జయప్రకాష్ రెడ్డి ఇంటర్వ్యూ కోసం చాలా రోజుల నుంచి ప్రయత్నిస్తున్నా. ఎప్పుడు ఫోన్ చేసినా నాటకం రిహార్సల్స్ లోనో షూటింగ్ లోనో బిజీగా ఉండేవారు. పట్టువదలని విక్రమార్కుడిలా (స్వాతిముత్యంలో కమల్ హాసన్ లా :) అనాలేమో) ఫోన్ల మీద ఫోన్లు చేసి విసిగించి సాధించాను.
‘ చిత్రం భళారే విచిత్రం’ సినిమా చూసేటప్పుడు ఈయన్ని తొలిసారి గమనించాను. అందులో హీరోయిన్ మేనమామ క్యారెక్టర్. మాటిమాటికీ ‘గూచ్’ అని అరిచి హడలగొడుతుంటాడు. ఇంతకీ ఆ గూచ్ అనే పదానికి అర్థమేంటని అడిగితే... ‘పందుల్ని తోలేటప్పుడు అనే మాటట అది’ అని నవ్వేశారు జేపీ.
అలాగే, రెడీ సినిమాలో నాజర్ ఒక సందర్భంలో ‘మీరు మీ భార్యను ఏమని పిలుస్తారు’ అని అడిగితే....
‘ఇంగేమని పిలుస్తానూ... ‘సేయ్, మేయ్, ద్ద’ అంటాను’ అనే డైలాగ్ నాకు చచ్చేంత ఇష్టం. ఇంటర్వ్యూ మధ్యలో అడిగిమరీ చెప్పించుకున్నానా డైలాగ్. ధనుష్ హీరోగా ఈ సినిమాని తమిళంలో రీమేక్ చేస్తున్నారట. అందులోనూ ఈ క్యారెక్టర్ మళ్లీ ఆయనకే ఇచ్చారట. అరవ రీమేకులో ఈ డైలాగ్ ‘మేయ్, డేయ్...’ అని ఉంటుందంటూ తమిళ డైలాగు వినిపించారు. భలే తమాషాగా ఉంది.
ఆయన ఆఫీసుగదిలో బాపు గీసిన నవరసాల సెట్ బొమ్మలున్నాయి. వాటిని చూడగానే నాకో ఐడియా వచ్చింది. ఒకవైపు ఇంటర్వ్యూ చేస్తూనే ‘రౌద్రం... హాస్యం...’ అంటూ చాలా ఫొటోలు తీశాను(సాగర సంగమంలో ‘భంగిమా’ అన్నట్టు). అడిగిన ఫోజు అడిగినట్టు పెట్టారాయన కూడా సరదాగా. మొత్తానికి అరగంట టైమిస్తానన్న జేపీ రెండున్నర గంటలు మాట్లాడారు. ఏం మాట్లాడారంటే....
============
నటుడిగా నేనివాళ ఈ స్థాయిలో ఉన్నానంటే అందుకు కారణం మా నాన్న సాంబిరెడ్డిగారే. సాధారణంగా పిల్లలు నాటకాలూ వేషాలంటూ తిరిగితే తిట్టే రోజుల్లోనే... 'దున్నపోతుల్లాగా అడ్డగాడిదల్లాగా తిరగకపోతే ఏదైనా మంచి నాటకం రాసి రిహార్సల్స్ చేసుకోవచ్చుగా' అంటుండేవారాయన.
నాటకాలంటే అంతిష్టం మా నాన్నకి. తాను స్వయంగా నటుడు. పద్యాలు బ్రహ్మాండంగా పాడేవారు. యూనివర్సిటీ(ఆంధ్ర) స్థాయిలో ఉత్తమనటుడి అవార్డు కూడా అందుకున్నారు. సో... నా నటజీవితానికి ఆదర్శం మా నాన్నగారే. నటుడే కాదు... ఆయన ఆలిండియా చెడుగుడు ఛాంపియన్ కూడా. స్పోర్ట్స్ కోటాలో పోలీస్ ఉద్యోగం వచ్చిందాయనకి.
తొలివేషం...
స్కూల్లో చదువుకునేటప్పుడు... రుద్రమదేవి నాటకంలో అంబదేవుడు అనే సామంతరాజు పాత్ర వేశాను. అదే నేను తొలిసారి స్టేజీ ఎక్కడం. నా క్యారెక్టర్‌కి రెండు పద్యాలున్నాయి. పద్యనాటకాలంటే పద్యం చివర్లో పొడుగ్గా రాగాలు తీసేవారు. అలా రాగాలు తీయడాన్ని 'జిలేబి చుట్టలు' అనేవాళ్లం. ఎంతసేపు రాగాలు తీస్తే అంత గొప్ప. అవేవీ లేకుండా భావప్రధానంగా పద్యం పాడటం నేర్చుకున్నాను. వెుత్తానికి నాటకం వేశాక అందరూ బాగా పాడాడు అని మెచ్చుకున్నారు.
స్కూలు చదువయిపోయాక గుంటూరు ఆంధ్రా క్రిస్టియన్ కాలేజీలో చేరాను. కాలేజీలో కూడా నిక్కర్లు వేసుకుని తిరిగేవాళ్లం మేం. ఆ టైములో సీనియర్లు 'స్టేజీ రాచరికం' అనే నాటకం వేస్తూ నన్నూ ఒక క్యారెక్టర్ వేయమన్నారు. అందులో నాది చెలికత్తె వేషం. తమాషా ఏంటంటే... ఆ నాటకానికి నాకు 'ఉత్తమనటి' బహుమతి కూడా వచ్చింది. అలా నా జీవితంలో మొట్టమొదటిసారి ఆంధ్రా క్రిస్టియన్ కాలేజీ అసెంబ్లీహాల్లో నాటకపోటీల్లో పాల్గొన్నాను. ఆ తర్వాత ఆ కాలేజీలో చదివినన్నాళ్లూ సాంస్కృతిక కార్యకలాపాలకు అనధికారిక హెడ్‌లాగా చూసేవాళ్లు లెక్చరర్లు. దాంతో కాలేజీలో పెద్ద స్టార్‌ని అయిపోయాను. ఆరోజుల్లో సన్నగా పొడుగ్గా ఉండేవాణ్ని. రమణారెడ్డితో పోల్చేవాళ్లు నన్ను. నేను కూడా అందుకు తగ్గట్టుగానే కామెడీపాత్రలే ఎక్కువగా చేసేవాణ్ని. పీయూసీ, బీఎస్సీ తర్వాత బీఈడీ కూడా అక్కడే పూర్తిచేశాను. తర్వాత గుంటూరు మున్సిపల్ హైస్కూల్లో టీచర్‌గా ఉద్యోగం వచ్చింది. అక్కడ నేను లెక్కల టీచర్‌గా పనిచేశానుగానీ అందరూ నన్ను డ్రిల్లు మాస్టారు అనుకునేవాళ్లు. ఎందుకంటే అక్కడ సాంస్కృతిక కార్యకలాపాలన్నీ నా ఆధ్వర్యంలోనే జరిగేవి.
సినిమాల్లోకి...
నా దగ్గర చదువుకున్న వాళ్లల్లో ఒక విద్యార్థి 'ప్రజాపోరు' అనే పత్రికపెట్టాడు. నల్గొండలో పెద్ద సభ ఏర్పాటు చేసి దానికి దాసరినారాయణరావుగారిని ఆహ్వానించాడు. గురువుగా నన్ను కూడా పిలిచాడు. అక్కడ మేవెుక నాటకం వెయ్యాలనుకున్నాం. కానీ దాసరి చివరిదాకా ఉండరని తెలిసింది. దాంతో నేను మైకందుకుని... 'దాసరిగారు రంగస్థలం నుంచి వచ్చినవారే, కాబట్టి మేం నాటకం వేస్తే చూడకుండా వెళ్లిపోతానని ఆయన అనరనే అనుకుంటున్నాను' అని చిన్న మెలికపెట్టాను. వెంటనే నన్ను పిలిచారాయన. 'భలే ఫిట్టింగ్ పెట్టావయ్యా, నిజంగానే నాకు చాలా పనుంది, వెళ్లిపోదామనుకున్నాను. నువ్వంతమాట అన్నావు కాబట్టి వెుదటి పావుగంటా చూసి వెళ్లిపోతాను, ఏమనుకోకు' అన్నారు. సరేనన్నాను. 'గప్‌చిప్' అనే నాటిక వేశాం ఆరోజు. పావుగంట మాత్రమే ఉంటానన్న దాసరి నాటిక వెుదలయ్యాక చివరిదాకా చూశారు. అయిపోగానే స్టేజిమీదికొచ్చి 'నేను నిజంగానే వెళ్లిపోదామనుకున్నాను, జయప్రకాష్ చిన్న ఫిటింగ్ పెట్టి ఆపేశాడు. కానీ ఇవాళ నేను వెళ్లిపోయుంటే ఒక గొప్ప నాటికని మిస్సయిపోయేవాణ్ని. గొప్ప ఆర్టిస్ట్‌ని చూడలేకపోయేవాణ్ని. నిజంగా ఇక్కడొక రత్నం ఉంది, అది ఉండాల్సింది ఇక్కడ కాదు... మా ఇండస్ట్రీలో... నేనిప్పటికే చాలామంది కొత్తవాళ్లకు అవకాశాలిచ్చాను. జయప్రకాష్‌కి కూడా ఇస్తాను, ఇండస్ట్రీలో స్థిరపడిపోతాడు' అన్నారు. చాలా ఆనందం వేసింది.
ఆ రోజు కార్యక్రమం అయిపోగానే నేను మామూలుగా గుంటూరుకెళ్లిపోయాను. వారం తిరక్కుండానే రామానాయుడిగారి దగ్గర్నుంచి ఫోనొచ్చింది. వెంటనే హైదరాబాద్ వచ్చాను. 'ఏంటయ్యా, దాసరినారాయణరావు నీ గురించి తెగ చెబుతున్నారు, ఏదో నాటకం వేశావంట నాక్కూడా చూపించు' అన్నారు. వేస్తానండీ అని చెప్పి నా ట్రూపులో ఆర్టిస్టులందరితో కలిసి అన్నపూర్ణస్టూడియోలో నాటకం వేశాను. నాయుడిగారికి కూడా విపరీతంగా నచ్చింది. ఎంతగా అంటే... పరిశ్రమలో నా ఎదుగుదలకి ఆయనే కారణమయ్యేంతగా. వెంటనే నాకు 'బ్రహ్మపుత్రుడు' సినిమాలో ఒక పోలీసు వేషం ఇచ్చారు. తర్వాత 'బొబ్బిలిరాజా', 'ప్రేమఖైదీ' ఇలా వరసగా అవకాశాలిచ్చారు. నెమ్మదిగా చిన్నాచితకా అవకాశాలు వస్తూనేఉండేవిగానీ ఆర్థికంగా చాలా ఇబ్బందిగా ఉండేది. ఎప్పుడూ అప్పులే. ధర్మాత్ములు ఎవరోఒకరు ఐదువేలూ పదివేలూ ఇస్తూనే ఉండేవాళ్లు. 1992 దాకా అలా జరిగిపోయింది. చూసీచూసీ ఇక విసిగిపోయి పిల్లలు పెద్దవాళ్లయిపోతున్నారు. వాళ్లని పైకితీసుకురావాలంటే నేను ఆర్థికంగా బాగుండాలి. దానికి ఈ ఫీల్డు సరిపోదు అనుకొని మళ్లీ గుంటూరుకి వెళ్లిఉద్యోగంలో చేరిపోయాను. పొద్దున ఆరునుంచి తొమ్మిది దాకా ట్యూషన్లు, అప్పట్నుంచి సాయంత్రం అయిదింటిదాకా స్కూలు, మళ్లీ రాత్రి తొమ్మిదిన్నరదాకా ట్యూషన్లు. ఈ రొటీన్‌లో పడి సినిమా, మద్రాస్ అనే మాటలకు స్పెల్లింగ్ మర్చిపోయాను. సినిమాలంటే ఇష్టం లేక కాదు. పిల్లలను మంచి స్థితికి తీసుకురావాలంటే అక్కడ కుదరదు కాబట్టి.
పునఃప్రవేశం...
ఒకసారి నా స్నేహితుడొకడు హైదరాబాద్ అపోలోలో ఏవో టెస్టులు చేయించుకుంటాను తోడు రమ్మంటే హైదరాబాద్ వెళ్లాను. ఆసుపత్రిలో ఉండగా వెనక నుంచీ 'ఏయ్ జయప్రకాష్' అని పిలుపు వినిపించింది. ఎవరాని వెనక్కితిరిగి చూస్తే రామానాయుడుగారు. 'ఏమైపోయావయ్యా ఇన్నాళ్లూ... అంతులేకుండా పోయావ్' అన్నారు. 'పిల్లలు పెద్దవాళ్లవుతున్నారు కదా, వాళ్ల కోసం మళ్లీ గుంటూరు వెళ్లిపోయాను' అంటుండగానే... 'అవేం కాదులేగానీ, వెంకటేష్‌బాబుతో సినిమా మొదలుపెడుతున్నాం. అందులో ఒక క్యారెక్టర్ ఉంది. నువ్వుపోయి సురేష్‌బాబుని కలువ్, నేను ఫోన్ చేసి చెప్తాను... కలవకుండా వెళ్లమాకు' అన్నారు. ఇండస్ట్రీని కాదనుకుని నేను గుంటూరు వెళ్లిపోయాక కూడా నాకు అవకాశాలిస్తా రమ్మంటూ పిలిచింది ఆయనొక్కరే. 'తోడికోడళ్లు', 'తాజ్‌మహల్' ...ఇలా చాలా సినిమాల్లో చెయ్యమని అడిగారు కానీ నేనే ఏదో ఒక సాకు చెప్పి తప్పించుకున్నాను. ఈసారి తప్పలేదు. వెళ్లి సురేష్‌బాబుని కలిశాను. అది 'ప్రేమించుకుందాం రా' సినిమా.
హీరోయిన్ తండ్రి, ఫ్యాక్షనిస్టు పాత్ర నాది.
ఆ క్యారెక్టర్ కోసం అప్పటికి అమ్రిష్‌పురి, నానాపటేకర్ లాంటి హిందీ నటుల్ని కూడా అనుకున్నారు. ఎవరూ నచ్చట్లేదు సురేష్‌బాబుకి. కొత్తనటుడైతే బాగుంటాడని ఆయన ఉద్దేశం. నాయుడుగారేవో నన్ను తీసేసుకోమని చెప్పారు. 'ఇప్పటికి ఐదేళ్ల నుంచి నటించట్లేదయ్యా ఇతను, కొత్తగానే ఉంటాడు, మంచి ఆర్టిస్ట్ కదా పెట్టేసెయ్' అన్నారు సురేష్‌బాబుతో. సందేహంగానే నాకు మేకప్‌టెస్ట్ చేశారు. కొన్నాళ్ల తర్వాత ఆ క్యారెక్టర్‌కి నన్ను ఒకే చేశామని కబురొచ్చింది.
సరే వెళ్లాను, కథ చెప్పారు. అంతా విన్నాక సడన్‌గా నాకు ఒక ఐడియా వచ్చింది. నాకు కాలేజీ రోజుల్లో నంద్యాల, కోయిలకుంట్ల, గిద్దలూరు ప్రాంతాలకు చెందిన స్నేహితులుండేవారు. వాళ్లంతా రాయలసీమ భాష మాట్లాడుతుండేవారు. వినగావినగా నాకూ ఆ యాస పట్టుబడింది. ఎలాగూ ఫ్యాక్షనిస్టు పాత్రే కాబట్టి సీమయాసలో డైలాగ్స్ చెబుతానని పరుచూరి వెంకటేశ్వరరావుగారికీ, సురేష్‌బాబుకీ చెప్పాను. సరే అన్నారు.
ఆ యాస మీద పూర్తిపట్టు కోసం నంద్యాల, ఆళ్లగడ్డ ప్రాంతాల్లో పదిహేనురోజులపాటు తిరిగాను. ఒక టేప్‌రికార్డర్ పెట్టుకుని మారుమూల కుగ్రామాలకు వెళ్లి అక్కడివారితో మాట్లాడాను. రాత్రికి కూర్చుని రాయలసీమ పదాలకు సమానార్థకాలు రాసుకునేవాణ్ని. తర్వాత హైదరాబాద్‌కొచ్చి ఆ భాషలో మాట్లాడితే పరుచూరి వెంకటేశ్వరరావు 'అచ్చం, అక్కడివాళ్లలాగే మాట్లాడుతున్నావు కదయ్యా' అని ఆశ్చర్యపోయి 'బాగుంది, కంటిన్యూ అయిపోదాం' అన్నారు. అప్పుడొక షరతు పెట్టాను ఆయనకి. అదేంటంటే రేపటి సీన్ ఏంటో ముందురోజు సాయంత్రమే ఇమ్మనేవాణ్ని. వాళ్లు ఇస్తే దాన్ని రాయలసీమ భాషలోకి మార్చుకొని రిహార్సల్స్ చేసుకుని పొద్దుటికల్లా సిద్ధంగా ఉండేవాణ్ని. షూటింగ్ జరుగుతున్నప్పుడు యూనిట్ సభ్యుల స్పందన చూసి సినిమాతోపాటు ఆ పాత్ర కూడా పెద్ద హిట్టవుతుందని అర్థమైపోయింది అందరికీ.
ఆ సినిమా షూటింగ్ ముదిగుబ్బ ప్రాంతంలో చేశాం. కెమెరా ముందు నేను డైలాగులు చెబుతుంటే షూటింగ్ చూడ్డానికొచ్చిన స్థానికులు 'ఈయప్పది ఈణ్నేనే... యా వూరప్పా నీదీ' అని అడిగేవారు. అంతలా మమేకమైపోయానా పాత్రలో. అనుకున్నట్టే సూపర్‌హిట్ అయింది సినిమా.
1997లో ప్రేమించుకుందాం రా... 98లో శ్రీరాములయ్య... 99లో సమరసింహారెడ్డి... ఇలా వరసహిట్లు రావడంతో... 'ఇంక ఫర్వాలేదు, పరిశ్రమలో నిలదొక్కుకున్నట్టే అనుకుని స్వచ్ఛంద పదవీవిరమణ చేసి 2000 సంవత్సరంలో హైదరాబాద్‌కి వచ్చేశాను. 'సమరసింహారెడ్డి' చేశాక విపరీతమైన పేరొచ్చిందిగానీ మళ్లీ మూణ్నెల్ల దాకా సినిమాలు రాలేదు. 'ఇదేంట్రా' అనుకుంటున్నంతలో శ్రీనువైట్ల 'నీకోసం'లో ప్రధానపాత్ర ఆఫర్ చేశాడు. ఆ తర్వాత వెంటవెంటనే ఆఫర్లు రావడం వెుదలుపెట్టాయి. సీరియస్ క్యారెక్టర్లతో పాటు కామెడీ పాత్రల్లోకి కూడా షిఫ్టయిపోయాను. నిజానికి నాకు హాస్యం చేయడమే ఇష్టం. 'ప్రేమించుకుందాం రా' కన్నా ముందే 'జంబలకిడిపంబ'లో పిల్లకొజ్జా వేషం వేశాను. 'చిత్రం భళారే విచిత్రం' సినిమాలోనూ నాది కామెడీ విలన్ పాత్రే. 'గూచ్' అంటుంటాను మాటిమాటికీ. 'నీకోసం' సినిమాలో శ్రీనువైట్ల సీరియస్ విలన్ పాత్రే ఇచ్చినా ఆనందం, ఢీ, రెడీ... ఇలా తన తర్వాతి సినిమాలన్నింటిలోనూ నాకోసం కొత్తకొత్త పాత్రలు సృష్టించాడు. ఒక్క శ్రీను అనే కాదు... నేటి యువ దర్శకులందరూ రత్నాలే.
మనకున్న దర్శకుల్లో చాలా తెలివైన దర్శకుడు, మేధావి కృష్ణవంశీ. 'మహాత్మ' సినిమా వెుదటిరోజయితే... 'ఏమిట్రా, ఇలా విసిగిస్తున్నాడు' అనుకున్నాను. కానీ రోజులు గడిచేకొద్దీ తను ఆలోచించే తీరు చూసి ఆశ్చర్యం వేసేది. అతని పరిశీలనాశక్తిని చూశాక 'ఇన్నేళ్ల అనుభవం ఉండి నాకెందుకీ ఆలోచన రాలేదు' అనిపించేది. వృత్తిపరంగా ఇటీవలికాలంలో నాకు అత్యంత సంతృప్తినిచ్చిన పాత్ర 'మహాత్మ'లో చేసిన క్యారెక్టరే.
కుటుంబం విషయానికొస్తే... మాకు ఇద్దరు పిల్లలు. అబ్బాయి గుంటూరులో స్థిరపడ్డాడు. అమ్మాయి విజయవాడలో ఉంటుంది. ఎప్పుడైనా ఖాళీ దొరికితే వెళ్లి, ఒకపూట అక్కడా మరొకపూట ఇక్కడా ఉండి వస్తుంటాం. అక్కడికెళ్లినప్పుడు మనవలతో కాలక్షేపం. వాళ్లు 'తాతా' అనిపిలుస్తుంటే అదో ఆనందం.
అసలుకన్నా వడ్డీ ముద్దంటారు కదా!
ఇలా ఎన్నెన్నో ఒడుదొడుకులూ ఇంకెన్నో మజిలీలూ మరెన్నో మైలురాళ్లతో ఈశ్వరుడి దయవల్ల నా జీవితం ఇలా సంతృప్తికరంగా సాగిపోతోంది.
శివయ్య దయ
శివుడు మా కులదైవం. శ్రీశైల మల్లన్న సన్నిధిలో ఎంతసేపున్నా నాకు తనివితీరదు. నేనివాళ ఈ స్థాయిలో ఉన్నానంటే దానికి కారణం ఆ శివయ్యే. ఏటా నేను శివదీక్ష తీసుకుని మహాశివరాత్రినాటికి శ్రీశైలం వెళ్లొస్తుంటాను. అక్కడ నాపేరు మీద ఒక కాటేజీ కూడా ఉంది. ఈక్షణంలో నాకు సినిమా అవకాశాలేవీ లేకపోయినా దిగుల్లేదు. మా ఆవిడతో సహా అక్కడికి వెళ్లిపోయి నాకొచ్చే ఫించన్‌తో ఆ శివయ్య సన్నిధిలో ప్రశాంత జీవితం గడిపేస్తాను.
నాటకాలంటే ఇష్టం
మనదగ్గర ఆదరణ తగ్గింది కానీ... కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో నాటకం ఇంకా బతికే ఉంది. అక్కడ డబ్బులు పెట్టి నాటకాలు చూస్తుంటారు. సినిమాలో రిహార్సల్స్, రీటేకులు ఉంటాయి. నాటకంలో అవేవీ ఉండవు. ప్రేక్షకుల స్పందన అక్కడికక్కడే తెలిసిపోతుంది. అందుకే నాకు అందులోనే ఎక్కువ తృప్తి లభిస్తుంది. ఈమధ్య రవీంద్రభారతిలో ఏకపాత్ర నాటకం వేశాను. అందులో నాది మొండివాడైన మేజర్ పాత్ర. చివర్లో ఆ క్యారెక్టర్‌కి గుండెపోటు వస్తుంది. నేను నొప్పితో విలవిల్లాడిపోయినట్టు నటిస్తున్నాను. ప్రేక్షకుల్లో ఒకావిడ... 'అయ్యో, అయ్యో ఏవండీ, ఏదైనా టాబ్లెట్ వేసుకోమని చెప్పండి' అని ఏడుస్తూ అరిచేసింది. ‘వాడు వేసుకోడే, మొండి లం...కొడుకు, వాడెందుకు వేసుకుంటాడు’ అని ఏడ్చేశాడు పక్కనే ఉన్న ఆవిడ భర్త. ఒక నటుడిగా ఇంతకంటే తృప్తి ఇంకేం కావాలి చెప్పండి?