విజయవాడ నుంచీ వస్తూవస్తూ మా అత్తగారు మినపసున్నుండలు తెచ్చారని కిందటి పోస్టులో చెప్పా కదా. ఇది దానికి కొనసాగింపన్నమాట.
ఆవిడ సున్నుండలు బయటికి తీయగానే ‘అత్తయ్యా నువ్వవి ఎందుకు తెచ్చావో నాకు తెలుసులే’ అన్నాను. ‘ఎందుకు’ అందావిడ మొహం వెలిగిపోతుండగా (నేనేదో ఆవిడ ప్రేమనూ ఆప్యాయతనూ ఆత్మీయతనూ అనుబంధాన్నీ గుర్తించానని ఫీలైపోయింది పాపం).
మన పాండిత్యం అంతా ఒలకబోసే ఛాన్సొచ్చిందిరా అనుకునేసి ‘అసలికి అత్తగార్లు అల్లుళ్లకీ మినప సున్నుండలు ఎందుకు పెడతారో తెలుసా, దానెనక రెండు ప్రయోజనాలున్నాయంట’అని పే...ద్ద హరికథాభాగవతారులా ఆ కథ చెప్పటాకి తయారయ్యాను.
(ఇక్కడోపాలి గొంతు సవిరించుకున్న సౌండేసుకోండి)
సంసృత కవి శ్రీహర్షుడు తెలుసుగా, ఆయన రాజుగారి కోరికమీద ‘నైషధం’ అనే కావ్యం రాసినాడంట. ఆ కావ్యం ఫస్టుకాపీ హర్షుడి తల్లి మామల్లదేవి చదివిందట. మహామహా పండితులకే అర్థంగానట్టు కొరకరాని కొయ్యలా ఉందా కావ్యం. ఆవిడ కూడా మంచి విదుషీమణి. ఆ కావ్యం అట్టానే రాజుకినిపించినాడంటే కొడుక్కి పేరు రాదనుకుని ‘ఒరే నాయనా, చదివేకి బాగా కష్టంగా ఉందిది, మళ్లోసారి రాయి నాయనా’ అందట. తల్లిమాట మీద మళ్లీ మొదట్నుంచీ మొదలుబెట్టి రెండోసారి రాసేశాడట హర్షుడు.
మొదటిదాని మీద ఆ రెండో కాపీ సుమారుగానే ఉన్నా అదీ ఓ మాదిరి కష్టంగానే ఉండటంతో ఇట్ట లాబం లేదన్జెప్పి హర్షుడికి రోజూ మినుములు తినబెట్టడానికి పూనుకుందటా మహాతల్లి. ఇడ్డెన్లూ(ఇవి అప్పుడు ఉన్నాయో లేవో నాకు తెలీదు, కొంత సొంత పైత్యం కలిపేస్తున్నా), గారెలూ, దిబ్బరొట్టెలూ మినప సున్నుండలూ... ఈ రకంగా ముప్పొద్దులా మినుముల వంటకాలే.
ఆర్నెల్ల తర్వాత...
ఒకరోజు హర్షుడు వంటింట్లో కూర్చుని మినపరొట్టి తింటుండగా ఆయన మేనమామ వచ్చి ‘కిమశ్నాసి’(అంటే... ‘ఏం తింటున్నావోయ్’ అని కాబోలు) అని అడిగాడట.
దానికి హర్షుడు... ‘అశేష శేముషీ మోష మాష మశ్నామి మారిషా’ అని సమాధానం చెప్పాడట.
(ఇదెప్పుడో చిన్నప్పుడు మా నాన్న చెప్పిన చమక్కు. నా కోడిబుర్రకు అర్థమైనంతవరకూ... ‘నా సమస్త బుద్ధినీ తస్కరించే మినుములు(తో తయారుచేసిన రొట్టి) తింటున్నాను ఆర్యా’ అనిదీనర్థం. ఒకవేళ తప్పైతే, సరైన అర్థం పెద్దలు తాలబాసుగారో ఊకదంపుడుగారో చింతారామకృష్ణారావుగారో నేను పేర్లు మరచిన మిగతా పెద్దలో చెప్పాలి).
హర్షుడి సమాధానం ఆ పక్కనే రొట్లు కాలుస్తున్న మామల్లదేవి విన్నది. వినగానే ఆవిడ ముఖం చింకి చాటంత అయ్యిందట. కొడుకు తను అనుకున్న స్టాండర్డుకి వచ్చేసినాడని అర్థం చేసుకుని ‘అబ్బాయ్, ఇంక మళ్లీ మొదలెట్టు నీ నైషధం’ అందట.
భక్తులారా... ఆవిదంగా...
హర్షుడు మూడోపాలి రాసిన నైషధమే మనమిప్పుడు అందరం చెప్పుకొంటోన్న నలదమయంతుల కథ అనే అద్భుత కావ్యం. దీన్నే శ్రీనాథుడు ‘శృంగార నైషధం’గా తెలుగులో రాసేశాడు.
ఈ కథంతా చెప్పుకొచ్చి... మినుములు తిని అల్లుళ్ల బుద్ధి కాస్తంత మందగించితే కూతురు కొంగు పట్టుకు తిరుగుతాడు కదా, అందుకేనమ్మా అల్లుళ్లకు అత్తగార్లు మినప సున్నుండలు బెట్టేదీ.... అని వెటకారం వెలగబెట్టా.
ఆ దెబ్బతో ఆవిడ మొహం చూడాలి. ‘చీ పాపాత్ముడా, పోన్లే తింటావుగదాని ప్రేమగా సున్నుండలు తెస్తే, ఎంత కత చెప్పినావురా... పైగా నా మీద ఇంత అభాండం వేస్తావా’ అన్నట్టుందా చూపు.
మనమేదో పాండిత్యం వొలకబోద్దామనుకుంటే పరిస్థితి తేడాగా మారిపోయిందని అర్థమైపోయి ‘డామిట్, కథ అడ్డం తిరిగింది’ అనుకుంటూ ఓ వెర్రి నవ్వు నవ్వేసి పక్కికి తప్పుకొన్నా.
అంతే ఆవిడ ఇక్కడున్న నాల్రోజులూ మినపసున్నుండల వాసన కూడా నాకు చూపించలా.
నాలుగోరోజు నేనే ఇట్లయితే లాభం లేదన్జెప్పి ఆవిడ సీరియస్సుగా ‘మొగిలిరేకులు’పదొందల డబ్బైమూడో భాగమో పదారొందల తొంబైనాలుగో భాగమో చూస్తుండగా...
‘అత్తయ్యా, సున్నుండలు తెచ్చానంటివే... ఒక్కటి గూడా పెట్టలేదే’ అనడిగా
‘ఏమోలే, తెచ్చానంటేనే అంత కత చెప్పావ్, పెడితే ఇంకేమంటావో అని పెట్టలా’ అని ఓ సన్నాయినొక్కు నొక్కింది.
(ఉట్టిపుణ్యానికి ఆవిడ సహనాన్ని పరీక్షించడానికి అలా అడిగానే గానీ, తెచ్చినరోజు రాత్రే మా హోంమినిస్టరు నాకా సున్నుండలు రహస్యంగా స్మగ్లింగు చేసేసింది. ఈ రహస్యం మా అత్తగారికి చెప్పకండెవరూ. ఏమాటకామాటే... సున్నుండలు సూపరో సూపరు).
ఈ గొడవలో పడి ఆవిడ నేను అన్న ఆ రెండో ప్రయోజనమేంటో అడగనే లేదు : )
చాలా బాగుందబ్బాయీ ! నీసున్నుండలప్రహసనం
ReplyDeleteబుద్ధి మందగించుతుందని తెలీదేమో ,ఇంటికి ఇనుము ఎంత బలమో వంటికి మినుము అంత బలం అని చెప్పి మా అమ్మమ్మ మినుములతో
ReplyDeleteచేసిన వంటకాలు తినిపించేది.
ఈ గొడవలో పడి ఆవిడ నేను అన్న ఆ రెండో ప్రయోజనమేంటో అడగనే లేదు -sonthasodilo padithe anthenemo sir,funny post.
ReplyDeleteహహహ్హ మీకు నిజంగా...కోరి తెచ్చుకున్నది కాకపోతే...చక్కగా సున్నుండలు చేసుస్కొస్తే అంతమాటంటారా :)
ReplyDeleteదుర్గేశ్వరగారూ... నెనర్లు
ReplyDeleteఅనుగారూ... మానాన్న అలా చెప్పినా, మా అమ్మ మాత్రం మీ అమ్మమ్మగారిలాగే మినుములు తింటే బలం అని బాగా తినిపించేది.
astrojoyd గారూ... థాంక్యూ
సౌమ్యగారూ... ఆ విషయం అనేశాకగానీ తెలీలేదండీ! ఎనీహౌ, సున్నుండలైతే తినేశానుగా :)
బాలు గారూ! చమక్కులు భలే ఉన్నైలే!
ReplyDeleteమరి మినుములు బుద్ధికి మందం, వంటికి బలం...మా చిన్నప్పుడు సున్నుండల వాసన చూడడం కూడా మహానేరం...అందుకే అప్పుడు బుఱ్ర అంత పదునుగా ఉండేది...తర్వాత బలం లేదని, లావవ్వ్వాలని మెడిసిన్ కొచ్చాక నాన్న స్పెషలుగా అమ్మతో చేయించుకు తెచ్చేవారు..అప్పటి నుంచీ వళ్ళైతే పెరిగింది కాని, బుఱ్రమాత్రం మందగించిపోయింది...ః)
ఇంతకీ ఆ రెండో ప్రయోజనం చెప్పకుండానే టపా ముగించారే!..;)
అందుకేనా కౌటిల్య నీ బుద్ధిమాంద్యంతో మమ్మల్ని ఇలా ఇబ్బందుల పాలు చేస్తావ్?
ReplyDeleteనిజంగానే బాలూ గారూ సున్నుండల టేస్టే టేస్టు!
కౌటిల్యగారూ... రెండో ప్రయోజనం పబ్లీకున చెప్పరాదు. ఫోన్లో జెప్తాలే!
ReplyDeleteరహ్మానుద్దీన్ గారూ... అవునండీ, అవును. సున్నుండల రుచి సున్నుండలదే. వేరేదీ సాటిరాదు.
ఆ కథలేవో సున్నండల డబ్బా ఖాళీ అయ్యాక చెప్తారా ముందే చెప్పి నోటికి చేటు తెచ్చుకుని చివరికి స్మగ్లింగ్ దాకా పోతారా?
ReplyDeleteమినుములు, బెల్లం,నెయ్యి ఈ కాంబినేషన్ ఒంటికి చాలా మంచిదంటారు. అంటే కొవ్వు పెరగదు. ప్రొటీను, ఇనుమూ రాగీ ,స్టీలూ వగైరాలు లభిస్తాయనేమో!
అయితే ఈ సారి సున్నుండలు చేస్తే గమ్మున ఉండాల్సిందే! పోస్టులు మాత్రం రాయకూడదు.
అబ్బే, డబ్బా ఖాళీ అయ్యేదాకా ఎక్కడండీ... మొదటిరోజే స్మగ్లింగ్ షురూ జేసిన. ఖాళీ చేసిందీ మనమే, చేయించిందీ మనమే. మా అత్తగారు నిమిత్తమాత్రురాలు. డబ్బా ఖాళీ చేసింది నేనే అని తెలీకుండానే బెజవాడ బస్సెక్కేసింది పాపం!
ReplyDeleteహిహిహి... ఈసారి సున్నుండల కథకాదు, ఇంకోటి చెప్తా. ఇప్పటికైనా తిన్నగా, బుద్ధిగా ఉండాలంటే కష్టం. పుట్టకతో వచ్చిన బుద్ధి మరి. :)
అబ్బ, రాయకూడనిది మీరు కాదండీ...ఇక్కడ సున్నుండల అభిమానుల్ని చూశాక, "నేను సున్నుండలు చేస్తే మాత్రం పోస్తులు రాయకూడదు" అనేసుకున్నానన్నమాట! హదీ సంగతి
ReplyDeleteఅలగంతారా... ఐతే వాకే!
ReplyDelete