Saturday, April 23, 2011

లటక్కన పెగ్గేసి చటుక్కున మూతి తుడుచుకుంటాం

పెగ్-1
మందు విషయంలో మనం ఎప్పుడూ రిస్క్ తీసుకోం.
సాయంత్రం ఇంటికి వచ్చేసరికి మా ఆవిడ వంట చేస్తూంటుంది.
వంటింట్లోంచి పాత్రల శబ్దం వినిపిస్తూ ఉంటుంది.
మనం పిల్లిలా ఇంట్లో దూరుతాం.
చెక్కబీరువాలోంచి మందు బాటిల్ తీస్తాం.
ఫొటోలో తాతగారు నవ్వుతూ చూస్తారు.
ఈ చెవిలో సద్దు ఆ చెవిలో పడనివ్వం.
ఎందుకంటే... మనం ఎప్పుడూ రిస్క్ తీసుకోం.
ఎవరూ వాడని బాత్రూం అటక మీంచి గ్లాసందుకుంటాం.
లటక్కన పెగ్గేసి చటుక్కున మూతి తుడుచుకుంటాం.
గ్లాసు కడిగేసి అటక మీద పెట్టేస్తాం.
తాతగారు బోసినవ్వుతో చూస్తారు.
వంటింట్లోకి తొంగి చూస్తాను.
మా ఆవిడ చపాతీపిండి కలుపుతూంటుంది.
ఈ చెవిలో సద్దు ఆ చెవిలో పడనివ్వం.
ఎందుకంటే... మనం ఎప్పుడూ రిస్క్ తీసుకోం.
మా ఆవిడకూ నాకూ మధ్య సంభాషణ మొదలవుతుంది.
నేను: శర్మగారమ్మాయి పెళ్లి సంగతేమైంది?
మా ఆవిడ: తిన్నగా ఉంటే కదా, మంచి సంబంధాలు రావడానికి!

పెగ్-2
మనం మళ్లీ ఇవతలికి వస్తాం.
చెక్కబీరువా తలుపు చప్పుడు చేస్తుంది.
మనం మాత్రం నిశ్శబ్దంగా బాటిల్ తీస్తాం.
లటక్కన పెగ్గేసి చటుక్కున మూతి తుడుచుకుంటాం.
బాటిల్ కడిగేసి అటకమీద పెట్టేస్తాం.
ఈ చెవిలో సద్దు ఆ చెవిలో పడనివ్వం.
ఎందుకంటే... మనం ఎప్పుడూ రిస్క్ తీసుకోం.

నేను: మన శర్మ కూతురు అప్పుడే పెళ్లీడుకొచ్చేసిందా?
ఆవిడ: ఇంకా పెళ్లి వయసేమి? అడ్డగాడిదలా ముప్ఫైయ్యేళ్లొస్తుంటే!

పెగ్-3
మనం మళ్లా చెక్కబీరువాలోంచి చపాతీపిండి తీస్తాం.
చెక్కబీరువాలో బాత్రూం ప్రత్యక్షమవుతుంది.
బాటిల్ తీసి అటకలో రెండౌన్సులు పోస్తాం.
లటక్కన పెగ్గేసి చటుక్కున మూతి తుడుచుకుంటాం.
తాతగారు పడీపడీ నవ్వుతుంటారు.
అటకని పిండిమీద పెట్టేసి తాతయ్యని కడిగేసి చెక్కబీరువాలో పెట్టేస్తాం.
మా ఆవిడ పొయ్యిమీద బాత్రూం పెడుతుంది.
ఈ బాటిల్లో సద్దు ఆ బాటిల్లో పడనివ్వం.
ఎందుకంటే... మనం ఎప్పుడూ రిస్క్ తీసుకోం.
నేను: ఏంటే? మా శర్మగారిని గాడిదంటావా... తోలు వలిచేస్తాను.
ఆవిడ: ఊరికే గొడవ చేయకుండా వెళ్లి పడుకోండి!

పెగ్-4
మనం పిండిలోంచి బాటిల్ తీస్తాం. చెక్కబీరువాలోంచి ఓ పెగ్ కలుపుతాం.
బాత్రూంని కడిగేసి అటకమీద పెట్టేస్తాం.
మా ఆవిడ ఫొటోలోంచి నవ్వుతూ చూస్తుంటే గాంధీ వంట చేస్తుంటాడు.
ఈ శర్మ సంగతి ఆ శర్మగాడికి తెలియనివ్వం.
ఎందుకంటే... మనం ఎప్పుడూ రిస్క్ తీసుకోం.
నేను: ఇంతకీ శర్మగాడి పెళ్లి ఆ గాడిదతో అయ్యిందా లేదా?
ఆవిడ: నెత్తిమీద బక్కెట్ నీళ్లు పోశానంటే... వెళ్లండి, బయటికి!

పెగ్-5
నేను మళ్లీ కిచెన్లోకి వెళ్తాను.
నిశ్శబ్దంగా అటకమీద కూర్చుంటాను. 

డ్రాయింగ్‌రూంలోంచి బాటిళ్ళ శబ్దం వినిపిస్తుంటుంది.
తొంగిచూస్తే... మా ఆవిడ బాత్రూంలో మందేస్తుంటుంది.
వెంటనే లటక్కన మూతేసి చటుక్కున పెగ్గు తుడుచుకుంటాం.
ఈ గాడిద చప్పుడు ఆ గాడిద చెవిలో పడనివ్వం.
అఫ్కోర్స్ తాతయ్య ఎప్పుడూ రిస్క్ తీసుకోడు.
శర్మ వంట చెయ్యడం పూర్తయ్యేవరకూ మనం ఫొటోలో కూర్చుని మా ఆవిణ్ని చూస్తూ నవ్వుతుంటాం.
ఎందుకంటే... మనం ఎప్పుడూ రిస్క్ తీసుకోం.

మరాఠీమూలం: నెట్ లో అజ్ఞాత రచయిత
తెలుగు అనువాదం: జొన్నవిత్తుల శ్రీరామచంద్రమూర్తి.

Saturday, April 9, 2011

శక్తి సినిమా ఎందుకు ఫ్లాపయ్యిందంటే...

బ్లాగుల్లో ఎంతమంది చెప్తున్నా శక్తి సినిమా చూసే సాహసం చేసేశాను. దీనిక్కారణం నాకు ఫ్యాంటసీ సినిమాలంటే ఇష్టం కాబట్టి.
అంజి సినిమా చూశాక ఎలాంటి ఫీలింగ్ కలిగిందో శక్తి చూశాక కూడా అలాగే అనిపించింది.
రెంటిలోనూ కామన్ పాయింటు... సినిమా మొత్తం హీరో ప్యాసివ్ గా ఉండిపోవడం.
అందులో చిరంజీవి ఆత్మలింగం కోసం ఎలాంటి ప్రయత్నాలూ చేయడు. అతని ప్రమేయం లేకుండానే దొరుకుతుంది. దొరికాకైనా దాంతో ఏమైనా చేస్తాడా అంటే చేయడు. భద్రంగా గూడేనికి తీసుకొచ్చి నాగబాబు గుడిసెలో దాస్తాడు. విలన్ వచ్చాక పిల్లల్ని కిడ్నాప్ చేసి కథ నడిపిస్తాడు. సినిమా మొత్తానికీ హీరో ఏమైనా చేశాడా అని తరచి చూస్తే ప్చ్! ఏం కనిపించదు.
ఎవడో కథ నడిపిస్తుంటే దానివెంట హీరోపోతుంటే చూడబుద్ధేయదు. కనీసం... చిరంజీవి, జూనియర్ ఎన్టీఆర్ లాంటి మాస్ హీరోల విషయంలో.
శక్తిలోనూ అంతే. ఫస్టాఫ్ అంతా హీరోయిన్ వెంటపడి ఆమె ఎక్కడికి పోతే అక్కడికి పోతుంటాడు జూనియర్. పోనీ సెకండాఫ్ లో విషయమేదైనా ఉందా అంటే అదీ లేదు. రుద్రశూలాన్ని ఉపయోగించి హంపిలోని అధిష్ఠాన శక్తిపీఠానికి (ఇది అష్టాదశ శక్తిపీఠాలకూ మూలపీఠం అని కథారచయిత కల్పన) చేరుకునే సీన్లు చాలా పేలవంగా అనిపిస్తాయి. క్లైమాక్స్ కు అరగంట ముందు దాకా హీరోకి ఒక లక్ష్యం ఉండదు. గాలి ఎటు వీస్తే అటు పోతుంటాడు.
ఇలా హీరో ప్యాసివ్ గా ఉంటే ఏం నచ్చుతుందీ!

దీన్ని రివర్సులో చూద్దాం.
ఒక్కడు, దిల్, ఇడియట్... పాతసినిమాలు తీసుకుంటే విజేత, మగమహారాజు,
ఇంకా నాకు పేర్లు అంతగా గుర్తురావడంలేదుగానీ, ఇలా హిట్టయిన సినిమా దేన్ని తీసుకున్నా కథ బలంగా ఉంటుంది. దాన్ని నడిపించే మెయిన్ క్యారెక్టర్ హీరోనే అయి ఉంటాడు.
ఇదంతా నా అనుకోలు మాత్రమే. నా థీరీకి కూడా కొన్ని ఎక్సెప్షన్లు ఉండొచ్చు. కథ అత్యద్భుతంగా ఉంటే ఈ లాజిక్కులేవీ పనిచేయకపోవచ్చు కూడా. హీరో డమ్మీ అయినా నడిచిపోతుంది. ఉదాహరణకు... బొమ్మరిల్లు.
(బొమ్మరిల్లు కథ మరీ అంత ఎక్ట్రార్డినరీనా అని నా మీదకు పోట్లాటకు దిగద్దండోయ్! అది నా సొంత అభిప్రాయం మాత్రమే).

థియేటరుకి వెళ్లి చూసేకన్నా... ఐదారునెల్లు ఆగితే టీవీలో వస్తుంది. అలా వచ్చినప్పుడు హాయిగా ఇంట్లోనే పడక్కుర్చీలో కూర్చుని చూడొచ్చు.

Thursday, April 7, 2011

చిలిపి

పాత సండే మాగజైన్లు తిరగేస్తుంటే కనిపించిందీ ఆర్టికల్. అప్పట్లో వేరే ఆర్టికల్ కోసం చూస్తుంటే బుష్ తిక్కతిక్కగా ఫోజులిచ్చిన ఈ ఫొటోలు కనిపించాయి. అలక్కానిచ్చేసిందే ఈ ఫొటోఫీచర్.

 అప్పటికి బుష్షొక్కడే గానీ... ఇప్పుడతగాడికి దిమిత్రీ మెద్వెదేవ్ కూడా తోడయ్యాడు.  కావాలంటే చూడండి.. :)

Thursday, March 31, 2011

దిగులేస్తోంది

ఎందుకో ఈ మధ్య దిగులేస్తోంది.
మొన్న రమణగారు... నిన్న నూతన్ ప్రసాద్...
మనకున్న కొద్దిమంది ప్రతిభావంతులు ఇలా ఒకరొకరుగా వెళ్లిపోతున్నారంటే మనసులో ఎక్కడో ఏదో తెలియని బాధ. ఎందుకో నిన్న నూతన్ ప్రసాద్ మరణవార్త వినగానే ‘రాజాధిరాజు’ సినిమా చూడాలనిపించింది. బాపు తీసిన ఈ సినిమాలో నూతన్ ప్రసాద్ సైతాను పాత్రలో అద్భుతంగా నటించాడు.
మనుషుల మనస్తత్వాల్లో కల్తీని ఎండగట్టేసిన రవణగారి మాటల్ని నూతన్ ప్రసాద్ గొంతులో వింటుంటే....
వినడమెందుకు, మీరే చూడండి.

నామిని... నెంబర్ వన్ పుడింగి

చూడబోతే ఇది కన్ఫెషన్ తరహా రచనల సీజన్లా ఉంది. మొన్నమొన్నే ఈ తరహాలో వర్మ రాసిన ’నా ఇష్టం‘ చదివాం. ఇప్పుడా పనికి నామిని వొగదెగినాడు.
‘నామిని నెంబర్ వన్ పుడింగి’ అంటూ కొత్తపుస్తకం రాసి జనాలమీదికి వొదిలాడు.

మొన్న శనివారం నాడు ఎడిషన్ డెడ్ లైన్ బిజీలో ఉండగా సాయంత్రం నాలుగింటప్పుడు మందపాటి పార్శిల్ వచ్చింది. రోజూ పుస్తక సమీక్షల కోసం అలాటి పార్శిళ్లు రావడం సహజమే కాబట్టి పెద్దగా పట్టించుకోలా. కొద్దిసేపటి తర్వాత బాయ్ వచ్చి ఒక పుస్తకం నా ముందు పెట్టి వెళ్లాడు. చూద్దును కదా... అది నామిని కొత్త పుస్తకం.

సిమెంటుకలర్ అట్టమీద బొమ్మ ఏమీ లేకుండా కింద టైటిల్ మాత్రం ఉంది.
అసలే చిన్నప్పటి నుంచి నామిని వీరాభిమానినేమో... ఆత్రంగా పేజీలు తెరిచి చూశాను.

మొత్తం ఎనిమిది అధ్యాయాలు.
1. మా దెయ్యాల బాట పక్కన్నే ఐద్రాబాదు!
2. ఆంధ్రజ్యోతిలో నా తోకాటలూ, జూటాతనాలూ!
3. నక్కతోక తొక్కిన మా టామ్ సాయర్ బుక్స్
4. ఏనుగు పడింది, ఏనుగే పైకి లేచింది!
5. రియల్ ఎస్టేట్ లో కూడా శోబన్బాబు కంటే, చెడ్డతనంలో వర్మా కంటే నాలుగాకులెక్కువే!
6. నారప్ప కొడుకు సుబ్రహ్మణ్యం గాకుండా నామిని ఎట్టయినాడంటే...!
7. పదిలచ్చల కోసరం నేను తలొంచింది దీనికీ..!
8. పది కుయ్యోమొర్రోలు!

గబగబా మొదలుబెట్టి ముందు మూడో అధ్యాయం చదివేశాను (ఎందుకు మూడో అధ్యాయమే చదివానంటే... ఏమో, నాకే తెలీదు). నవోదయ రామ్మోహనరావుగారి మానం తీసి మాకులకి కట్టేశాడు నామిని ఆ అధ్యాయంలో. అఫ్ కోర్స్ నవోదయా రామ్మోహనరావుగారితో ఆయనకైన అనుభవం అటువంటిదిలెండి. రచయిత్రి సోమరాజు సుశీల భర్త తనను ఎన్ని బండబూతులు తిట్టిందీ నిస్సిగ్గుగా రాసేసుకున్నాడు.
ఇట్ట మధ్యలోంచి చదివితే లాభం లేదురా అన్జెప్పి మొదట్నుంచీ మొదలుపెట్టాను. జ్యోతి వీక్లీ సంపాదకుడుగా ఉన్నప్పుడు తానెన్ని దొంగబిల్లులు పెట్టిందీ... జ్యోతి అప్పటి అధినేత జగదీష్ ప్రసాదుని ఎంత మోసం చేసిందీ లెక్కల్తో సహా రాసేశాడు. పుస్తక ప్రచురణలో తనకెన్ని లాభాలు వచ్చిందీ రాశాడు. తాగుడు ఎలా అలవాటైందీ ఎంతగా తాగి తలపోసుకుందీ రాశాడు.

వాట్ నాట్! అవన్నీచదువుతుంటే నామిని ఇంత జూటానా అనిపిస్తుంది.
నామినే రాసిన ‘సినబ్బ కతలు’లో ‘గుడిమల్లమోడి బూందీ దగ్గర నా చాతుర్రిం’ అనే కథొకటి ఉంది. అందులో గుడిమల్లమోడనే వాడి దగ్గర బూందీ ఉందన్న విషయం పసిగట్టి వాడికిష్టమైన హీరో నాగేశ్వరరావును పొగిడి, ఉత్తపుణ్యానికి ఎన్టీఆర్ని తిట్టి మొత్తం బూందీ కాజేస్తాడు నామిని. (నామిని పుస్తకాలు చదివినవాళ్లందరికీ ఈ కథ గుర్తుండే ఉంటుంది). అందులో చిన్నతనంలో ఉండే అమాయకత్వం నవ్విస్తుంది.
అదే మనస్తత్వం పెద్దయ్యాక కూడా ఉందంటే... అదీ మనకిష్టమైన రచయితలో..! ఎందుకో కాసేపు నమ్మబుద్ధి కాలేదు.

మూడో అధ్యాయం చదవగానే ఆయనకు ఫోన్ చేసి ‘ఇవన్నీ నిజమేనా సా’అని అడిగితే నిజమేనన్నాడాయన. ఎందుకిలా రాశారంటే ‘కన్ఫెషన్’ తరహా రచన అన్నారు.
కన్ఫెషన్ అంటే ‘ఒక దళారీ పశ్చాత్తాపం’ పుస్తకంలోలాగా చేసిన పనికి పశ్చాత్తాప పడాలి. నామిని రచనలో అలాంటిదేది కనపడలేదు.
నాకైతే నచ్చలేదు.
కానీ నామిని శైలి మాత్రం మొదట్నుంచీ చివరి దాకా లాక్కెళ్లిపోతుంది.

మచ్చుకి కావాలంటే కిందటి సోమవారం నాడు ఆంధ్రజ్యోతి ఎడిట్ పేజీలో ప్రచురించిన ఆరో అధ్యాయమిది, చదివి చూడండి.


*                       *                       *
ఇహ పోతే, ఈ నెల్లో మనకి అరుదైన పుస్తకాలు చదివే యోగమేదో బలంగా ఉన్నట్టుంది. పదమూడో తారీకునాడు మా పుట్టింటికి(విజయవాడ) వెళ్లినప్పుడు కాలవగట్టు వెంబడి పుస్తకాల షాపుల్లో తిరిగితే నాలుగు బౌండ్ల పాత చందమామలు దొరికాయి. 1981 నుంచి 90 దాకా ప్రచురితమైన పుస్తకాలున్నాయి. వరసలో కాకపోయినా నలభై పాత చందమామలు దొరకడమంటే మాటలు కాదుగా, మహాప్రసాదం అనుకుని తెచ్చేసుకున్నాను. ఆల్రెడీ మూడు బౌండ్లు చదివేశాను. ఇంకో బౌండు చదవాల్సి ఉంది.
అలాగే, సచిన్ టెండూల్కర్ మీద గౌతమ్ భట్టాచార్య రాసిన ‘సచ్’ పుస్కం ఫ్లిప్ కార్టులో తెప్పించాను. శుక్రవారం సాయంత్రం నాలుగింటికి ఆన్లైనులో బుక్ చేస్తే శనివారం సాయంత్రం నాలుగింటికల్లా చేతికి వచ్చేసింది. ఇటు సచ్ పుస్తకం చేతిలో పడగానే, అటు నామిని పుస్తకం చేతికొచ్చింది. ముందు ఏది చదవాలో అర్థం కాలేదు. తెలుగు కాబట్టి, సులభగ్రాహ్యం కాబట్టి నామిని పుస్తకమే మొదలుపెట్టి ఆరోజు రాత్రి ఒంటిగంటకల్లా పూర్తిచేసేశా. సచ్ పుస్తకం కూడా సగం అయింది. మిగతా సగం చదవాల్సి ఉంది.

Monday, February 28, 2011

రెండ్రోజులు మైకంలో ఉండిపోయా!

సాలూరి రాజేశ్వరరావు... గాలిపెంచల నరసింహారావు... మాస్టర్ వేణు...  సుసర్ల దక్షిణామూర్తి... సి.ఆర్.సుబ్బురామన్... ఘంటసాల... పెండ్యాల... ఆదినారాయణరావు... కె.వి.మహదేవన్... ఎమ్మెస్ విశ్వనాథన్... రమేశ్ నాయుడు... రాజన్ నాగేంద్ర... ఎస్.పి.కోదండపాణి... సత్యం...  జె.వి.రాఘవులు... చక్రవర్తి... ఇళయరాజా... ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం...
ఒకరా ఇద్దరా!!
30 మంది లెజెండ్స్... మ్యూజిక్ మాస్ట్రోస్...
వాళ్లందరి బాల్యం గురించి, సంగీతంలో ప్రవేశం గురించి వాళ్ల జీవితాల్లోని అద్భుత ఘట్టాల గురించీ...
ఒక్కచోట చదివే అవకాశం వస్తే..!
ఆ అదృష్టం ఈ శనివారం నాకు దక్కింది.
ఆ పుస్తకం పేరు... స్వర్ణయుగ సంగీత దర్శకులు

 
చేతికి రాగానే ఆవురావురుమంటూ చదవడం మొదలెట్టాను.
ముందుగా... ఇండెక్స్ పేజీ తీసి నాకు బాగా ఇష్టమైన రమేష్ నాయుడు గారి(294-325) గురించి చదివేశాను.ఆ తర్వాత మొదటికొచ్చి మొదట్నుంచీ చదివేశాను.
నాకు ఆరేడేళ్ల వయసప్పుడు దూరదర్శన్లో ఒక జంతువుల సినిమా వచ్చింది. అందులో ప్రధాన పాత్రలు రెండు కోతులు(శంకర్, గౌరీ). అంత చిన్న వయసులోనే ఆ సినిమా నా మనసులో బలంగా ముద్రపడిపోయింది. ఆ సినిమా తీసింది మన రమేశ్ నాయుడుగారేనని... బొంబాయి కలకత్తాల్లో దుమ్ము రేపి రచ్చ గెలిచాకే ఆయన ఇంట(తెలుగునాట) గెలిచారనీ... ఈ పుస్తకం చదివాకే తెలిసింది. అలాగే ఎమ్మెస్ విశ్వనాథన్ చెన్నైలో నటుడిగా అవకాశాల కోసం వెతుకుతూ కొన్నాళ్లు ఒక నిర్మాత దగ్గర ఆఫీసు బాయ్ గా  చేశారనీ... కె.వి.మహదేవన్ గురించి బాపురమణలు చెప్పిన ముచ్చట్లు... వాళ్లల్లో చాలామంది సంగీత దర్శకుల గురించి మన గానగంధర్వుడు బాలసుబ్రహ్మణ్యం చెప్పిన విశేషాలు...
ఏమని చెప్పను నా పరిస్థితి!!!
ముందు మూడొందల తొంభై ఐదు పేజీలు ఏకబిగిన చదివేశాను.
తర్వాత మిగతా పేజీలు పూర్తిచేసి పడుకునే సరికి తెల్లవారుజామున మూడయింది.
ఎలాంటి మహానుభావులండీ ఒక్కొక్కరూ..!
మనం ఎంతగానో అభిమానించే వ్యక్తుల గురించి అన్నేసి విషయాలు ఒకేసారి తెలుసుకోవడంలో ఉండే మజా అది అనుభవిస్తేగానీ అర్థం కాదు.
అదొక మైకం. ఆ మైకంలో రెండ్రోజులు ఉండిపోయాను.

ఇంత గొప్ప పుస్తకాన్ని తేవాలన్న ఆలోచన వచ్చినందుకు చిమట మ్యూజిక్ శ్రీనివాసరావుగారిని తెలుగు సినీ సంగీతాభిమానులందరూ అభినందించాల్సిందే. ఈ బృహత్తర యత్నాన్ని నెత్తిన వేసుకుని రెండేళ్లపాటు శ్రమించి ఆరొందల పేజీల అద్భుతాన్ని మన కళ్ల ముందు ఆవిష్కరించిన పులగం చిన్నారాయణగారికి నూటపదహారు వీరతాళ్లు వేసుకోవాల్సిందే.

ఇంతా చేసి, ఈ పుస్తకం ఖరీదు రూ.500 అంటే చాలా ఆశ్చర్యం వేసింది. ఆ విశేషాలకిగానీ... ఇందులోని అమూల్యమైన విశేషాలకి గానీ... వెలకట్టడం అసలు సాధ్యమయ్యే పనేనా అని.

సాధారణంగా ఏదైనా పుస్తకానికి సమీక్ష రాస్తే సమీక్షకుడికి ఒక కాపీ ఇవ్వడం ఆనవాయితీ. అందుకే ఈ పుస్తకానికి నేను సమీక్ష రాయదల్చుకోలేదు(పత్రికలో).
ఎందుకంటే... ఈ పుస్తకాన్ని డబ్బులిచ్చి కొనడమే ఆ మహానుభావుల పట్లా ఈ పుస్తక రూపకర్తల పట్లా నేను చూపగలిగిన గౌరవం అని నాకు అనిపించింది కాబట్టి.
అందుకే ఈ పుస్తకాన్ని కొని దాచుకుంటాను.
మళ్లీమళ్లీ చదువుకుంటాను.


పుస్తకం వివరాలు
స్వర్ణయుగ సంగీత దర్శకులు
రచయిత: పులగం చిన్నారాయణ
పేజీలు : 600
వెల : రూ.500
(డాలర్లలో అయితే  $60.)

ప్రతుల కోసం:
మన రాష్ట్రంలో అయితే అన్ని ప్రధాన పుస్తక కేంద్రాల్లో దొరుకుతాయి.

అమెరికాలో ఉండేవారు సంప్రదించవలసిన చిరునామా
శ్రీనివాస్ చిమట
34361 EUCALYPTUS TERRACE
FREMONT, CA 94555 USA

e-mail: Chimata.Music@gmail.com

Thursday, January 27, 2011

అచ్చవని నా ఆర్టికల్... బ్లాగుల్లో సాహితీ సేద్యం

పోస్టు చేయని ఉత్తరాల్లాగా ఈనాడు ఆదివారంలో అచ్చుకు నోచుకోని ఒకానొక పాత ఆర్టికల్ ఇది. 2008లో రాశాను. బ్లాగుల్లో కథ, పద్యం, కవిత్వం, పేరడీ... ఆఖరుకు అవధానంతో సహా అన్ని ప్రక్రియలూ వెలిగపోతున్నాయన్నదే కాన్సెప్టు.
===============
కథ, పద్యం, కవిత్వం, పేరడీ... ఆఖరుకు అవధానంతో సహా అన్ని ప్రక్రియలతోనూ బ్లాగుల్లో సాహిత్యం వెలిగిపోతోంది. కందాలూ సీసపద్యాలూ సమస్యాపూరణలూ కథలూ కవితలూ... భువనవిజయాన్ని తలపిస్తున్నాయి  తెలుగుబ్లాగులు. బ్లాగరులే అష్టదిగ్గజాలై చెలరేగిపోతున్నారు.

బ్లాగంటే... ఎవరో ఒకరి సొంతసోది. కానీ తెలుగు బ్లాగులు ఇంకో అడుగు ముందుకేశాయి. అభిప్రాయాల వెల్లడితోపాటు అవధానాలూ సాగుతున్నాయక్కడ. పద్యాలు రసగంగాప్రవాహమై పొంగుతున్నాయి. కథలూ కవితలూ పేరడీలూ ఇవన్నీ పిల్లకాలువలు!


కందాల వెల్లువ
కందం రాయనివాడు కవిగాడని సామెత. అలాగైతే బ్లాగుల్లో కవులు చాలామందే ఉన్నారు. అనగా కందాలు రాస్తున్నవారన్నమాట. సమస్యాపూరణం నుంచి... సమకాలీన విషయాల మీద తమంతట తాము స్పందించి రాసినవాటిదాకా ఎన్నెన్నో పద్యాలు. రాసేవాళ్లంతా గొప్ప అవధానులూ కారు. సామాన్యులే. చిన్నప్పటి నుంచీ పద్యం మీద ఉండే ఆసక్తీ అభిలాష, కొద్దోగొప్పో సహజ ప్రతిభ... ఇవే వారి సాహితీ సేద్యానికి పెట్టుబడులు. విశేషమేంటంటే ఇలా ప్రయత్నం చేసిన ప్రతి ఒక్కరూ క్రమంగా పద్యాలు రాయడంలో పట్టు సాదఇంచడం. పద్యం నడకను పట్టుకుని అలవోకగా కందాలల్లే స్థాయికి చేరుకోవడం. మధ్యలో ఎక్కడైనా నట్టుపడితే ఆదుకోవడానికి బ్లాగ్గురువులు అందుబాటులోనే ఉంటారు. రోజువారీ అందరూ వాడే, అందరికీ అర్థమయ్యే పదాలతో ఎంత సులభంగా పద్యాలు రాయొచ్చో ఆ కిటుకు విడమరిచి చెబుతారు. కొత్తవారు రాసిన పద్యాలకు మరికొన్ని విరుపులతో సరికొత్త సొగసులద్దుతారు. మొత్తమ్మీద పసందైన పద్యాలు ఊపిరి పోసుకుంటాయి. రాదురాదంటూనే ఔత్సాహిక కవులు ఉద్దండులవుతారు. కావాలంటే... ‘తెలుగులో తప్పటడుగులు’ అంటూనే పద్యాల గొప్పటడుగులు వేస్తున్న లంకాగిరిధర్ అనే ప్రవాసాంధ్రుడి బ్లాగు చూడొచ్చు. ‘పై చదువులకని కొన్నాళ్లూ ఉద్యోగరీత్యా కొన్నాళ్లూ మొత్తానికొ పదేళ్లపైగానే ఇంటికి దూరంగా ఉంటూ ఇంట్లో వాళ్లతో తప్ప తెలుగులో సంభాషఇంచే అవకాఅం లేక... తెలుగులో ధారాళంగా మాట్లాడగలిగే శక్తినే కోల్పోతున్న దళలో నాలో స్వభాషఆభిమానానికి పునర్జన్మనిచ్చిన గొప్పదనం తెలుగు బ్లాగరులకే చెందుతుంది. వారికి నా ప్రేమపూర్వక ధన్యవాదాలు’ అంటారాయన.

నెట్లో భువన విజయం
అవును... భువనవిజయమే! అంతర్జాలంలోనే! తెలుగు బ్లాగరుల్లో పద్యాల మీద ఆసక్తి ఆ స్థాయికి చేరింది మరి. పొద్దు అనే వెబ్ జైన్ ‘అంతర్జాల భువన విజయం’ పేరుతో సాహితీసేద్యానికి శ్రీకారం చుట్టింది. సమస్యల ఏరువాక... చమత్కార వ్యాఖ్యానాల ఎరువు జల్లడం... పూరణల పంట... అన్నీ ఒక్కరోజులోనే! 


అదీ ఏడాదిలో రెండుసార్లు. మొదటి భువన విజయం తెలుగువారి తొలిపండుగ ఉగాదినాడు జరగ్గా రెండోది ఇటీవలే విజయదశమినాడు జరిగింది. అప్పటిదాకా ఎవరిబ్లాగుల్లో వారుపద్యాలు రాసుకోవబడమే రివాజు. అలాంటిది పదిపదిహేను మంది బ్లాగర్లు ఇంటర్ నెట్ లో ఒకచోట కూడి తమ ప్రతిభను ప్రదర్శించడం అపూర్వం. మరే ప్రాంతీయ బ్లాగర్లూ ఇలాంటి ప్రయత్నం చేయలేదేమో బహుశా!

ఎందరో సాహితీప్రియులు
వాగ్విలాసం చిరునామాగా చెలరేగుతున్న శ్రీరాఘవ, ‘ఆంధ్రామృతం’ చిలికిస్తున్న చింతా రామకృష్ణారావు, అరుదైన పద్యాల ‘తెలుగు పద్యం’తో సాహితీప్రియులకు విందు చేసే భైరవభట్ల కామేశ్వరరావు, ‘అందం’గా కందాల్లే రాకేశ్వరుడు (కందపద్యాలకో ‘ఇమేజీ’నిచ్చారీయన), తాను రాస్తూ సమస్యలిచ్చి పూరించమనే ఊకదంపుడు(పేరడీ శ్లేషలకు పెట్టింది పేరు. ఈయన మాటల్లో అక్షరానికో చమత్కారబాణం)... కుస్తీ పట్టి యతిప్రాసలూ గణనియమాలూ కూడగట్టుకుంటూ కందప్రాశన చేసి ఓ వెలుగు వెలిగిపోతున్న చదువరి, రానారె లాంటి శిష్యులూ ఇంకా కొత్తపాళీ, కలగూరగంప, జోరుగాహుషారుగా, సిరివెన్నెల... ఇలా ఎందరో బ్లాగర్లు... కాదుకాదు సాహితీప్రియులున్నారు అంతర్జాలంలో.


పద్యాలపూరణే కాదు, కథాపూరణలూ జరుగుతున్నాయి నెట్లో. ఉదాహరణకు... కొత్తపాళీ అనే బ్లాగరు ‘తెల్లకాగితం’ అనేఅంశాన్నిచ్చి దాని మీద కథ రాయాల్సిందిగా సూచించారు. ఆసక్తి ఉన్న అనేకమంది ఈ కథాపూరణ ప్రక్రియలో పాల్గొన్నారు. వాటిని పొద్దు వారు ప్రచురించడం మరో ముచ్చట. 

ఆ కథల్లోనూ కవితల్లోనూ పద్యాల్లోనూ నాణ్యత సరైనదేనా... అన్న సందేహం వస్తే మాత్రం... ‘ఇంతమంది ఔత్సాహికుల, అలవాటు లేని వారు సైతం ఆసక్తితో ఈ పాటి ప్రయత్నం చేయడమే గొప్పవిషయం కదా’ అని సమాధానం వస్తుంది బ్లాగర్ల నుంచి.


నిజమే, తప్పుల్దేముంది, తర్వాతైనా సరిదిద్దుకోవచ్చు. ప్రయత్నమే ముఖ్యం, ఏమంటారు!
==================


అద్గదీ కథ!
కాకపోతే కొన్ని కారణాల వల్ల ఈ వ్యాసం ప్రచురణకు నోచుకోలేదు. నిన్న జరిపిన క్లీన్ అండ్ క్లీన్ కార్యక్రమంలో భాగంగా అనుకోకుండా నా డెస్కులో అట్టడుగున ఎక్కడో కంట పడిందీ రెండేళ్లనాటి కాపీ. ఒక టపాకైనా మేత దొరికిందిగదాని అక్కడ చదివి ఇక్కడ నెమరేస్తున్నా. 
ఇక్కడ నా అనుకోలు ఇంకోటుంది. ఇదంతా రెండేళ్లక్రితం సంగతి. ఇప్పుడు బ్లాగుల్లో చాలా మార్పులొచ్చేశాయి.
ఏంటా మార్పులంటారా... మంది ఎక్కువైపోయారు(నాతో సహా :) )

Sunday, January 23, 2011

గాజులమ్మేసి రైలెక్కా

ఈవీవీ సత్యనారాయణ... బూతుకామెడీకి పెట్టింది పేరు. ద్వంద్వార్థ సంభాషణలకు కేరాఫ్ అడ్రస్...
ఇదీ మీ సినిమాలపైనా మీమీదా చాలామందికి ఉన్న అభిప్రాయం. దీనికి మీరేమంటారు?

చిన్నప్పుడు మేం ఏ సినిమా చూసినా హాల్లోంచి బయటికొచ్చేటప్పుడు ‘...గాడు ఏం చేశాడ్రా, లం... కొడుకు’అనే కామెంట్లు వినిపించేవి. ఆ సందర్భంలో అది తిట్టు కాదు. ఒక హీరోమీద లేదా నటుడిమీద సాధారణ ప్రేక్షకుడు తన అభిమానాన్ని ఆ ఒక్క మాటలో చెప్పే విధానం.  బాగా పాలిష్డ్;,,గా మాట్లాడేవాళ్ల సంగతి నాకు మద్రాసుకొచ్చేదాకా తెలీదు. మనసులో ఏమున్నా అలా బయటికి మాట్లాడే మనుషుల్ని చూస్తూ పెరిగాను. అందుకే నా సినిమాల్లో పాత్రలు అలాగే మాట్లాడతాయి, ప్రవర్తిస్తాయి. నా టార్గెట్ కూడా ఆ ప్రేక్షకులే.
...అని కచ్చితంగా చెప్పారాయన. కనీసం ఆయనకు ఆ క్లారిటీ ఉన్నందుకైనా ఫరవాలేదనిపించింది నాకు.  2009లో ఈవీవీని ఇంటర్వ్యూ చేయడానికి వెళ్లినప్పుడు మా మధ్య జరిగిన సంభాషణ ఇది. ఈవీవీ సినిమాలు అలా ఉంటాయని తెలిసీ వెళ్లి, చూసి ఎంజాయ్ చేసిన సవాలక్ష మందిలో నేనూ ఒకణ్ని. ఆయన శ్రుతి మరీ మించినప్పుడు(ఉదాహరణకు ‘అల్లుడా మజాకా’. ఇంకా ఇలాంటివి చాలానే ఉన్నాయి) తిట్టుకున్న సవాలక్ష మందిలోనూ నేనొకణ్ని.  ఈ ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు అవకాశాన్ని వదులుకోకుండా... ‘అల్లుడా మజాకా’లో అత్తగారిని పట్టుకునే సీన్ గురించి కూడా అడిగాను. ఆయన ఏదో సమర్థించుకున్నాడుగానీ... ఆయన ఇంటెన్షన్ మాత్రం సూటిగా జనాలకు చేరిందన్నది వాస్తవం.
    సరే, ఇవాళేదో ఈవీవీ చనిపోయాడని ఆయన్ని బి.ఎన్.రెడ్డి సరసనో కె.వి.రెడ్డి సరసనో కూర్చోబెట్టంగానీ... కచ్చితంగా తెలుగు సినిమా చరిత్రలో ఆయనదంటూ ఒక ప్రత్యేక పేజీ ఉంది.
అది ఈవీవీ స్కూల్. 
    ఇక్కడితో నా సోది ఆపేస్తాను. ఇక ఆ ఇంటర్వ్యూ విశేషాలు చదవండి.

=====================
తేదీ గుర్తులేదుకానీ... చెన్నైలో నేను అడుగు పెటి్టన మొదటి రోజది. సెంట్రల్ స్టేషన్లో దిగాను. జోరున వర్షం కురుస్తోంది. నేను వెళ్లాల్సింది టి నగర్. ఎక్కడో తెలీదు. ఎలా వెళ్లాలో తెలీదు. పోనీ, ఎవరినైనా అడుగుదామా అంటే భాష రాదు. అలాగే నానా తిప్పలూ పడుతూ లేస్తూ నడుచుకుంటూనే టి నగర్ చేరుకున్నాను. పొద్దున ఆరింటికి స్టేషన్ దగ్గర బయల్దేరితే అక్కడికి చేరేసరికి పదకొండంయింది. అది... నవతా కృష్ణం రాజుగారి ఆఫీసు.
*        *        *
వానలో తడిసి నీళ్లోడుతున్న బట్టలతోనే ఆయన్ను కలిసి ‘నా పేరు సత్యమండీ, కోరుమామిడి నుంచొచ్చాను. మీ మేనల్లుడు సుబ్బరాజు స్నేహితుణ్నండీ’ అని పరిచయం చేసుకుంటూనే మా సుబ్బరాజు రాసిన ఉత్తరం ఆయన చేతికిచ్చాను.
    ఏం మాట్లాడకుండా నేనిచ్చిన ఉత్తరం తీసుకుని చదివి... అప్పుడడిగారాయన. ‘ఏమైనా తిన్నావా’ అని. తిన్లేదంటే ఇడ్లీలు తెప్పించి పెట్టారు. అవి తినేదాకా ఆగి... ‘ఏంచేస్తావు’ అన్నారు.
‘ఏమైనా చేస్తానండీ’ అన్నాను.
‘మీరేదో అనుకుని వచ్చేస్తారుగానీ... ఇక్కడేం ఉండదమ్మా, మీ ఊరెళ్లిపో’ అన్నారాయన.
నా నెత్తిన పిడుగుపడ్డట్టయింది.
వ్యవసాయంలో అప్పులపాలై బతకి చెడ్డ కుటుంబం మాది, ఇంటికి పెద్ద కొడుకుని. పోషించాల్సిన బాధ్యత నాదే. అన్నిటికీ మించి... మా ఆవిడ గాజులమ్మేసి మరీ చెన్నపట్నం వచ్చాను. అవన్నీ ఆలోచించుకుంటూ అక్కడే నుంచున్నాను. మధ్యాహ్నం ఒంటిగంటప్పుడు ఆయన భోజనానికెళ్తూ నన్ను చూశారు. మళ్లీ అదే మాట చెప్పి వెళ్లిపోయారు. ఆయన భోజనం నుంచి వచ్చేదాకా అక్కడే నుంచున్నా. ఏం మాట్లాడకుండా లోపలికి వెళ్లిపోయారు. రాత్రి తొమ్మిదింటప్పుడు ఆయన బయటికొచ్చేటప్పటికి కూడా చేతులు కట్టుకుని అక్కడే నిలబడి ఉన్నాను.
కొంచెం విసుక్కుని ‘ఇప్పుడెక్కడికి వెళ్తావులే, ఇక్కడే ఉండు. కానీ పొద్దున్నే వెళ్లిపోవాలి’ అని భోజనం పెట్టించి అక్కడే పడుకోమన్నారు. నేను మర్నాడు పొద్దునా వెళ్లలేదు.
ఇహ మా మధ్య మాటల్లేవు. రోజూ ఆయనొచ్చే సమయానికి చేతులు కట్టుకుని అక్కడ నిలబడేవాణ్ని. రెండ్రోజులు, మూడ్రోజులు.... అలా పదిరోజులు గడిచాయి!!
ఆయనకు నా మీద జాలేసినట్టుంది. ఒకరోజు పిలిచి ‘వచ్చేనెల మా సినిమా ఒకటి మొదలవబోతోంది. అందులో అసిస్టెంట్ డైరెక్టరుగా చేద్దువుగానివిలే. అప్పటిదాకా ఇంటికెళ్లిరా’ అన్నారు.
కొండంత బరువు నెత్తిమీది నుంచి దింపినట్టయింది.
హుషారుగా ఇంటికి బయల్దేరాను.

*        *        *
నెలరోజుల తర్వాత మళ్లీ చెన్నై వెళ్లాను. కృష్ణంరాజుగారి సినిమాకి దేవదాస్ కనకాల దర్శకుడు. ఆయన దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్గా చేరాను. ఆ సినిమా పేరు ‘ఓ ఇంటి భాగోతం’. హీరో చంద్రమోహన్. మొదటి సారి సినిమా నటుల్ని చూడ్డం కదా... ఏదో తెలియని ఆనందం. చంద్రమోహన్తో ఫొటోలు దిగి ఇంటికి పంపించడం, ఎడిటింగ్ రూములో కిందపడి ఉండే నెగెటివులు తీసుకుని కవర్లో పెట్టి స్నేహితులకు పోస్టు చేయడం లాంటి పనులు చేసేవాణ్ని. ఇప్పడవన్నీ తల్చుకుంటుంటే నాకే నవ్వొస్తుంది.
    ఆ సినిమా షూటింగ్ సమయంలో నా పనితీరు నచ్చడంతో దేవదాస్ కనకాల తాను తర్వాత తీయబోయే సినిమాలకు కూడా నన్నే సహాయకుడిగా పెట్టుకుంటానన్నారు. అన్నట్టుగానే తర్వాత మూడు సినిమాలు తీశారు. అవి మూడూ ఫ్లాపవడంతో చెన్నై వదిలేసి హైదరాబాదుకి వెళ్లిపోయారు.
    మళ్లీ మొదటికి వచ్చినట్టయింది నా పరిస్థితి. ఆయన కాకుండా ఇండస్ట్రీలో నాకు తెలిసిన వ్యక్తి నవతా కృష్ణంరాజుగారే. మళ్లీ ఆయన దగ్గరికే వెళ్లాను. అదృష్టవశాత్తూ మరోనెలలో వాళ్లు జంధ్యాలతో ఒక సినిమా మొదలుపెడుతున్నారని తెలిసింది. ‘ఆయన దగ్గర చేరుదువుగానిలే’ అని భరోసా ఇచ్చారు కృష్ణంరాజుగారు.
    ఆ సినిమా... ‘నాలుగు స్తంభాలాట’.
    జంధ్యాలగారి దగ్గర అప్పటికే నలుగురు అసిస్టెంట్లు ఉన్నారు. ప్రొడ్యూసర్ బలవంతమ్మీద నన్ను అయిదో వాడిగా తీసుకున్నారు. యూనిట్లో అందరూ కూడా నన్ను మొదట్లో హీనంగా చూసేవారు. ఇక ఆ అసిస్టెంట్ దర్శకుల గురించి అయితే చెప్పనక్కర్లేదు. కానీ... రానురానూ జంధ్యాలకు నేను కుడిభుజాన్ని అయిపోయాను. షూటింగ్ ముగిసేసరికి జంధ్యాలగారే తనంతటతాను ‘నువ్వు నా దగ్గర ఉండిపో’ అన్నారు. ఆ తర్వాత వరసపెట్టి సినిమాలు.
    నాలుగుస్తంభాలాటతో మొదలుపెట్టి అహ నా పెళ్లంట దాకా 23 సినిమాలకు ఆయన దగ్గర పనిచేశాను.

*        *        *
ఇవాళ ఎన్ని అడుగులు(ఫిలిం) ఎక్స్ పోజ్ చేశారు... రేపు షూటింగ్ ఎక్కడ... ఆర్టిస్టులెవరు...
రామానాయుడుగారు షూటింగ్కి వచ్చినప్పుడల్లా ఇలా అడగటం అలవాటు. అదే అలవాటుతో ‘అహ నా పెళ్లంట’షూటింగ్ సమయంలో ఆయన అడిగే ప్రశ్నలన్నిటికీ నేను తడుముకోకుండా, డైరీ చూడకుండా టకాటకా సమాధానాలు చెపే్పసేవాణ్ని. అదాయన మనసులో రిజిస్టరయింది.
    ఆ సినిమా విడుదలై హిట్టయ్యాక ఒకసారి ఆయన్ని కలవడానికి వెళ్తే... ‘జంధ్యాల దగ్గర ఎన్నాళ్ల నుంచి పనిచేస్తున్నావు’ అనడిగారు.
    ‘ఏడెనిమిదేళ్ల నుంచి’ అని చెప్పాను.
    ‘ఎన్నాళ్లిలా ఉండిపోతావు, డైరెక్షన్ చెయ్యవా’ అనడిగారాయన. ‘అవకాశం వస్తే చేస్తానండీ’ అన్నాను. ‘అయితే మంచి కథ తయారుచేసుకో, నీకు ఛాన్సిస్తాను’అన్నారాయన.
    కథ రెడిగా ఉందండీ, అని అప్పటికే నేను తయారుచేసుకున్న ‘చెవిలో పువ్వు’ కథ తీసుకెళ్లి ఆయనకు చూపించాను. నేను రాసుకున్న మొదటిస్క్రిప్టు కదా... రంగురంగుల స్కెచ్చు పెన్నులతో చాలా అందంగా తయారుచేసుకున్నానా స్క్రిప్టుని.
    ఆ కథ నాయుడుగారికి బాగా నచ్చింది. ‘బావుందయ్యా కథ, మనం చేద్దాం ఈ సినిమా’ అన్నారు.
ఆ మాటకి నేను ఆల్మోస్ట్ మబ్బుల్లో ఎగిరాను. పదేళ్ల కల అది... డైరెక్టర్ కావడం! కానీ....
    నాలుగైదు రోజుల తర్వాత నాయుడుగారు నాకు ఫోన్ చేసి... ‘కమల్ హాసన్ డేట్లు దొరికాయయ్యా, కాబట్టి ముందు ఆ సినిమా చేసి, తర్వాత నీ కథ చేద్దాం’ అన్నారు. అంటే ఎంత లేదన్నా నా ప్రాజెక్టు ఐదార్నెల్లు ఆలస్యమవుతుంది. సరేనన్నాను.
    మళ్లీ రెండ్రోజుల తర్వాత ఆయనే ఫోన్ చేసి... ‘కమల్,కి ఓ కో-డైరెక్టర్ కావాలంటయ్యా, నీకు స్క్రిప్టు బాగా రాసే అలవాటుందిగా, నువ్వు రాకూడదూ’ అనడిగారు. ఎగ్గిరి గంతేసినంత పనిచేశాను. నేను కమల్ హాసన్ కి పెద్ద అభిమానిని. ఆయనతో కలిసి పనిచేసే అవకాశం వచ్చిందనేసరికి ఆనందం పట్టలేకపోయాను.  మర్నాడే వెళ్లి కమల్ని కలిశాను. ఆయన ఇంట్లోనో ఆఫీసులోనో రోజూ స్టోరీ సిట్టింగ్స్ పెట్టేవాళ్లం. నా కెరీర్లో మొదటిసారి ఆ సినిమాకి సంభాషణలు రాశాను. నేను రాసే డైలాగులు ఆయనకు విపరీతంగా నచ్చేవి.
    ఆ సినిమాలో కమల్ హాసన్ తాగి ఇంటికొచ్చి తలుపుకొట్టే సీనొకటుంది. కమలే వచ్చి రెండుసార్లు తలుపుకొట్టి, తనే ‘కమిన్’ అనేటట్టుగా ఆ సీన్ రాశాను. పగలబడి నవ్వారాయన ఆ సీన్ చెప్తే. అదేకాదు, ఆ సినిమాలో నే రాసిన చాలా సీన్లు తల్చుకుని తల్చుకుని నవ్వేవారాయన. అలా ఆ సినిమాకి పదకొండు నెలలు కమల్ హాసన్తో కలిసి పనిచేయడం ఓ గొప్ప అనుభవం.
    సరే, మళ్లీ నా విషయానికి వస్తే... ‘ఇంద్రుడు-చంద్రుడు’సినిమా విడుదలడమూ హిట్టవడమూ జరిగిపోయాయి. ఇక నా సినిమా మొదలెడతారేమో అనుకున్న టైములో నాయుడుగారికి అనిల్ కపూర్ డేట్లు దొరికాయి. దాంతో ఏదో హిందీ సినిమా మొదలుపెట్టారాయన. నా సినిమా మరో ఏడాది వాయిదా పడింది. అప్పుడు నిర్మాత అశోక్ కుమార్,కి నా స్క్రిప్టు గురించి తెలిసి ఆ సినిమా తాను తీస్తానన్నారు. తానే నాయుడుగార్ని సంప్రదించి అందుకు ఒప్పించారు. అలా అశోక్ కుమార్ నిర్మాతగా నా తొలిసినిమా ‘చెవిలో పువ్వు’ మొదలైంది.
     ఆ సినిమా షూటింగుకి చాలా అడ్డంకులు ఎదురయ్యాయి. షెడ్యూలు మధ్యలో సీత పార్తీబన్ ని వివాహం చేసుకోవడం వల్ల మాకిచ్చిన డేట్లలో అందుబాటులో లేకుండా పోయింది. షూటింగ్ ప్రణాళిక ప్రకారం జరక్కపోవడంతో మిగతా ఆర్టిస్టుల కాల్షీట్లు సర్దుబాటు కష్టమయింది. దీంతో తక్కువ సమయంలోనే హడావుడి హడావుడిగా తీసేయడంతో సినిమా కంగాళీగా తీసేశాం. సినిమా విడుదలకు ముందురోజు రాత్రికి గానీ రషెస్ చూడ్డం కుదర్లేదు నాకు. కానీ... రషెస్ చూడగానే అర్థమైపోయిందినాకు ఆ సినిమా ఫలితమేంటో!

*        *        *
మొదటి సినిమా ఫ్లాపయినా నాకు తన బ్యానర్లో దర్శకత్వం వహించే అవకాశం ఇచ్చారు రామానాయుడుగారు. ఎందుకంటే ‘చెవిలోపువ్వు’ సినిమా ఎంత హడావుడిగా తీశామో ఆయనకు తెలుసు. ఆయనకు నామీద పూర్తి నమ్మకం ఉండటంతో మరో ఆలోచన లేకుండా ఛాన్సిచ్చారు. కాకపోతే ఈసారి నా స్క్రిప్టు కాకుండా పరుచూరి బ్రదర్స్ రాసిన ఒక సినిమా స్క్రిప్టు నా చేతికిచ్చి చదవమన్నారు. అది నాకు పెద్దగా నచ్చలేదు. ఆ మాటే చెప్పాను.
    ‘నాకూ అలాగే అనిపించింది, నువ్వూరాస్తావుగా... ఎలా ఉంటే బాగుంటుందో రాసి చూపించు’ అన్నారు. దాదాపు నెలరోజులలో 18 వెర్షన్లు రాశానా సినిమాకి. చివరిది పరుచూరి బ్రదర్స్ కి నచ్చడంతో షూటింగ్ మొదలుపెట్టాం.
    నాకో అలవాటుంది... స్క్రిప్టులో ఉన్నదానికి అవసరాన్ని బట్టీ షూటింగులో కాస్తంత మార్పుచేర్పులు చేస్తుంటాను. అలా సినిమా 90 శాతం పూర్తయ్యేసరికి స్క్రిప్టులో వాళ్లు రాసినదానికీ నేను తీసినదానికీ సంబంధం లేకుండా పోయింది. రషెస్ చూసిన పరుచూరి బ్రదర్స్ నామీద మండిపడ్డారు. సినిమాని నాశనం చేసేశానని రామానాయుడుగారికి చెప్పారు.
    దాంతో రామానాయుడికి బాగా కోపం వచ్చింది. పరుచూరి బ్రదర్స్ అంతటి వాళ్లు బాగాలేదన్నారంటే నిజమేనేమో అనుకుని రషెస్ చూసి నిర్ధరించుకోకుండానే, నన్ను బాగా తిట్టారు. ఆ బాధతో ఆయన ఆఫీసు బయట కూర్చున్నాను. అంతలో...  దర్శకులు మురళీమోహనరావు, బి.గోపాల్ నాయుడిగారి ఆఫీసుకి వచ్చారు. నా ముఖంచూసి... ‘ఏంజరిగింది’ అని అడిగారు. విషయం చెప్పాను. ‘నువ్వేం బాధపడకు’ అని లోపలికి వెళ్లారు వాళ్లు. ఆయన తనగోడు వాళ్ల దగ్గర వెళ్లబోసుకుని ‘మీరొకసారి రషెస్ చూసి ఏవైనా మార్పులూ చేర్పులూ చేయండి’అన్నారట. వాళ్లు ప్రివ్యూ చూసొచ్చి... ‘సినిమా బ్రహ్మాండంగా ఉంది, కామెడీ అదిరిపోయింది’ అని చెప్పారు. దాంతో రామానాయుడు ఒకసారి ఆలోచించుకున్నారు. తనుకూడా రషెస్ చూశారు. ఆయనకు కూడా బాగా నచ్చింది. నా దగ్గరకు వచ్చి ‘నీకు ఫుల్ ఫ్రీడం ఇచ్చేస్తున్నానయ్యా, క్లైమాక్స్ నీ ఇష్టప్రకారమే తియ్యి’ అని పూర్తి స్వేచ్ఛ ఇచ్చేశారు.

*        *        *
జంధ్యాల కామెడీ సినిమాలే కాదు, ఆనందభైరవి సత్యాగ్రహం లాంటి విభిన్నమైన సినిమాలూ చేశారు. కానీ ఆయన మీద కామెడీ డైరెక్టర్ అనే ముద్ర పడిపోయింది. అలాగే రేలంగి నరసిహారావుగారికి కూడా. ఆ ముద్ర నా మీద పడకూడదనే సెంటిమెంట్, యాక్షన్, కామెడీ... ఇలా అన్నిరకాల సినిమాలూ తీస్తూ వచ్చాను. నా కుటుంబం నిలబడాలి, దర్శకుడిగా నాకంటూ ఒక పేరు తెచ్చుకోవాలనే కసితో పదిపదిహేనేళ్లపాటు కుటుంబాన్ని పట్టించుకోకుండా సినిమాలు తీశాను.
    రాజేష్ నరేష్ చేతికందిరావడంతో ఇదుగో గత ఐదేళ్లుగా రిలాక్స్ డ్;,గా ఉన్నాను. ఇంకో ఐదారేళ్లు ఇలాగే ఇంకొన్ని సినిమాలు తీసి ఆ పై విశ్రాంత జీవితం గడిపేస్తా.

================
...ఐదారేళ్లు సినిమాలు తీస్తానన్న ఈవీవీ కత్తి కాంతారావు సినిమా తర్వాత మరో సినిమా తీయకుండానే చనిపోయారు. May his soul rest in peace.