వాంటింగ్ ఏ మీల్
వెనుకనే రాబందు రెక్కల నీడ...
ఆకలి తీరడానికి కొన్ని అడుగులే ఎడం...
రాబందుకూ... ఆ చిన్నారికీ కూడా ఆహారం కావాలి.
వాంటింగ్ ఏ మీల్...
మరి ఇద్దరిలో ఎవరి ఆకలి తీరింది?
గత పదహారేళ్లుగా జవాబు దొరకని ప్రశ్న... ప్రపంచాన్ని కన్నీళ్లు పెట్టించిన ప్రశ్న...
దక్షిణాఫ్రికా ఫొటోగ్రాఫర్ కెవిన్ కార్టర్కు పులిట్జర్ బహుమతినీ అందులేని ప్రశంసల్నీ సంపాదించిపెట్టిన ఈ ఫొటో అతనికి అంతకు మించిన విమర్శల్నీ అంతులేని నిర్వేదాన్నీ మిగల్చింది. ఆత్మహత్య చేసుకునేంత సంఘర్షణా కల్పించింది.
ఎండ నెత్తిని మాడ్చేస్తోంది. అప్పటికి 20 నిమిషాలుగా వేచి చూస్తున్నాడు 32ఏళ్ల ఫొటో జర్నలిస్టు కెవిన్ కార్టర్...
ఆ రాబందు రెక్కలు విప్పుతుందేమోనని.
* * *
రాబందు కూడా ఎదురు చూస్తోంది...కొన్ని అడుగుల దూరంలో నేలకరుచుకుని పడున్న ఆ చిన్నారిని...
ఆ పాప ఊపిరి ఎప్పుడు ఆగిపోతుందా అని..
* * *
కెవిన్ సహనం చచ్చిపోయింది. కెమెరా క్లిక్మంది. అక్కణ్నుంచి నిరాసక్తంగా కదిలాడు. రాబందు ముందు ఆకలితో పడున్న పాపను వదిలి తన దారి తను చూసుకున్నాడు.సూడాన్ లో కరాళనృత్యం చేస్తున్న కరవు ఫొటోలు తీయడానికి వచ్చిన కెవిన్ కి ఇంకా తెలీదు... తాను తీసిన ఫొటో ఎంత సంచలనాన్ని సృష్టించబోతోందో!
హృదయాల్ని కదిలించే సూడాన్ కరవు ఫొటోల కోసం ఎదురుచూస్తున్న ‘న్యూయార్క్ టైమ్స్’ పత్రిక కెవిన్ తీసిన ఆ ఫొటోను కొని 1993 మార్చి 26న ‘వాంటింగ్ ఏ మీల్’ అనే క్యాప్షన్ తో ప్రచురించింది.
ఆ రోజు ఉదయం పేపర్ మార్కెట్లోకి విడుదలైన కొద్దిసేపటి నుంచే ‘ఆ అమ్మాయి పరిస్థితేమిటి, బతికే ఉందా?’ అంటూ ఆ పత్రిక ఆఫీసుకి వందలకొద్దీ ఫోన్ కాల్స్ రావడం మొదలైంది.
‘ఆ ఫొటో తీసినప్పుడు అక్కడున్నది ఒక రాబందు కాదు... రెండు రాబందులు. ఆకలితో అలమటిస్తున్న పాపను ఆహారకేంద్రానికి తీసుకెళ్లకుండా కెమెరా లెన్స్ సరిచూసుకున్న కెవిన్ కార్టరే ఆ రెండో రాబందు’ అంటూ ప్రపంచం నలుమూలల నుంచీ మానవతావాదుల విమర్శలు వెల్లువెత్తాయి. ఆ ప్రశ్నకు సమాధానం చెప్పలేక విమర్శలకు తట్టుకోలేక మానసికంగా కుంగిపోయాడు కెవిన్.
* * *
ఏప్రిల్ 2, 1994‘వాంటింగ్ ఏ మీల్’ ఫొటోకుగాను కెవిన్ కి పులిట్జర్ బహుమతి వచ్చినట్టు ప్రకటించారు. ఆ ఏడాది మే 23న కొలంబియా యూనివర్సిటీ గ్రంథాలయంలో జరిగిన కార్యక్రమంలో కన్నీళ్లతో పులిట్జర్ అవార్డును స్వీకరించాడు కెవిన్.
* * *
కెవిన్ కార్టర్ |
ఎన్నో దశాబ్దాల క్రితం యూరప్ నుంచి దక్షిణాఫ్రికాకు వలసవచ్చి జోహాన్నెస్ బర్గ్ లో స్థిరపడిన శ్వేతజాతి కుటుంబంలో పుట్టాడు కెవిన్. నల్లవారు తమ హక్కుల కోసం పోరాడుతున్న కాలం అది. అధికారంలో ఉన్న తెల్లవారు స్థానికులపై సాగించే జులుం చూసి చిన్నప్పటి నుంచి బాధపడేవాడు. ‘వారికోసం మనమేం చెయ్యలేమా’ అని తల్లిదండ్రులను అడిగేవాడు. యుక్తవయసు వచ్చాక సైతాఫ్రికన్ డిఫెన్స్ ఫోర్స్ లో చేరాడు. ఓసారి తన తోటి సైనికులు ఒక ఆఫ్రికన్ ను కొడుతుంటే అడ్డుకున్నాడు. ‘నల్లవాళ్లను వెనకేసుకొస్తావురా... నిగ్గర్ లవర్ (బానిసలను ‘నిగ్గర్’లంటారు) అంటూ వారు కెవిన్ని చితకబాదారు. దాంతో అతను డర్బన్ పారిపోయాడు. అక్కడ సరైన ఉద్యోగమేదీ దొరక్క నిద్రమాత్రలూ ఎలుకలకు పెట్టే విషం మింగి ఆత్మహత్యకు ప్రయత్నించాడు. ఎవరో చూసి ఆస్పత్రిలో చేర్పించడంతో బతికాడు. వేరే దారిలేక మళ్లీ జోహాన్నెస్ బర్గ్ కే వచ్చి సైన్యంలో చేరాడు. అక్కడ ఓ బాంబు పేలుడులో గాయపడి సర్వీసు నుంచి బయటికొచ్చాడు. మళ్లీ ఉద్యోగాల వేట. ఈసారి ఓ కెమెరాల షాపులో పనికి కుదిరాడు. అదే అతని జీవితాన్ని మలుపు తిప్పింది.
చుట్టూ కెమెరాలు. వాటితోనే సహజీవనం. జీవం తొణికిసలాడే ఫొటోలు తీయడమెలాగో నేర్చుకున్నాడు. కొన్నాళ్లకు జోహాన్నెస్ బర్గ్ లోని ‘సండే ఎక్స్ ప్రెస్’ పత్రికలో పార్ట్ టైం క్రీడా ఫొటోగ్రాఫర్ గా చేరాడు. చేరింది స్పోర్ట్స్ ఫొటోగ్రాఫర్ గానే అయినా నగరంలో జరిగే అల్లర్లూ విధ్వంసాలను వీలైనంత దగ్గరగా చిత్రీకరించేవాడు. 1990 నాటికి దక్షిణాఫ్రికా విముక్తి పోరాటం ఉద్ధృతమైంది. తెల్లవాళ్లు వీధుల్లో ఒంటరిగా తిరగడానికి భయపడే పరిస్థతి వచ్చింది. దాంతో కెవిన్ అతని మరో ముగ్గురు స్నేహితులూ(ముగ్గురూ పొటోగ్రాఫర్లే) ఎప్పుడూ కలిసే తిరిగేవారు. ఎక్కడ వీధిపోరాటాలు జరుగుతన్నాయని తెలిసినా... బస్సు దహనాలూ రైలుపట్టాలు తొలగించడం లాంటివి జరుగుతున్నాయని తెలిసినా అందరికన్నా ముందే అక్కడ వాలిపోవడం, అరుదైన కోణాల్లో ఫొటోలు తీసి పత్రికలకు ఇవ్వడం... ఇదీ వారి దినచర్య. ఈ సాహసాలు చూసి ఓ పత్రిక వీళ్లకి బ్యాంగ్ బ్యాంగ్ క్లబ్ అని పేరు పెట్టింది. ఒకసారి నల్లవారు ఒక యువకుణ్ని పట్టుకుని విపరీతంగా హింసించి తగలబెట్టిన దృశ్యాల్ని చిత్రీకరించారు. ఈ టెన్షన్ల నుంచి సేదదీరడానికి మాదకద్రవ్యాలకు అలవాటుపడ్డాడు కెవిన్.
అల్లర్లుజరిగేటప్పుడు ఫొటోలు తీస్తూ... |
1994 ఏప్రిల్ 18న కెవిన్ తన మిగతా ఇద్దరు స్నేహితులతో కలిసి టొకోజా టౌన్ షిప్లో జరుగుతున్న అల్లర్లను చిత్రీకరించడానికి వెళ్లాడు. అక్కడ త్వరత్వరగా తన పని ముగించుకుని వెళ్లిపోయాడు. కానీ... అతని ప్రాణమిత్రుడు ఊస్టర్ బ్రోక్ ఆ అల్లర్లలో జరిగిన కాల్పుల్లో చనిపోయాడు. ఆ వార్త రేడియోలో విని చలించిపోయాడు కెవిన్. అతణ్నే తలచుకుని కుంగిపోయాడు. మాదకద్రవ్యాలకు మరింతగా బానిసయ్యాడు. దాంతో భార్య అతణ్ని విడిచిపెట్టి వెళ్లిపోయింది. పనితీరు సరిగా లేకపోవడంతో రాయ్ టర్స్ సంస్థతో సంబంధాలు దెబ్బతిన్నాయి.
చేతిలో డబ్బులేదు.... మిత్రుని మరణం.... భార్య లేదు... ఎటు చూసినా అప్పులు....
కెవిన్ కి ఒకటే మార్గం తోచింది.
* * *
1994, జులై 27....కెవిన్ తన వ్యాన్ సైలెన్సర్ కు ఒక పైపు బిగించి దాన్ని కిటికీ గుండా లోపలికి చేరవేసి బండి స్టార్ట్ చేశాడు.
ఇయర్ ఫోన్స్ పెట్టుకుని వాక్ మన్లో తనకిష్టమైన పాటలు వింటూ కళ్లు మూసుకున్నాడు.
వ్యాన్ సీట్లో అతని పక్కనే ఒక ఉత్తరం...
‘తట్టుకోలేకపోతున్నాను, ఫోన్ లేదు... డబ్బులేదు... అప్పులు... కళ్లముందే ఘోరమైన చావులు, బతుకుపోరాటాలు, హాహాకారాలు, ఆకలితో పేగులు మాడిన చిన్నారులు... విసిగిపోయాను. నాకింక శక్తి లేదు. అందుకే వెళ్లిపోతున్నాను... నా స్నేహితుడు ఊస్టర్ బ్రోక్ దగ్గరికి... అంతటి అదృష్టం నాకు ఉంటే’
Very tragic story. May his soul rest in peace.
ReplyDeletegood post :)
ReplyDeleteఎంతటి విషాదం.
ReplyDeleteగుండెలు పిండేసేలా ఉంది మీ కథనం. ఇంతటి విషాదాన్ని ఎలా భరించడం?
ReplyDeleteమనస్సునకు మించిన సత్య పీఠం మరొకటి ఉండ బోదు. దానికి మించిన తగవరీ మరొరు లేరు.
ఓహ్, ఆ ఆకలి చావులు, బ్రతుకు పోరాటాలు అనుభవించకపోయినా ఫొటోలు తీసినందుకే జీవితం నిస్తేజమయిపోయింది. Tragic story....ఒక మంచి ఫొటోగ్రాపర్ కి కోల్పోయాం.
ReplyDeleteనాకీ ఫొటో, తీసిన వ్యక్తి పేరు, అతను ఆత్మహత్య చేసుకున్నాడని మత్రమే తెలుసు. కానీ ఇంత కథ ఉందని తెలీదు. ఈ వాస్తవాన్ని మాకందరికీ తెలియజెప్పినందుకు ధన్యవాదములు.
హృదయాన్ని కదిలించిన కథనం. చాలా బాగుంది బాధగా ఉంది
ReplyDelete@ శివగారు... అవునండీ, వెరీ ట్రాజిక్ స్టోరీ.
ReplyDelete@ థాంక్యూ రాణిగారు.
@ విజయమోహన్ గారు, జోగారావుగారు, సౌమ్యగారు... మొదటిసారి కెవిన్ గురించి తెలిసినప్పుడు నాకూ చాలా బాధనిపించింది.
this article was forwarded to me from my uncle....
ReplyDeletei really ignored it ...but now when i read this i felt like so sad... manasu tho alochinche prathi paniki artham undakarledu anipisthondhi.... choopu okati vethikithe manasu inkedo vethukuthondhi.... :(...
good job baalu gaaru....