Tuesday, August 24, 2010

‘రేప్ అంటే తెలుసా నీకు?’

ఎడారి కన్నీళ్లు
అల్లంత దూరాన గుర్రాల కాలిగిట్టల చప్పుడు వినపడగానే గుండెల్లో వణుకు పుట్టి అది వెన్నుదాకా 
పాకుతుంటే ఎలా ఉంటుందో తెలుసా? 
నరరూప రాక్షసులు చుట్టుముడుతుంటే.... 
పసిమొగ్గల్ని ‘బలవంతంగా’ నలిపేస్తుంటే... 
సర్వస్వాన్నీ తగలబెడుతుంటే... ఆ నరకం ఎలా ఉంటుందో తెలుసా? 
మగాళ్లు మృగాలై ఒకరి తర్వాత ఒకరుగా... 
తనువంతా పచ్చిపుండవటం అంటే ఏమిటో తెలుసా? 
ఉన్న ఊరినీ కన్నవారినీ కోల్పోయి పరాయిదేశంలో తలదాచుకోవడం ఎంత నరకంగా ఉంటుందో తెలుసా? 
తెలుసుకోవాలనుకుంటే నా కథ చదవండి.... 


  కన్నుమూస్తే నరకం. 
కన్ను తెరిస్తే నరకం. 
ఇదీ మా సూడాన్.  ఇదే మా సూడాన్.
 నా పేరు హలీమా బాషిర్.  నేనొక డాక్టర్ని. 
ఆఫ్రికా ఖండంలోనే పెద్ద దేశమైన సూడాన్లో...
ఆడపిల్లకు చదువెందుకు అని ఆక్షేపించే ఒక మారుమూల గిరిజన తెగ మాది.
దార్ఫుర్ ప్రాంతంలోని ఆ తెగలో పుట్టిపెరిగిన నేను వైద్యురాలినయ్యానంటే అందుకు కారణం మా నాన్న. ఒకప్పుడు తన ప్రాణాలు కాపాడిన వైద్యురాలు హలీమా పేరు నాకు పెట్టారాయన. చిన్నప్పటి నుంచీ చదువులో చురుగ్గా ఉండే నేను డాక్టర్నవ్వాలని కోరుకునేవాడు.  ఆయన కలలు సాకారమయ్యాయి.  ఇరవైనాలుగేళ్లవయసులో ఎన్నో ఊహలతో వైద్యపట్టా పుచ్చుకుని యూనివర్సిటీ నుంచి బయటికొచ్చాను. కానీ నా ఊహలన్నీ ఊహలుగానే మిగిలిపోయాయి.  కారణం... మా దేశంలో దశాబ్దాలుగా సాగుతున్న అంతర్యుద్ధం ముదిరిపోయింది.  అప్పటికి కొత్తగా ఏర్ఫడిన ఇస్లామిక్ ప్రభుత్వానికీ స్థానికులకూ పొసగలేదు.  ప్రభుత్వ పక్షపాతాన్ని సహించలేక తిరగబడ్డారు నల్లవారు. ముష్కరమూకల దండుతో సమాధానం చెప్పింది ప్రభుత్వం.
ఒకవైపు స్థానిక నల్లజాతి తెగలు... మరోవైపు ముష్కరముఠాలు...
ఒకరి చెలగాటం... మరొకరికి ప్రాణసంకటం.
ప్రభుత్వం ఉసిగొల్పిన ఆ మూక పేరు... జంఝవీద్.
గుర్రాల మీద దుమ్ము రేపుకుంటూ ప్రవేశించే వారిలో ఒక్కొక్కడూ ఒక్కొక్క నరరూప రాక్షసుడు.
ఊళ్లకు ఊళ్లే తగులబెట్టడం, మగవారిని కాల్చి చంపెయ్యడం,
చిన్నాపెద్దా తేడా లేదు... స్త్రీ అయితే చాలు క్రూరాతిక్రూరంగా వారిపై తమ పశుబలం ప్రదర్శించడం.
నా దేశంలో జరుగుతున్న మారణహోమం గురించి ఒక పాత్రికేయుడికి చెప్పానొకసారి.
మర్నాటి పేపర్లో ఆ వార్త చూసి ప్రభుత్వం కన్నెర్రజేసింది. నన్ను ఓ మారు మూల గ్రామానికి బదిలీ చేసింది.
*            *            * 
ఆరోజు నాకిప్పటికీ బాగా గుర్తు... హాస్పిటల్లో ఉన్నాన్నేను. బయట ఏదో కలలకలం.
బయటికొచ్చి చూస్తే... ఎనిమిది నుంచి పదమూడేళ్లలోపు అమ్మాయిల్ని తీసుకొస్తున్నారు గ్రామస్థులు.
ఏమైందని అడిగాను. మానవజాతి సిగ్గుతో తలొంచుకునే విషయాలు చెప్పారు వారు.
వారంతా సమీపంలో ఉన్న పాఠశాల విద్యార్థినులు.
ఆ పసిమొగ్గల అందమైన భవిష్యత్తుకు పాఠాలతో బాటలు వేస్తున్న ఆ స్కూల్లోకి దూసుకొచ్చిందో జంఝవీద్ ముఠా. బలప్రయోగంతో తరగతిగదుల్లోకి ప్రవేశించారు కొందరు. ఇంకొందరు స్కూలు చుట్టూ కాపలా కాస్తున్నారు. లేళ్లగుంపుపై పడ్డ క్రూరమృగాల్లా పిల్లలపైనా టీచర్లపైనా పడ్డారు.
విషయం తెలిసి చుట్టుపక్కల ఉన్న తల్లిదండ్రులంతా స్కూలు దగ్గరికి పరుగులు తీశారు. 
వారు లోపలికెళ్లకుండా అడ్డుకున్నారు కాపలా రాక్షసులు. తిరగబడిన వాళ్లని రైఫఇల్ బట్ లతో అణిచేశారు. అయినా మాట విననివారిని కాల్చిపారేశారు. లోపల తమ పిల్లల జీవితాలు నాశనమైపోతుంటే నిస్సహాయంగా పొగిలిపొగిలి ఏడవటం తప్ప మరేం చేయలేక నిస్సహాయంగా కన్నీరుమున్నీరయ్యారా తల్లిదండ్రులు.  ముష్కరమూకలు నిష్క్రమించాక తరగతిగదుల్లోకి పరుగులు తీశారు.
తీవ్ర రక్తస్రావంతో షాక్ తో వేలాడిపోతున్న పిల్లల్ని చేతుల్లో వేసుకుని పగిలిన గుండెల్తో పరిగెత్తుకుంటూ ఆస్పత్రికి తీసుకొచ్చారు.
*            *            * 
నాకు వైద్యవిద్యను బోధించిన ఏ ప్రొఫెసరూ చెప్పలేదు... రేప్ కు గురైన ఎనిమిదేళ్ల చిన్నారికి ఏ వైద్యం అందించాలో! ఎంత ఆలోచించినా గుర్తుకురాలేదు... ‘ఏమైంది, నాకెందుకిలా జరిగింది’ అనే షాక్;లో కూరుకుపోయిన చిన్నారులను మనలోకంలోకి తీసుకువచ్చేదెలాగో!
నా కళ్ల వెంట నీళ్లు కారిపోతున్నాయా... ఏమో!
గుడ్లనీరు కుక్కుకుంటూనే కర్తవ్యం నిర్వర్తించాను.
ఈసారి ఈ దారుణం గురించి ఐక్యరాజ్యసమితి పరిశీలకులకు చెప్పాను.
వారం గడిచిందో లేదో ముగ్గురు సైనికులు నా క్లినిక్ కి వచ్చారు. ‘లే, నువ్వు మాతో వస్తున్నావు’ అంటూ నన్ను దౌర్జన్యంగా ఈడ్చుకెళ్లి జీపులో పడేసి దగ్గర్లో ఉన్న మిలటరీ క్యాంప్ కి తీసుకెళ్లారు.
నాకు అర్థమైపోయింది ఏం జరగబోతోందో!
*            *            * 
‘నీకు తెలుసా అసలు రేప్ అంటే ఏమిటో?’
కర్కశత్వానికి రూపం వస్తే వాడిలాగానే ఉంటుందేమో!
‘నువ్వు డాక్టరువి కాబట్టి నీకు తెలుసనుకుంటున్నావేమో’
ఇంకొక కర్కోటకుడి వెక్కిరింపు.
‘అందులో బాగా ఆరితేరిన మేం చూపిస్తాం నీకు, రేప్ అంటే ఏంటో’
మూడోవాడి ముక్తాయింపు.
నోట్లోగుడ్డలు కుక్కి సిగరెట్లు కాల్చి వాతలు పెడుతూ కత్తులతో ఒళ్లంతా గాట్లు పెడుతూ...
ఒకరి తర్వాత ఒకరుగా...
రెండురోజుల నరకమది.
క్షణమొక యుగం.
మూడోరోజు పొద్దున తలుపు తెరుచుకుంది. 
‘అప్పుడు కాదు, ఇప్పుడు చెప్పు లోకానికి... రేప్ జరిగిందని. ఈ మాట అందరికీ చెప్పడానికే నిన్ను ప్రాణాలతో వదిలిపెడుతున్నాం’ అంటూ నన్ను తీసుకెళ్లి ఎడారిలో వదిలేశారు. నాకింకా భూమ్మీద నూకలు మిగిలే ఉన్నాయి. ఒంటెమీద అటుగా వెళ్తున్న ఒక వ్యక్తి నా మీద దయతలిచాడు. తన ఒంటెమీద చోటిచ్చి మా ఊరికి చేర్చాడు. తడబడే అడుగులతో ఇంటికి చేరాను
...........
గుమ్మం దగ్గరే ఉంది అమ్మ.  జీవచ్ఛవంలా నడిచొస్తున్న నన్ను నమ్మలేనట్టుగా చూసింది. మళ్లీమళ్లీ చూసింది. ఇంతలో లోపలినుంచి వచ్చాడు నాన్న. అప్పటిదాకా ఉగ్గబట్టుకున్న ఏడుపుని ఇంక ఆపుకోలేకపోయాను. భోరుమంటూ నాన్న భుజాల మీద వాలిపోయాను.
*            *            * 
కాలం అన్నిగాయాల్నీ మాన్పుతుందంటారు.
నిజమేనేమో, అమ్మానాన్నల ఓదార్పులో ఐదునెలలు గడిచాయి. ఊళ్లోనే ఉన్న క్లినిక్ లో వైద్యం చేస్తున్నాను. లండన్ లో ఉన్న బావ షరిఫ్ తో  అతని గైర్హాజరులోనే మా వివాహం జరిపించారు నాన్న.
అంతకు ముందు నా జీవితంలో ఒకేఒక్కసారి కలిశాను షరీఫ్ ని. అయినా మా తెగలో వరుణ్ని ఎంచుకునే స్వేచ్ఛ లేదు మాకు. 
కాలం అలా గడుస్తుండగా....
మరోసారి మా ఊరిమీదికి విరుచుకుపడ్డాయి 
జంఝవీద్ మూకలు... గుర్రాలమీద...
వారికి తోడుగా సైనికులు... రాబందుల్లా హెలికాప్టర్ల మీదా...
నాన్నకు విషయం అర్థమైంది. నావైపు తిరిగి...
‘పారిపో, అమ్మనీ చెల్లెళ్లనీ తమ్ముళ్లనీ తీసుకుని పారిపో’ అని గట్టిగా అరిచాడు.
అరుపులు పూర్తి కాకమునుపే రాకెట్ లాంచర్లు దూసుకొచ్చాయి. బాంబులు పేలాయి.
నేను పరిగెడుతున్నాను.
సర్వనాశనమైపోతోంది. 
చూస్తుండగానే ఊరుమొత్తం తగలబడిపోతోంది.
దారిపొడుగునా క్షతగాత్రుల హృదయవిదారకమైన అరుపులు... 
ఒక్క క్షణం ఆగినా ప్రాణాలు దక్కని పరిస్థితి.  
పసిబిడ్డలను పొత్తిళ్లలో్ పట్టుకుని తల్లులు.... 
తమకన్నా చిన్నపిల్లల్ని గట్టిగా పట్టుకుని పెద్దపిల్లలూ అందరూ ఒకటే పరుగు. ప్రాణాలు దక్కించుకోవాలనే ఆరాటం.
ఊరుదాటి దూరంగా ఉన్న అడవిలోకి పరుగుతీశాం. హెలికాప్టర్లు వేటాడలేనంత లోపలికి దూరిపోయాం. ప్రాణాలరచేతబెట్టుకొని చప్పుడు చేయకుండా బిక్కుబిక్కుమంటూ ఒకచోట కూర్చున్నాం. 
దూరంగా గాలి అలల్లో తేలుతూ లీలగా వినపడుతోంది ఒకపాట... జంఝవీద్ ముఠాకి అత్యంత ఇష్టమైన పాట అది. వారి పెదాల వెంట ఎఫ్పుడూ వినిపించే పాట...
‘‘చంపండి నల్లబానిసల్ని
చంపండి నల్లగాడిదల్ని
చంపండి నల్లకుక్కల్ని
చంపండి నల్లకోతుల్ని
ఒక్కరూ తప్పించుకోలేరు... అందర్నీ చంపేస్తాం’’ 
పాటవింటున్న మా అందరిలోనూ విషాదం.
దూరంగా గాల్లోకి పొగలు లేస్తూ కనిపించాయి. అది మా ఊరే.
తెల్లారాక భయంభయంగా ఊళ్లోకి అడుగుపెట్టాం. అది మా ఊరేనా...?
ఎటుచూసినా శవాలగుట్టలు.
ఘోరకలి అది.
ఏడవటానికి శక్తి కూడా లేదు. 
నిస్సత్తువగానే... మృతదేహాల్ని బళ్ల మీద వేసుకెళ్లి ఖననం చేశాం.
రాత్రి పరుగులో అమ్మా తమ్ముళ్లూ ఎక్కడ తప్పిపోయారో తెలీదు. అసలున్నారో లేదో ఆచూకీ తెలియదు. 
నాన్న బతికున్నారో లేదో కూడా తెలీదు.
నేనిప్పుడు ఒంటరిని.
ఈ ఒంటరిపక్షిపైనా రహస్యపోలీసులు ఓ కన్ను వేసే ఉంచారు.
వాళ్ల అకృత్యాల గురించి రెండుసార్లు నోరెత్తింది నేనే మరి. నన్ను మళ్లీ నిర్బంధించాలన్న వారి నిర్ణయం గురించి ముందే తెలిసిపోయింది. ఊరివారందరూ కలిసి నన్ను అక్కణ్నుంచి తప్పించారు. ఎడారి దారుల్లో ప్రయాణించి న్యూబా చేరుకున్నాను. అది... దార్ఫుర్ నుంచి ప్రాణలరచేత పెట్టకుని పారిపోయి వచ్చే మాలాంటి శరణార్థులకు సురక్షిత ప్రదేశం. కానీ నాకు అక్కడా రక్షణ లేదు. మనుషుల్ని అక్రమంగా రవాణా చేసే ఒక ట్రాఫికర్ని పట్టుకున్నాను. నా దగ్గరున్న డబ్బూ అమ్మమ్మ నగలూ అన్నీ అతని చేతుల్లో పోసి ఎలాగైనా లండన్లో ఉన్న మా బావ షరీఫ్ దగ్గరకు చేర్చమన్నాను. క్షణక్షణగండంగా కొన్నిరోజులక్కడే గడిపాను. ఏర్పాట్లు పూర్తయ్యాయి. పుట్టినగడ్డని వదిలిపెట్టి పరాయిపంచకు చేరే సమయం ఆసన్నమైంది. మాతృభూమికి కన్నీటి వీడ్కోలు పలికాను. 2005లో లండన్ కు చేరుకున్నాను. అష్టకష్టాలు పడి షరీఫ్ ని కలుసుకోగలిగాను. బ్రిటన్ ప్రభుత్వం నా గాథను వింది. బాధను అర్థం చేసుకుంది. సాదరంగా ఆశ్రయమిచ్చింది. ఇక్కడే ఉంటూ సూడానీ మహిళల ప్రతినిధిగా నా గళాన్ని ప్రపంచానికి వినిపించాను. అంతర్జాతీయ మానవహక్కుల దినోత్సవం నాడు (అప్పటి)అమెరికా అధ్యక్షుడు జార్జిబుష్ ని కలిసి మా దేశంలో జరుగుతున్న నరమేధం గురించి వివరించాను. సూడాన్ మహిళల ఆక్రందనలను వైట్ హౌస్ లో ప్రతిధ్వనించగలిగాను. మాకు జరుగుతున్న అన్యాయాన్ని మరింత విస్తృతంగా ప్రపంచం దృష్టికి తేవడమే నా ముందున్న లక్ష్యం. 
ఇప్పటికీ నాకు ప్రాణభయం ఉంది. 
సూడానీ రహస్య ఏజెంట్లు నన్ను ఇప్పుడు ఇంకా ఎక్కువగా నీడలా వెంటాడుతున్నారు. వేటాడుతున్నారు. 
ఏ క్షణంలో నేనేమవుతానో నాకు తెలియదు. 
అందుకే.... యుద్ధాల కారణంగా అందరికన్నా ఎక్కువగా మహిళలూ పిల్లలే ఎలా నలిగిపోతున్నారో ప్రపంచానికి చాటిచెప్పాలంటే ఆ ఘోరకలిని అక్షరబద్ధం చేయడమే మంచిదనిపించింది. 
అందుకు నా జీవితం కంటే పెద్ద ఉదాహరణ ఏముంది! 
అందుకే నా జీవితాన్నే పుస్తకంగా రాశాను.
ఆ పుస్తకమే.... టియర్స్ ఆఫ్ ద డెజర్ట్.
ఎడారి కన్నీళ్లు!
*            *            * 
ఈ విశాల ప్రపంచం ఒక శరీరం అనుకుంటే...
అందులో మా సూడాన్ ఓ రక్తమోడుతున్న గాయం.
ఆ గాయం నయమవ్వాలి. ఆ బాధ అంతమవ్వాలి. అదే మా కోరిక.

Thursday, August 19, 2010

ప్రపంచాన్ని కదిలించిన ఫొటో (ఈరోజు వరల్డ్ ఫొటోగ్రఫీ డే)

వాంటింగ్ ఏ మీల్

అల్లంత దూరంలో ఆహార కేంద్రం.... అందాకా వెళ్లలేని దైన్యం...
వెనుకనే రాబందు రెక్కల నీడ...
ఆకలి తీరడానికి కొన్ని అడుగులే ఎడం...
రాబందుకూ... ఆ చిన్నారికీ కూడా ఆహారం కావాలి.
వాంటింగ్ ఏ మీల్...
మరి ఇద్దరిలో ఎవరి ఆకలి తీరింది?
గత పదహారేళ్లుగా జవాబు దొరకని ప్రశ్న... ప్రపంచాన్ని కన్నీళ్లు పెట్టించిన ప్రశ్న...
దక్షిణాఫ్రికా ఫొటోగ్రాఫర్ కెవిన్ కార్టర్కు పులిట్జర్ బహుమతినీ అందులేని ప్రశంసల్నీ సంపాదించిపెట్టిన ఈ ఫొటో అతనికి అంతకు మించిన విమర్శల్నీ అంతులేని నిర్వేదాన్నీ మిగల్చింది. ఆత్మహత్య చేసుకునేంత సంఘర్షణా కల్పించింది.

ఎండ నెత్తిని మాడ్చేస్తోంది. అప్పటికి 20 నిమిషాలుగా వేచి చూస్తున్నాడు 32ఏళ్ల ఫొటో జర్నలిస్టు కెవిన్ కార్టర్...
ఆ రాబందు రెక్కలు విప్పుతుందేమోనని.
*                              *                              *
రాబందు కూడా ఎదురు చూస్తోంది...
కొన్ని అడుగుల దూరంలో నేలకరుచుకుని పడున్న ఆ చిన్నారిని...
ఆ పాప ఊపిరి ఎప్పుడు ఆగిపోతుందా అని..
*                              *                              *
కెవిన్ సహనం చచ్చిపోయింది. కెమెరా క్లిక్మంది. అక్కణ్నుంచి నిరాసక్తంగా కదిలాడు. రాబందు ముందు ఆకలితో పడున్న పాపను వదిలి తన దారి తను చూసుకున్నాడు.
సూడాన్ లో కరాళనృత్యం చేస్తున్న కరవు ఫొటోలు తీయడానికి వచ్చిన కెవిన్ కి ఇంకా తెలీదు... తాను తీసిన ఫొటో ఎంత సంచలనాన్ని సృష్టించబోతోందో!
హృదయాల్ని కదిలించే సూడాన్ కరవు ఫొటోల కోసం ఎదురుచూస్తున్న ‘న్యూయార్క్ టైమ్స్’ పత్రిక కెవిన్ తీసిన ఆ ఫొటోను కొని 1993 మార్చి 26న ‘వాంటింగ్ ఏ మీల్’ అనే క్యాప్షన్ తో ప్రచురించింది.
ఆ రోజు ఉదయం పేపర్ మార్కెట్లోకి విడుదలైన కొద్దిసేపటి నుంచే ‘ఆ అమ్మాయి పరిస్థితేమిటి, బతికే ఉందా?’ అంటూ ఆ పత్రిక ఆఫీసుకి వందలకొద్దీ ఫోన్ కాల్స్ రావడం మొదలైంది.

‘ఆ ఫొటో తీసినప్పుడు అక్కడున్నది ఒక రాబందు కాదు... రెండు రాబందులు. ఆకలితో అలమటిస్తున్న పాపను ఆహారకేంద్రానికి తీసుకెళ్లకుండా కెమెరా లెన్స్ సరిచూసుకున్న కెవిన్ కార్టరే ఆ రెండో రాబందు’ అంటూ ప్రపంచం నలుమూలల నుంచీ మానవతావాదుల విమర్శలు వెల్లువెత్తాయి. ఆ ప్రశ్నకు సమాధానం చెప్పలేక విమర్శలకు తట్టుకోలేక మానసికంగా కుంగిపోయాడు కెవిన్.
*                              *                              *
ఏప్రిల్ 2, 1994
‘వాంటింగ్ ఏ మీల్’ ఫొటోకుగాను కెవిన్ కి పులిట్జర్ బహుమతి వచ్చినట్టు ప్రకటించారు. ఆ ఏడాది మే 23న కొలంబియా యూనివర్సిటీ గ్రంథాలయంలో జరిగిన కార్యక్రమంలో కన్నీళ్లతో పులిట్జర్ అవార్డును స్వీకరించాడు కెవిన్.
*                              *                              *
కెవిన్ కార్టర్
ఎన్నో దశాబ్దాల క్రితం యూరప్ నుంచి దక్షిణాఫ్రికాకు వలసవచ్చి జోహాన్నెస్ బర్గ్ లో స్థిరపడిన శ్వేతజాతి కుటుంబంలో పుట్టాడు కెవిన్. నల్లవారు తమ హక్కుల కోసం పోరాడుతున్న కాలం అది. అధికారంలో ఉన్న తెల్లవారు స్థానికులపై సాగించే జులుం చూసి చిన్నప్పటి నుంచి బాధపడేవాడు. ‘వారికోసం మనమేం చెయ్యలేమా’ అని తల్లిదండ్రులను అడిగేవాడు. యుక్తవయసు వచ్చాక సైతాఫ్రికన్ డిఫెన్స్ ఫోర్స్ లో చేరాడు. ఓసారి తన తోటి సైనికులు ఒక ఆఫ్రికన్ ను కొడుతుంటే అడ్డుకున్నాడు. ‘నల్లవాళ్లను వెనకేసుకొస్తావురా... నిగ్గర్ లవర్ (బానిసలను ‘నిగ్గర్’లంటారు) అంటూ వారు కెవిన్ని చితకబాదారు. దాంతో అతను డర్బన్ పారిపోయాడు. అక్కడ సరైన ఉద్యోగమేదీ దొరక్క నిద్రమాత్రలూ ఎలుకలకు పెట్టే విషం మింగి ఆత్మహత్యకు ప్రయత్నించాడు. ఎవరో చూసి ఆస్పత్రిలో చేర్పించడంతో బతికాడు. వేరే దారిలేక మళ్లీ జోహాన్నెస్ బర్గ్ కే వచ్చి సైన్యంలో చేరాడు. అక్కడ ఓ బాంబు పేలుడులో గాయపడి సర్వీసు నుంచి బయటికొచ్చాడు. మళ్లీ ఉద్యోగాల వేట. ఈసారి ఓ కెమెరాల షాపులో పనికి కుదిరాడు. అదే అతని జీవితాన్ని మలుపు తిప్పింది.

చుట్టూ కెమెరాలు. వాటితోనే సహజీవనం. జీవం తొణికిసలాడే ఫొటోలు తీయడమెలాగో నేర్చుకున్నాడు. కొన్నాళ్లకు జోహాన్నెస్ బర్గ్ లోని ‘సండే ఎక్స్ ప్రెస్’ పత్రికలో పార్ట్ టైం క్రీడా ఫొటోగ్రాఫర్ గా చేరాడు. చేరింది స్పోర్ట్స్ ఫొటోగ్రాఫర్ గానే అయినా నగరంలో జరిగే అల్లర్లూ విధ్వంసాలను వీలైనంత దగ్గరగా చిత్రీకరించేవాడు. 1990 నాటికి దక్షిణాఫ్రికా విముక్తి పోరాటం ఉద్ధృతమైంది. తెల్లవాళ్లు వీధుల్లో ఒంటరిగా తిరగడానికి భయపడే పరిస్థతి వచ్చింది. దాంతో కెవిన్ అతని మరో ముగ్గురు స్నేహితులూ(ముగ్గురూ పొటోగ్రాఫర్లే) ఎప్పుడూ కలిసే తిరిగేవారు. ఎక్కడ వీధిపోరాటాలు జరుగుతన్నాయని తెలిసినా... బస్సు దహనాలూ రైలుపట్టాలు తొలగించడం లాంటివి జరుగుతున్నాయని తెలిసినా అందరికన్నా ముందే అక్కడ వాలిపోవడం, అరుదైన కోణాల్లో ఫొటోలు తీసి పత్రికలకు ఇవ్వడం... ఇదీ వారి దినచర్య. ఈ సాహసాలు చూసి ఓ పత్రిక వీళ్లకి బ్యాంగ్ బ్యాంగ్ క్లబ్ అని పేరు పెట్టింది. ఒకసారి నల్లవారు ఒక యువకుణ్ని పట్టుకుని విపరీతంగా హింసించి తగలబెట్టిన దృశ్యాల్ని చిత్రీకరించారు. ఈ టెన్షన్ల నుంచి సేదదీరడానికి మాదకద్రవ్యాలకు అలవాటుపడ్డాడు కెవిన్.
అల్లర్లుజరిగేటప్పుడు ఫొటోలు తీస్తూ...
1991లో... ఆఫ్రికన్ నేషనల్ కాంగ్రెస్ మద్దతుదారులైన నల్లవారు ఓ శ్వేత జాతీయుణ్ని హత్యచేస్తుండగా తీసిన ఫొటోకు గాను కెవిన్ స్నేహితుడైన ఊస్టర్ బ్రోక్ కు పులిట్జర్ అవార్డు వచ్చింది. అది కెవిన్లో పట్టుదలను పెంచింది. తన మరో స్నేహితుడైన సిల్వాతో కలిసి సూడాన్ కరవును చిత్రీకరించడానికి వెళ్లాడు. అక్కడ తీసిందే ఈ రాబందు ఫొటో. ఆ తర్వాత సిగ్మా సంస్థతోనూ రాయ్ టర్స్ వార్తాసంస్థతోనూ కాంట్రాక్టు కుదుర్చుకున్నాడు. మరణం అంచుల దాకా వెళ్లి అతను తీసే ఫొటోలు రోజూ అంతర్జాతీయ పత్రికల మొదటిపేజీల్లో పడేవి.

1994 ఏప్రిల్ 18న కెవిన్ తన మిగతా ఇద్దరు స్నేహితులతో కలిసి టొకోజా టౌన్ షిప్లో జరుగుతున్న అల్లర్లను చిత్రీకరించడానికి వెళ్లాడు. అక్కడ త్వరత్వరగా తన పని ముగించుకుని వెళ్లిపోయాడు. కానీ... అతని ప్రాణమిత్రుడు ఊస్టర్ బ్రోక్ ఆ అల్లర్లలో జరిగిన కాల్పుల్లో చనిపోయాడు. ఆ వార్త రేడియోలో విని చలించిపోయాడు కెవిన్. అతణ్నే తలచుకుని కుంగిపోయాడు. మాదకద్రవ్యాలకు మరింతగా బానిసయ్యాడు. దాంతో భార్య అతణ్ని విడిచిపెట్టి వెళ్లిపోయింది. పనితీరు సరిగా లేకపోవడంతో రాయ్ టర్స్ సంస్థతో సంబంధాలు దెబ్బతిన్నాయి.

చేతిలో డబ్బులేదు.... మిత్రుని మరణం.... భార్య లేదు... ఎటు చూసినా అప్పులు....
కెవిన్ కి ఒకటే మార్గం తోచింది.
*                              *                              *
1994, జులై 27....
కెవిన్ తన వ్యాన్ సైలెన్సర్ కు ఒక పైపు బిగించి దాన్ని కిటికీ గుండా లోపలికి చేరవేసి బండి స్టార్ట్ చేశాడు.
ఇయర్ ఫోన్స్ పెట్టుకుని వాక్ మన్లో తనకిష్టమైన పాటలు వింటూ కళ్లు మూసుకున్నాడు.
వ్యాన్ సీట్లో అతని పక్కనే ఒక ఉత్తరం...
‘తట్టుకోలేకపోతున్నాను, ఫోన్ లేదు... డబ్బులేదు... అప్పులు... కళ్లముందే ఘోరమైన చావులు, బతుకుపోరాటాలు, హాహాకారాలు, ఆకలితో పేగులు మాడిన చిన్నారులు... విసిగిపోయాను. నాకింక శక్తి లేదు. అందుకే వెళ్లిపోతున్నాను... నా స్నేహితుడు ఊస్టర్ బ్రోక్ దగ్గరికి... అంతటి అదృష్టం నాకు ఉంటే’