీ గుంటూరు వెళ్లిపోయాను' అంటుండగానే... 'అవేం కాదులేగానీ, వెంకటేష్‌బాబుతో సినిమా మొదలుపెడుతున్నాం. అందులో ఒక క్యారెక్టర్‌ ఉంది. నువ్వుపోయి సురేష్‌బాబుని కలువ్‌, నేను ఫోన్‌ చేసి చెప్తాను... కలవకుండా వెళ్లమాకు' అన్నారు. ఇండస్ట్రీని కాదనుకుని నేను గుంటూరు వెళ్లిపోయాక కూడా నాకు అవకాశాలిస్తా రమ్మంటూ పిలిచింది ఆయనొక్కరే. 'తోడికోడళ్లు', 'తాజ్‌మహల్‌' ...ఇలా చాలా సినిమాల్లో చెయ్యమని అడిగారు కానీ నేనే ఏదో ఒక సాకు చెప్పి తప్పించుకున్నాను. ఈసారి తప్పలేదు. వెళ్లి సురేష్‌బాబుని కలిశాను. అది 'ప్రేమించుకుందాం రా' సినిమా.

హీరోయిన్‌ తండ్రి, ఫ్యాక్షనిస్టు పాత్ర నాది.

ఆ క్యారెక్టర్‌ కోసం అప్పటికి అమ్రిష్‌పురి, నానాపటేకర్‌ లాంటి హిందీ నటుల్ని కూడా అనుకున్నారు. ఎవరూ నచ్చట్లేదు సురేష్‌బాబుకి. కొత్తనటుడైతే బాగుంటాడని ఆయన ఉద్దేశం. నాయుడుగారేవో నన్ను తీసేసుకోమని చెప్పారు. 'ఇప్పటికి ఐదేళ్ల నుంచి నటించట్లేదయ్యా ఇతను, కొత్తగానే ఉంటాడు, మంచి ఆర్టిస్ట్‌ కదా పెట్టేసెయ్‌' అన్నారు సురేష్‌బాబుతో. సందేహంగానే నాకు మేకప్‌టెస్ట్‌ చేశారు. కొన్నాళ్ల తర్వాత ఆ క్యారెక్టర్‌కి నన్ను ఒకే చేశామని కబురొచ్చింది.

సరే వెళ్లాను, కథ చెప్పారు. అంతా విన్నాక సడన్‌గా నాకు ఒక ఐడియా వచ్చింది. నాకు కాలేజీ రోజుల్లో నంద్యాల, కోయిలకుంట్ల, గిద్దలూరు ప్రాంతాలకు చెందిన స్నేహితులుండేవారు. వాళ్లంతా రాయలసీమ భాష మాట్లాడుతుండేవారు. వినగావినగా నాకూ ఆ యాస పట్టుబడింది. ఎలాగూ ఫ్యాక్షనిస్టు పాత్రే కాబట్టి సీమయాసలో డైలాగ్స్‌ చెబుతానని పరుచూరి వెంకటేశ్వరరావుగారికీ, సురేష్‌బాబుకీ చెప్పాను. సరే అన్నారు.

ఆ యాస మీద పూర్తిపట్టు కోసం నంద్యాల, ఆళ్లగడ్డ ప్రాంతాల్లో పదిహేనురోజులపాటు తిరిగాను. ఒక టేప్‌రికార్డర్‌ పెట్టుకుని మారుమూల కుగ్రామాలకు వెళ్లి అక్కడివారితో మాట్లాడాను. రాత్రికి కూర్చుని రాయలసీమ పదాలకు సమానార్థకాలు రాసుకునేవాణ్ని. తర్వాత హైదరాబాద్‌కొచ్చి ఆ భాషలో మాట్లాడితే పరుచూరి వెంకటేశ్వరరావు 'అచ్చం, అక్కడివాళ్లలాగే మాట్లాడుతున్నావు కదయ్యా' అని ఆశ్చర్యపోయి 'బాగుంది, కంటిన్యూ అయిపోదాం' అన్నారు. అప్పుడొక షరతు పెట్టాను ఆయనకి. అదేంటంటే రేపటి సీన్‌ ఏంటో ముందురోజు సాయంత్రమే ఇమ్మనేవాణ్ని. వాళ్లు ఇస్తే దాన్ని రాయలసీమ భాషలోకి మార్చుకొని రిహార్సల్స్‌ చేసుకుని పొద్దుటికల్లా సిద్ధంగా ఉండేవాణ్ని. షూటింగ్‌ జరుగుతున్నప్పుడు యూనిట్‌ సభ్యుల స్పందన చూసి సినిమాతోపాటు ఆ పాత్ర కూడా పెద్ద హిట్టవుతుందని అర్థమైపోయింది అందరికీ.

ఆ సినిమా షూటింగ్‌ ముదిగుబ్బ ప్రాంతంలో చేశాం. కెమెరా ముందు నేను డైలాగులు చెబుతుంటే షూటింగ్‌ చూడ్డానికొచ్చిన స్థానికులు 'ఈయప్పది ఈణ్నేనే... యా వూరప్పా నీదీ' అని అడిగేవారు. అంతలా మమేకమైపోయానా పాత్రలో. అనుకున్నట్టే సూపర్‌హిట్‌ అయింది సినిమా.

1997లో ప్రేమించుకుందాం రా... 98లో శ్రీరాములయ్య... 99లో సమరసింహారెడ్డి... ఇలా వరసహిట్లు రావడంతో... 'ఇంక ఫర్వాలేదు, పరిశ్రమలో నిలదొక్కుకున్నట్టే అనుకుని స్వచ్ఛంద పదవీవిరమణ చేసి 2000 సంవత్సరంలో హైదరాబాద్‌కి వచ్చేశాను. 'సమరసింహారెడ్డి' చేశాక విపరీతమైన పేరొచ్చిందిగానీ మళ్లీ మూణ్నెల్ల దాకా సినిమాలు రాలేదు. 'ఇదేంట్రా' అనుకుంటున్నంతలో శ్రీనువైట్ల 'నీకోసం'లో ప్రధానపాత్ర ఆఫర్‌ చేశాడు. ఆ తర్వాత వెంటవెంటనే ఆఫర్లు రావడం వెుదలుపెట్టాయి. సీరియస్‌ క్యారెక్టర్లతో పాటు కామెడీ పాత్రల్లోకి కూడా షిఫ్టయిపోయాను. నిజానికి నాకు హాస్యం చేయడమే ఇష్టం. 'ప్రేమించుకుందాం రా' కన్నా ముందే 'జంబలకిడిపంబ'లో పిల్లకొజ్జా వేషం వేశాను. 'చిత్రం భళారే విచిత్రం' సినిమాలోనూ నాది కామెడీ విలన్‌ పాత్రే. 'గూచ్‌' అంటుంటాను మాటిమాటికీ. 'నీకోసం' సినిమాలో శ్రీనువైట్ల సీరియస్‌ విలన్‌ పాత్రే ఇచ్చినా ఆనందం, ఢీ, రెడీ... ఇలా తన తర్వాతి సినిమాలన్నింటిలోనూ నాకోసం కొత్తకొత్త పాత్రలు సృష్టించాడు. ఒక్క శ్రీను అనే కాదు... నేటి యువ దర్శకులందరూ రత్నాలే.

మనకున్న దర్శకుల్లో చాలా తెలివైన దర్శకుడు, మేధావి కృష్ణవంశీ. 'మహాత్మ' సినిమా వెుదటిరోజయితే... 'ఏమిట్రా, ఇలా విసిగిస్తున్నాడు' అనుకున్నాను. కానీ రోజులు గడిచేకొద్దీ తను ఆలోచించే తీరు చూసి ఆశ్చర్యం వేసేది. అతని పరిశీలనాశక్తిని చూశాక 'ఇన్నేళ్ల అనుభవం ఉండి నాకెందుకీ ఆలోచన రాలేదు' అనిపించేది. వృత్తిపరంగా ఇటీవలికాలంలో నాకు అత్యంత సంతృప్తినిచ్చిన పాత్ర 'మహాత్మ'లో చేసిన క్యారెక్టరే.

కుటుంబం విషయానికొస్తే... మాకు ఇద్దరు పిల్లలు. అబ్బాయి గుంటూరులో స్థిరపడ్డాడు. అమ్మాయి విజయవాడలో ఉంటుంది. ఎప్పుడైనా ఖాళీ దొరికితే వెళ్లి, ఒకపూట అక్కడా మరొకపూట ఇక్కడా ఉండి వస్తుంటాం. అక్కడికెళ్లినప్పుడు మనవలతో కాలక్షేపం. వాళ్లు 'తాతా' అనిపిలుస్తుంటే అదో ఆనందం.

అసలుకన్నా వడ్డీ ముద్దంటారు కదా!

ఇలా ఎన్నెన్నో ఒడుదొడుకులూ ఇంకెన్నో మజిలీలూ మరెన్నో మైలురాళ్లతో ఈశ్వరుడి దయవల్ల నా జీవితం ఇలా సంతృప్తికరంగా సాగిపోతోంది.

శివయ్య దయ
శివుడు మా కులదైవం. శ్రీశైల మల్లన్న సన్నిధిలో ఎంతసేపున్నా నాకు తనివితీరదు. నేనివాళ ఈ స్థాయిలో ఉన్నానంటే దానికి కారణం ఆ శివయ్యే. ఏటా నేను శివదీక్ష తీసుకుని మహాశివరాత్రినాటికి శ్రీశైలం వెళ్లొస్తుంటాను. అక్కడ నాపేరు మీద ఒక కాటేజీ కూడా ఉంది. ఈక్షణంలో నాకు సినిమా అవకాశాలేవీ లేకపోయినా దిగుల్లేదు. మా ఆవిడతో సహా అక్కడికి వెళ్లిపోయి నాకొచ్చే ఫించన్‌తో ఆ శివయ్య సన్నిధిలో ప్రశాంత జీవితం గడిపేస్తాను.

నాటకాలంటే ఇష్టం
మనదగ్గర ఆదరణ తగ్గింది కానీ... కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో నాటకం ఇంకా బతికే ఉంది. అక్కడ డబ్బులు పెట్టి నాటకాలు చూస్తుంటారు. సినిమాలో రిహార్సల్స్‌, రీటేకులు ఉంటాయి. నాటకంలో అవేవీ ఉండవు. ప్రేక్షకుల స్పందన అక్కడికక్కడే తెలిసిపోతుంది. అందుకే నాకు అందులోనే ఎక్కువ తృప్తి లభిస్తుంది. ఈమధ్య రవీంద్రభారతిలో ఏకపాత్ర నాటకం వేశాను. అందులో నాది మొండివాడైన మేజర్‌ పాత్ర. చివర్లో ఆ క్యారెక్టర్‌కి గుండెపోటు వస్తుంది. నేను నొప్పితో విలవిల్లాడిపోయినట్టు నటిస్తున్నాను. ప్రేక్షకుల్లో ఒకావిడ... 'అయ్యో, అయ్యో ఏవండీ, ఏదైనా టాబ్లెట్‌ వేసుకోమని చెప్పండి' అని ఏడుస్తూ అరిచేసింది. ‘వాడు వేసుకోడే, మొండి లం...కొడుకు, వాడెందుకు వేసుకుంటాడు’ అని ఏడ్చేశాడు పక్కనే ఉన్న ఆవిడ భర్త. ఒక నటుడిగా ఇంతకంటే తృప్తి ఇంకేం కావాలి చెప్పండి?

Tuesday, August 24, 2010

‘రేప్ అంటే తెలుసా నీకు?’

ఎడారి కన్నీళ్లు
అల్లంత దూరాన గుర్రాల కాలిగిట్టల చప్పుడు వినపడగానే గుండెల్లో వణుకు పుట్టి అది వెన్నుదాకా 
పాకుతుంటే ఎలా ఉంటుందో తెలుసా? 
నరరూప రాక్షసులు చుట్టుముడుతుంటే.... 
పసిమొగ్గల్ని ‘బలవంతంగా’ నలిపేస్తుంటే... 
సర్వస్వాన్నీ తగలబెడుతుంటే... ఆ నరకం ఎలా ఉంటుందో తెలుసా? 
మగాళ్లు మృగాలై ఒకరి తర్వాత ఒకరుగా... 
తనువంతా పచ్చిపుండవటం అంటే ఏమిటో తెలుసా? 
ఉన్న ఊరినీ కన్నవారినీ కోల్పోయి పరాయిదేశంలో తలదాచుకోవడం ఎంత నరకంగా ఉంటుందో తెలుసా? 
తెలుసుకోవాలనుకుంటే నా కథ చదవండి.... 


  కన్నుమూస్తే నరకం. 
కన్ను తెరిస్తే నరకం. 
ఇదీ మా సూడాన్.  ఇదే మా సూడాన్.
 నా పేరు హలీమా బాషిర్.  నేనొక డాక్టర్ని. 
ఆఫ్రికా ఖండంలోనే పెద్ద దేశమైన సూడాన్లో...
ఆడపిల్లకు చదువెందుకు అని ఆక్షేపించే ఒక మారుమూల గిరిజన తెగ మాది.
దార్ఫుర్ ప్రాంతంలోని ఆ తెగలో పుట్టిపెరిగిన నేను వైద్యురాలినయ్యానంటే అందుకు కారణం మా నాన్న. ఒకప్పుడు తన ప్రాణాలు కాపాడిన వైద్యురాలు హలీమా పేరు నాకు పెట్టారాయన. చిన్నప్పటి నుంచీ చదువులో చురుగ్గా ఉండే నేను డాక్టర్నవ్వాలని కోరుకునేవాడు.  ఆయన కలలు సాకారమయ్యాయి.  ఇరవైనాలుగేళ్లవయసులో ఎన్నో ఊహలతో వైద్యపట్టా పుచ్చుకుని యూనివర్సిటీ నుంచి బయటికొచ్చాను. కానీ నా ఊహలన్నీ ఊహలుగానే మిగిలిపోయాయి.  కారణం... మా దేశంలో దశాబ్దాలుగా సాగుతున్న అంతర్యుద్ధం ముదిరిపోయింది.  అప్పటికి కొత్తగా ఏర్ఫడిన ఇస్లామిక్ ప్రభుత్వానికీ స్థానికులకూ పొసగలేదు.  ప్రభుత్వ పక్షపాతాన్ని సహించలేక తిరగబడ్డారు నల్లవారు. ముష్కరమూకల దండుతో సమాధానం చెప్పింది ప్రభుత్వం.
ఒకవైపు స్థానిక నల్లజాతి తెగలు... మరోవైపు ముష్కరముఠాలు...
ఒకరి చెలగాటం... మరొకరికి ప్రాణసంకటం.
ప్రభుత్వం ఉసిగొల్పిన ఆ మూక పేరు... జంఝవీద్.
గుర్రాల మీద దుమ్ము రేపుకుంటూ ప్రవేశించే వారిలో ఒక్కొక్కడూ ఒక్కొక్క నరరూప రాక్షసుడు.
ఊళ్లకు ఊళ్లే తగులబెట్టడం, మగవారిని కాల్చి చంపెయ్యడం,
చిన్నాపెద్దా తేడా లేదు... స్త్రీ అయితే చాలు క్రూరాతిక్రూరంగా వారిపై తమ పశుబలం ప్రదర్శించడం.
నా దేశంలో జరుగుతున్న మారణహోమం గురించి ఒక పాత్రికేయుడికి చెప్పానొకసారి.
మర్నాటి పేపర్లో ఆ వార్త చూసి ప్రభుత్వం కన్నెర్రజేసింది. నన్ను ఓ మారు మూల గ్రామానికి బదిలీ చేసింది.
*            *            * 
ఆరోజు నాకిప్పటికీ బాగా గుర్తు... హాస్పిటల్లో ఉన్నాన్నేను. బయట ఏదో కలలకలం.
బయటికొచ్చి చూస్తే... ఎనిమిది నుంచి పదమూడేళ్లలోపు అమ్మాయిల్ని తీసుకొస్తున్నారు గ్రామస్థులు.
ఏమైందని అడిగాను. మానవజాతి సిగ్గుతో తలొంచుకునే విషయాలు చెప్పారు వారు.
వారంతా సమీపంలో ఉన్న పాఠశాల విద్యార్థినులు.
ఆ పసిమొగ్గల అందమైన భవిష్యత్తుకు పాఠాలతో బాటలు వేస్తున్న ఆ స్కూల్లోకి దూసుకొచ్చిందో జంఝవీద్ ముఠా. బలప్రయోగంతో తరగతిగదుల్లోకి ప్రవేశించారు కొందరు. ఇంకొందరు స్కూలు చుట్టూ కాపలా కాస్తున్నారు. లేళ్లగుంపుపై పడ్డ క్రూరమృగాల్లా పిల్లలపైనా టీచర్లపైనా పడ్డారు.
విషయం తెలిసి చుట్టుపక్కల ఉన్న తల్లిదండ్రులంతా స్కూలు దగ్గరికి పరుగులు తీశారు. 
వారు లోపలికెళ్లకుండా అడ్డుకున్నారు కాపలా రాక్షసులు. తిరగబడిన వాళ్లని రైఫఇల్ బట్ లతో అణిచేశారు. అయినా మాట విననివారిని కాల్చిపారేశారు. లోపల తమ పిల్లల జీవితాలు నాశనమైపోతుంటే నిస్సహాయంగా పొగిలిపొగిలి ఏడవటం తప్ప మరేం చేయలేక నిస్సహాయంగా కన్నీరుమున్నీరయ్యారా తల్లిదండ్రులు.  ముష్కరమూకలు నిష్క్రమించాక తరగతిగదుల్లోకి పరుగులు తీశారు.
తీవ్ర రక్తస్రావంతో షాక్ తో వేలాడిపోతున్న పిల్లల్ని చేతుల్లో వేసుకుని పగిలిన గుండెల్తో పరిగెత్తుకుంటూ ఆస్పత్రికి తీసుకొచ్చారు.
*            *            * 
నాకు వైద్యవిద్యను బోధించిన ఏ ప్రొఫెసరూ చెప్పలేదు... రేప్ కు గురైన ఎనిమిదేళ్ల చిన్నారికి ఏ వైద్యం అందించాలో! ఎంత ఆలోచించినా గుర్తుకురాలేదు... ‘ఏమైంది, నాకెందుకిలా జరిగింది’ అనే షాక్;లో కూరుకుపోయిన చిన్నారులను మనలోకంలోకి తీసుకువచ్చేదెలాగో!
నా కళ్ల వెంట నీళ్లు కారిపోతున్నాయా... ఏమో!
గుడ్లనీరు కుక్కుకుంటూనే కర్తవ్యం నిర్వర్తించాను.
ఈసారి ఈ దారుణం గురించి ఐక్యరాజ్యసమితి పరిశీలకులకు చెప్పాను.
వారం గడిచిందో లేదో ముగ్గురు సైనికులు నా క్లినిక్ కి వచ్చారు. ‘లే, నువ్వు మాతో వస్తున్నావు’ అంటూ నన్ను దౌర్జన్యంగా ఈడ్చుకెళ్లి జీపులో పడేసి దగ్గర్లో ఉన్న మిలటరీ క్యాంప్ కి తీసుకెళ్లారు.
నాకు అర్థమైపోయింది ఏం జరగబోతోందో!
*            *            * 
‘నీకు తెలుసా అసలు రేప్ అంటే ఏమిటో?’
కర్కశత్వానికి రూపం వస్తే వాడిలాగానే ఉంటుందేమో!
‘నువ్వు డాక్టరువి కాబట్టి నీకు తెలుసనుకుంటున్నావేమో’
ఇంకొక కర్కోటకుడి వెక్కిరింపు.
‘అందులో బాగా ఆరితేరిన మేం చూపిస్తాం నీకు, రేప్ అంటే ఏంటో’
మూడోవాడి ముక్తాయింపు.
నోట్లోగుడ్డలు కుక్కి సిగరెట్లు కాల్చి వాతలు పెడుతూ కత్తులతో ఒళ్లంతా గాట్లు పెడుతూ...
ఒకరి తర్వాత ఒకరుగా...
రెండురోజుల నరకమది.
క్షణమొక యుగం.
మూడోరోజు పొద్దున తలుపు తెరుచుకుంది. 
‘అప్పుడు కాదు, ఇప్పుడు చెప్పు లోకానికి... రేప్ జరిగిందని. ఈ మాట అందరికీ చెప్పడానికే నిన్ను ప్రాణాలతో వదిలిపెడుతున్నాం’ అంటూ నన్ను తీసుకెళ్లి ఎడారిలో వదిలేశారు. నాకింకా భూమ్మీద నూకలు మిగిలే ఉన్నాయి. ఒంటెమీద అటుగా వెళ్తున్న ఒక వ్యక్తి నా మీద దయతలిచాడు. తన ఒంటెమీద చోటిచ్చి మా ఊరికి చేర్చాడు. తడబడే అడుగులతో ఇంటికి చేరాను
...........
గుమ్మం దగ్గరే ఉంది అమ్మ.  జీవచ్ఛవంలా నడిచొస్తున్న నన్ను నమ్మలేనట్టుగా చూసింది. మళ్లీమళ్లీ చూసింది. ఇంతలో లోపలినుంచి వచ్చాడు నాన్న. అప్పటిదాకా ఉగ్గబట్టుకున్న ఏడుపుని ఇంక ఆపుకోలేకపోయాను. భోరుమంటూ నాన్న భుజాల మీద వాలిపోయాను.
*            *            * 
కాలం అన్నిగాయాల్నీ మాన్పుతుందంటారు.
నిజమేనేమో, అమ్మానాన్నల ఓదార్పులో ఐదునెలలు గడిచాయి. ఊళ్లోనే ఉన్న క్లినిక్ లో వైద్యం చేస్తున్నాను. లండన్ లో ఉన్న బావ షరిఫ్ తో  అతని గైర్హాజరులోనే మా వివాహం జరిపించారు నాన్న.
అంతకు ముందు నా జీవితంలో ఒకేఒక్కసారి కలిశాను షరీఫ్ ని. అయినా మా తెగలో వరుణ్ని ఎంచుకునే స్వేచ్ఛ లేదు మాకు. 
కాలం అలా గడుస్తుండగా....
మరోసారి మా ఊరిమీదికి విరుచుకుపడ్డాయి 
జంఝవీద్ మూకలు... గుర్రాలమీద...
వారికి తోడుగా సైనికులు... రాబందుల్లా హెలికాప్టర్ల మీదా...
నాన్నకు విషయం అర్థమైంది. నావైపు తిరిగి...
‘పారిపో, అమ్మనీ చెల్లెళ్లనీ తమ్ముళ్లనీ తీసుకుని పారిపో’ అని గట్టిగా అరిచాడు.
అరుపులు పూర్తి కాకమునుపే రాకెట్ లాంచర్లు దూసుకొచ్చాయి. బాంబులు పేలాయి.
నేను పరిగెడుతున్నాను.
సర్వనాశనమైపోతోంది. 
చూస్తుండగానే ఊరుమొత్తం తగలబడిపోతోంది.
దారిపొడుగునా క్షతగాత్రుల హృదయవిదారకమైన అరుపులు... 
ఒక్క క్షణం ఆగినా ప్రాణాలు దక్కని పరిస్థితి.  
పసిబిడ్డలను పొత్తిళ్లలో్ పట్టుకుని తల్లులు.... 
తమకన్నా చిన్నపిల్లల్ని గట్టిగా పట్టుకుని పెద్దపిల్లలూ అందరూ ఒకటే పరుగు. ప్రాణాలు దక్కించుకోవాలనే ఆరాటం.
ఊరుదాటి దూరంగా ఉన్న అడవిలోకి పరుగుతీశాం. హెలికాప్టర్లు వేటాడలేనంత లోపలికి దూరిపోయాం. ప్రాణాలరచేతబెట్టుకొని చప్పుడు చేయకుండా బిక్కుబిక్కుమంటూ ఒకచోట కూర్చున్నాం. 
దూరంగా గాలి అలల్లో తేలుతూ లీలగా వినపడుతోంది ఒకపాట... జంఝవీద్ ముఠాకి అత్యంత ఇష్టమైన పాట అది. వారి పెదాల వెంట ఎఫ్పుడూ వినిపించే పాట...
‘‘చంపండి నల్లబానిసల్ని
చంపండి నల్లగాడిదల్ని
చంపండి నల్లకుక్కల్ని
చంపండి నల్లకోతుల్ని
ఒక్కరూ తప్పించుకోలేరు... అందర్నీ చంపేస్తాం’’ 
పాటవింటున్న మా అందరిలోనూ విషాదం.
దూరంగా గాల్లోకి పొగలు లేస్తూ కనిపించాయి. అది మా ఊరే.
తెల్లారాక భయంభయంగా ఊళ్లోకి అడుగుపెట్టాం. అది మా ఊరేనా...?
ఎటుచూసినా శవాలగుట్టలు.
ఘోరకలి అది.
ఏడవటానికి శక్తి కూడా లేదు. 
నిస్సత్తువగానే... మృతదేహాల్ని బళ్ల మీద వేసుకెళ్లి ఖననం చేశాం.
రాత్రి పరుగులో అమ్మా తమ్ముళ్లూ ఎక్కడ తప్పిపోయారో తెలీదు. అసలున్నారో లేదో ఆచూకీ తెలియదు. 
నాన్న బతికున్నారో లేదో కూడా తెలీదు.
నేనిప్పుడు ఒంటరిని.
ఈ ఒంటరిపక్షిపైనా రహస్యపోలీసులు ఓ కన్ను వేసే ఉంచారు.
వాళ్ల అకృత్యాల గురించి రెండుసార్లు నోరెత్తింది నేనే మరి. నన్ను మళ్లీ నిర్బంధించాలన్న వారి నిర్ణయం గురించి ముందే తెలిసిపోయింది. ఊరివారందరూ కలిసి నన్ను అక్కణ్నుంచి తప్పించారు. ఎడారి దారుల్లో ప్రయాణించి న్యూబా చేరుకున్నాను. అది... దార్ఫుర్ నుంచి ప్రాణలరచేత పెట్టకుని పారిపోయి వచ్చే మాలాంటి శరణార్థులకు సురక్షిత ప్రదేశం. కానీ నాకు అక్కడా రక్షణ లేదు. మనుషుల్ని అక్రమంగా రవాణా చేసే ఒక ట్రాఫికర్ని పట్టుకున్నాను. నా దగ్గరున్న డబ్బూ అమ్మమ్మ నగలూ అన్నీ అతని చేతుల్లో పోసి ఎలాగైనా లండన్లో ఉన్న మా బావ షరీఫ్ దగ్గరకు చేర్చమన్నాను. క్షణక్షణగండంగా కొన్నిరోజులక్కడే గడిపాను. ఏర్పాట్లు పూర్తయ్యాయి. పుట్టినగడ్డని వదిలిపెట్టి పరాయిపంచకు చేరే సమయం ఆసన్నమైంది. మాతృభూమికి కన్నీటి వీడ్కోలు పలికాను. 2005లో లండన్ కు చేరుకున్నాను. అష్టకష్టాలు పడి షరీఫ్ ని కలుసుకోగలిగాను. బ్రిటన్ ప్రభుత్వం నా గాథను వింది. బాధను అర్థం చేసుకుంది. సాదరంగా ఆశ్రయమిచ్చింది. ఇక్కడే ఉంటూ సూడానీ మహిళల ప్రతినిధిగా నా గళాన్ని ప్రపంచానికి వినిపించాను. అంతర్జాతీయ మానవహక్కుల దినోత్సవం నాడు (అప్పటి)అమెరికా అధ్యక్షుడు జార్జిబుష్ ని కలిసి మా దేశంలో జరుగుతున్న నరమేధం గురించి వివరించాను. సూడాన్ మహిళల ఆక్రందనలను వైట్ హౌస్ లో ప్రతిధ్వనించగలిగాను. మాకు జరుగుతున్న అన్యాయాన్ని మరింత విస్తృతంగా ప్రపంచం దృష్టికి తేవడమే నా ముందున్న లక్ష్యం. 
ఇప్పటికీ నాకు ప్రాణభయం ఉంది. 
సూడానీ రహస్య ఏజెంట్లు నన్ను ఇప్పుడు ఇంకా ఎక్కువగా నీడలా వెంటాడుతున్నారు. వేటాడుతున్నారు. 
ఏ క్షణంలో నేనేమవుతానో నాకు తెలియదు. 
అందుకే.... యుద్ధాల కారణంగా అందరికన్నా ఎక్కువగా మహిళలూ పిల్లలే ఎలా నలిగిపోతున్నారో ప్రపంచానికి చాటిచెప్పాలంటే ఆ ఘోరకలిని అక్షరబద్ధం చేయడమే మంచిదనిపించింది. 
అందుకు నా జీవితం కంటే పెద్ద ఉదాహరణ ఏముంది! 
అందుకే నా జీవితాన్నే పుస్తకంగా రాశాను.
ఆ పుస్తకమే.... టియర్స్ ఆఫ్ ద డెజర్ట్.
ఎడారి కన్నీళ్లు!
*            *            * 
ఈ విశాల ప్రపంచం ఒక శరీరం అనుకుంటే...
అందులో మా సూడాన్ ఓ రక్తమోడుతున్న గాయం.
ఆ గాయం నయమవ్వాలి. ఆ బాధ అంతమవ్వాలి. అదే మా కోరిక.

Thursday, August 19, 2010

ప్రపంచాన్ని కదిలించిన ఫొటో (ఈరోజు వరల్డ్ ఫొటోగ్రఫీ డే)

వాంటింగ్ ఏ మీల్

అల్లంత దూరంలో ఆహార కేంద్రం.... అందాకా వెళ్లలేని దైన్యం...
వెనుకనే రాబందు రెక్కల నీడ...
ఆకలి తీరడానికి కొన్ని అడుగులే ఎడం...
రాబందుకూ... ఆ చిన్నారికీ కూడా ఆహారం కావాలి.
వాంటింగ్ ఏ మీల్...
మరి ఇద్దరిలో ఎవరి ఆకలి తీరింది?
గత పదహారేళ్లుగా జవాబు దొరకని ప్రశ్న... ప్రపంచాన్ని కన్నీళ్లు పెట్టించిన ప్రశ్న...
దక్షిణాఫ్రికా ఫొటోగ్రాఫర్ కెవిన్ కార్టర్కు పులిట్జర్ బహుమతినీ అందులేని ప్రశంసల్నీ సంపాదించిపెట్టిన ఈ ఫొటో అతనికి అంతకు మించిన విమర్శల్నీ అంతులేని నిర్వేదాన్నీ మిగల్చింది. ఆత్మహత్య చేసుకునేంత సంఘర్షణా కల్పించింది.

ఎండ నెత్తిని మాడ్చేస్తోంది. అప్పటికి 20 నిమిషాలుగా వేచి చూస్తున్నాడు 32ఏళ్ల ఫొటో జర్నలిస్టు కెవిన్ కార్టర్...
ఆ రాబందు రెక్కలు విప్పుతుందేమోనని.
*                              *                              *
రాబందు కూడా ఎదురు చూస్తోంది...
కొన్ని అడుగుల దూరంలో నేలకరుచుకుని పడున్న ఆ చిన్నారిని...
ఆ పాప ఊపిరి ఎప్పుడు ఆగిపోతుందా అని..
*                              *                              *
కెవిన్ సహనం చచ్చిపోయింది. కెమెరా క్లిక్మంది. అక్కణ్నుంచి నిరాసక్తంగా కదిలాడు. రాబందు ముందు ఆకలితో పడున్న పాపను వదిలి తన దారి తను చూసుకున్నాడు.
సూడాన్ లో కరాళనృత్యం చేస్తున్న కరవు ఫొటోలు తీయడానికి వచ్చిన కెవిన్ కి ఇంకా తెలీదు... తాను తీసిన ఫొటో ఎంత సంచలనాన్ని సృష్టించబోతోందో!
హృదయాల్ని కదిలించే సూడాన్ కరవు ఫొటోల కోసం ఎదురుచూస్తున్న ‘న్యూయార్క్ టైమ్స్’ పత్రిక కెవిన్ తీసిన ఆ ఫొటోను కొని 1993 మార్చి 26న ‘వాంటింగ్ ఏ మీల్’ అనే క్యాప్షన్ తో ప్రచురించింది.
ఆ రోజు ఉదయం పేపర్ మార్కెట్లోకి విడుదలైన కొద్దిసేపటి నుంచే ‘ఆ అమ్మాయి పరిస్థితేమిటి, బతికే ఉందా?’ అంటూ ఆ పత్రిక ఆఫీసుకి వందలకొద్దీ ఫోన్ కాల్స్ రావడం మొదలైంది.

‘ఆ ఫొటో తీసినప్పుడు అక్కడున్నది ఒక రాబందు కాదు... రెండు రాబందులు. ఆకలితో అలమటిస్తున్న పాపను ఆహారకేంద్రానికి తీసుకెళ్లకుండా కెమెరా లెన్స్ సరిచూసుకున్న కెవిన్ కార్టరే ఆ రెండో రాబందు’ అంటూ ప్రపంచం నలుమూలల నుంచీ మానవతావాదుల విమర్శలు వెల్లువెత్తాయి. ఆ ప్రశ్నకు సమాధానం చెప్పలేక విమర్శలకు తట్టుకోలేక మానసికంగా కుంగిపోయాడు కెవిన్.
*                              *                              *
ఏప్రిల్ 2, 1994
‘వాంటింగ్ ఏ మీల్’ ఫొటోకుగాను కెవిన్ కి పులిట్జర్ బహుమతి వచ్చినట్టు ప్రకటించారు. ఆ ఏడాది మే 23న కొలంబియా యూనివర్సిటీ గ్రంథాలయంలో జరిగిన కార్యక్రమంలో కన్నీళ్లతో పులిట్జర్ అవార్డును స్వీకరించాడు కెవిన్.
*                              *                              *
కెవిన్ కార్టర్
ఎన్నో దశాబ్దాల క్రితం యూరప్ నుంచి దక్షిణాఫ్రికాకు వలసవచ్చి జోహాన్నెస్ బర్గ్ లో స్థిరపడిన శ్వేతజాతి కుటుంబంలో పుట్టాడు కెవిన్. నల్లవారు తమ హక్కుల కోసం పోరాడుతున్న కాలం అది. అధికారంలో ఉన్న తెల్లవారు స్థానికులపై సాగించే జులుం చూసి చిన్నప్పటి నుంచి బాధపడేవాడు. ‘వారికోసం మనమేం చెయ్యలేమా’ అని తల్లిదండ్రులను అడిగేవాడు. యుక్తవయసు వచ్చాక సైతాఫ్రికన్ డిఫెన్స్ ఫోర్స్ లో చేరాడు. ఓసారి తన తోటి సైనికులు ఒక ఆఫ్రికన్ ను కొడుతుంటే అడ్డుకున్నాడు. ‘నల్లవాళ్లను వెనకేసుకొస్తావురా... నిగ్గర్ లవర్ (బానిసలను ‘నిగ్గర్’లంటారు) అంటూ వారు కెవిన్ని చితకబాదారు. దాంతో అతను డర్బన్ పారిపోయాడు. అక్కడ సరైన ఉద్యోగమేదీ దొరక్క నిద్రమాత్రలూ ఎలుకలకు పెట్టే విషం మింగి ఆత్మహత్యకు ప్రయత్నించాడు. ఎవరో చూసి ఆస్పత్రిలో చేర్పించడంతో బతికాడు. వేరే దారిలేక మళ్లీ జోహాన్నెస్ బర్గ్ కే వచ్చి సైన్యంలో చేరాడు. అక్కడ ఓ బాంబు పేలుడులో గాయపడి సర్వీసు నుంచి బయటికొచ్చాడు. మళ్లీ ఉద్యోగాల వేట. ఈసారి ఓ కెమెరాల షాపులో పనికి కుదిరాడు. అదే అతని జీవితాన్ని మలుపు తిప్పింది.

చుట్టూ కెమెరాలు. వాటితోనే సహజీవనం. జీవం తొణికిసలాడే ఫొటోలు తీయడమెలాగో నేర్చుకున్నాడు. కొన్నాళ్లకు జోహాన్నెస్ బర్గ్ లోని ‘సండే ఎక్స్ ప్రెస్’ పత్రికలో పార్ట్ టైం క్రీడా ఫొటోగ్రాఫర్ గా చేరాడు. చేరింది స్పోర్ట్స్ ఫొటోగ్రాఫర్ గానే అయినా నగరంలో జరిగే అల్లర్లూ విధ్వంసాలను వీలైనంత దగ్గరగా చిత్రీకరించేవాడు. 1990 నాటికి దక్షిణాఫ్రికా విముక్తి పోరాటం ఉద్ధృతమైంది. తెల్లవాళ్లు వీధుల్లో ఒంటరిగా తిరగడానికి భయపడే పరిస్థతి వచ్చింది. దాంతో కెవిన్ అతని మరో ముగ్గురు స్నేహితులూ(ముగ్గురూ పొటోగ్రాఫర్లే) ఎప్పుడూ కలిసే తిరిగేవారు. ఎక్కడ వీధిపోరాటాలు జరుగుతన్నాయని తెలిసినా... బస్సు దహనాలూ రైలుపట్టాలు తొలగించడం లాంటివి జరుగుతున్నాయని తెలిసినా అందరికన్నా ముందే అక్కడ వాలిపోవడం, అరుదైన కోణాల్లో ఫొటోలు తీసి పత్రికలకు ఇవ్వడం... ఇదీ వారి దినచర్య. ఈ సాహసాలు చూసి ఓ పత్రిక వీళ్లకి బ్యాంగ్ బ్యాంగ్ క్లబ్ అని పేరు పెట్టింది. ఒకసారి నల్లవారు ఒక యువకుణ్ని పట్టుకుని విపరీతంగా హింసించి తగలబెట్టిన దృశ్యాల్ని చిత్రీకరించారు. ఈ టెన్షన్ల నుంచి సేదదీరడానికి మాదకద్రవ్యాలకు అలవాటుపడ్డాడు కెవిన్.
అల్లర్లుజరిగేటప్పుడు ఫొటోలు తీస్తూ...
1991లో... ఆఫ్రికన్ నేషనల్ కాంగ్రెస్ మద్దతుదారులైన నల్లవారు ఓ శ్వేత జాతీయుణ్ని హత్యచేస్తుండగా తీసిన ఫొటోకు గాను కెవిన్ స్నేహితుడైన ఊస్టర్ బ్రోక్ కు పులిట్జర్ అవార్డు వచ్చింది. అది కెవిన్లో పట్టుదలను పెంచింది. తన మరో స్నేహితుడైన సిల్వాతో కలిసి సూడాన్ కరవును చిత్రీకరించడానికి వెళ్లాడు. అక్కడ తీసిందే ఈ రాబందు ఫొటో. ఆ తర్వాత సిగ్మా సంస్థతోనూ రాయ్ టర్స్ వార్తాసంస్థతోనూ కాంట్రాక్టు కుదుర్చుకున్నాడు. మరణం అంచుల దాకా వెళ్లి అతను తీసే ఫొటోలు రోజూ అంతర్జాతీయ పత్రికల మొదటిపేజీల్లో పడేవి.

1994 ఏప్రిల్ 18న కెవిన్ తన మిగతా ఇద్దరు స్నేహితులతో కలిసి టొకోజా టౌన్ షిప్లో జరుగుతున్న అల్లర్లను చిత్రీకరించడానికి వెళ్లాడు. అక్కడ త్వరత్వరగా తన పని ముగించుకుని వెళ్లిపోయాడు. కానీ... అతని ప్రాణమిత్రుడు ఊస్టర్ బ్రోక్ ఆ అల్లర్లలో జరిగిన కాల్పుల్లో చనిపోయాడు. ఆ వార్త రేడియోలో విని చలించిపోయాడు కెవిన్. అతణ్నే తలచుకుని కుంగిపోయాడు. మాదకద్రవ్యాలకు మరింతగా బానిసయ్యాడు. దాంతో భార్య అతణ్ని విడిచిపెట్టి వెళ్లిపోయింది. పనితీరు సరిగా లేకపోవడంతో రాయ్ టర్స్ సంస్థతో సంబంధాలు దెబ్బతిన్నాయి.

చేతిలో డబ్బులేదు.... మిత్రుని మరణం.... భార్య లేదు... ఎటు చూసినా అప్పులు....
కెవిన్ కి ఒకటే మార్గం తోచింది.
*                              *                              *
1994, జులై 27....
కెవిన్ తన వ్యాన్ సైలెన్సర్ కు ఒక పైపు బిగించి దాన్ని కిటికీ గుండా లోపలికి చేరవేసి బండి స్టార్ట్ చేశాడు.
ఇయర్ ఫోన్స్ పెట్టుకుని వాక్ మన్లో తనకిష్టమైన పాటలు వింటూ కళ్లు మూసుకున్నాడు.
వ్యాన్ సీట్లో అతని పక్కనే ఒక ఉత్తరం...
‘తట్టుకోలేకపోతున్నాను, ఫోన్ లేదు... డబ్బులేదు... అప్పులు... కళ్లముందే ఘోరమైన చావులు, బతుకుపోరాటాలు, హాహాకారాలు, ఆకలితో పేగులు మాడిన చిన్నారులు... విసిగిపోయాను. నాకింక శక్తి లేదు. అందుకే వెళ్లిపోతున్నాను... నా స్నేహితుడు ఊస్టర్ బ్రోక్ దగ్గరికి... అంతటి అదృష్టం నాకు ఉంటే’