Sunday, December 26, 2010

నల్లచీరలో నా అప్సరస

టైటిల్ చూసి ఎఖ్కువ ఊహించుకోవద్దు.
ఇది నా ఎంగేజ్మెంట్  కథ.
మొన్నే ఓ మిత్రుడు ఫోన్ చేసి ‘ఫలానాఫలానా డిసెంబరు ముప్ఫయ్యో తారీఖు(రేపంటే రేపు కాదు, నాల్రోజుల తర్వాత) నా నిశ్చితార్థం రావోయ్’ అని ఇన్విటేషించాడు. 
‘నా ఎంగేజ్ మెంటుకే నేను లేను నీ నిశ్చితార్థానికేమొస్తాను పోవోయ్ పుల్లాయ్’ అని చెప్పేశాను. 
‘అదేంటి? నీ ఎంగేజ్ మెంటుకే నువ్వులేవా... ఏ, ఏ, ఏ, ఏ,ఏ’ అని గీతాంజలిలో నాగార్జునలా తెగబోలెడు ఆశ్చర్యపోయాడు గురుడు. 
కూస్తంత రీలు వెనక్కి తిప్పా...
అది, డిసెంబరు 24, 2005
ఈనాడు జర్నలిజం స్కూల్ ట్రైనింగులో భాగంగా అప్పుడు నేను కుప్పం(అవును మన చంద్రబాబునాయుడి ఇలాకానే)లో ఉన్నాను. అప్పటికి పదిహేను రోజులుగా అక్కడే మకాం. ఇరవయ్యైదో తారీకు(క్రిస్మస్ రోజు) నిశ్చితార్థం ఫిక్సింగ్ చేశారు. అది మా విజయవాడలో. 
             షెడ్యూలు ప్రకారం 26 పొద్దునకల్లా హైదరాబాదుకొచ్చి జర్నలిజం స్కూల్లో రిపోర్టు చెయ్యాలి. మామూలుగా అయితే 24 మద్యాహ్నం బయల్దేరి తెల్లారికల్లా బెజవాడ చేరుకుని నిశ్చితార్థం పని చూసుకుని ఎంచక్కా ఆరోజు రాత్రి బస్సెక్కి బజ్జుంటే తెల్లారి మెలకువొచ్చేసరికి ఐద్రాబాద్లో ఉండొచ్చు. కానీ... కానీ... అనుకున్నామని జరగవుకదా కొన్ని :(
                  మధ్దెలో ఇంకో ఫ్రెండొకడు తగిలి ‘నీకెందుకు నువ్వు తిరపతికొచ్చెయ్, కొండమీద దేవుడి దర్శన చేయించి రాత్రికి ఇజీవాడ బస్సెక్కించే పూచీ నాది’ అన్నాడు. 
                సరేన్జెప్పి కుప్పం టు తిరుపతి వయా చిత్తూరు రాత్రి ఆరూ-ఆరున్నరకంతా తిరపతి జేరుకున్నా.  తిరప్తి కొండమీద మనోడు, కింద నేను. బస్సు దిగ్గానే ఫోన్ చేస్తే మనోడి ఫోన్ స్విచ్చాఫ్. అక్కడే ఎడంకన్ను కొద్దిగా అదిరినట్టనిపించింది. చెయ్యంగా చెయ్యంగా ఏడుంపావుకి ఫోన్లో దొరికాడు. రష్చించావురా తండ్రీ ఎంగటేశ్పరా అనుకుని ‘ఏంవాయ్ ఎక్కడున్నావ్’ అంటే ‘కొండమీదే ఉన్నా అన్నా నువ్వు పైకొచ్చెయ్’ అన్నాడు. సర్లేగదాని వెళ్లాను. తీరా వెళ్లాక నా కర్మం కాలిపోయి ఆడెవుడో కర్ణాటక మంత్రొకడు కొండమీదికొచ్చి కూర్చున్నాడంట. అయ్యగారి కోసం అన్ని దర్శనాలూ రద్దు చేశారు. ఇంక టైమే దొరకనట్టు అవాళే రావాలా ఆయన కూడా! 
                  మావోడు విశ్వప్రయత్నం చేసి చివరికి ‘ఈపూటకి దర్శనం కుదర్దు’ అని తేల్చేశాడు.
             కిందికొచ్చేద్దామంటే కొండమీంచి ఆఖరి బస్సు కిందికి వెళ్లిపోయిందని చెప్పారు. ఇంక చేసేదేం లేక మూతి మూరడు పొడుగు సాగదీసుకుని కూర్చున్నా, మొత్తానికి మావాడు మాత్రం నానాతంటాలూ పడి తెల్లారి సెల్లార్ దర్శనానికి టిక్కెట్లు పట్టాడు. 
            కట్ చేస్తే...
          డిసెంబర్ 25, 2005 అంటే  నా ఎంగేజ్ మెంట్ డే... నేనిక్కడ తిరపతిలో, తను అక్కడ విజయవాడలో. వా....! దర్శనం చేసుకుని కొండ మీంచి కిందికి దిగేసరికి గంట తొమ్మిది కొట్టింది. తిరప్తి బస్టాండులో విజయవాడకి ఒక్క బస్సు కూడా లేదనన్జెప్పనన్జెప్పేసి చెప్పారు. రైళ్ల కోసరం ఎంక్వైరీ చేస్తే మధ్యాహ్నం దాకా అవీ లేవన్నారు. ఇంక చూడరా భగవంతుడా, ఏంచెయ్యాలో అర్థంగాలా. 

            కుంకుమ ఒలికిపోయిన రాగం... తీగలు తెగిపోయిన రాగం... గాజులు పగిలిపోయిన రాగం... అన్నీ కట్టగట్టుకుని వినిపిస్తున్నాయి బ్యాగ్రౌండులో!(అదికాకపోతే ఇంకో బస్సెక్కొచ్చు కదా అంటారా... అసలే ఆత్రం పెళ్లికొడుకుని అంత తెలివైన ఆలోచనలెందుకొస్తాయి సామీ)
                    ఈశ్వరా నేనేమిజేతురా అని బస్టాండ్లో తిరుగుతుంటే ఒంగోలు బస్సు కనపడింది. ఎగ్గిరి గంతేశా(పక్కనున్నోడు కూస్తంత అనుమానంగా చూశాడు). అక్కణ్నుంచి విజయవాడకి గడీకి పన్నెండు బస్సులుంటాయి. ఇంకేముంది, ‘ఎగిరి దూకరా ఎంకటసామీ’ అనుకుంటా బస్సెక్కా. 
                          డ్రైవరు టిఫినుకి పొయ్యాడంటా, ఎంతకీ బస్సు కదల్దే! మొత్తానికి పావుగంట తర్వాత డ్రైవరు కిళ్లీ బిగించి తాపీగా వచ్చి బస్సెక్కాడు. బస్సెంత స్పీడుగా వెళ్తున్నా నాకైతే ఎద్దులబండి మాదిరిగానే ఉంది. సరిగ్గా రెండు గంటల తర్వాత ఏదో ఊళ్లో బస్సాపాడు. 
               ఊరి పేరు గుర్తు లేదు. ఆ ఊళ్లో ఎంతసేపాగుతుంది అనడిగితే పదినిమిషాలన్నాడు. పక్కనచూస్తే ఒంగోలుకెళ్లే బస్సొకటి బయలుదేరబోతోంది. ప్లాట్ఫారం దగ్గర్నుంచి వెనక్కి తీస్తున్నాడు. బ్యాగ్ తీసుకుని ఈ బస్సులోంచి ఆ బస్సులోకి ఒక్క లాంగ్ జంపు. 
           కట్ చేస్తే... (కంగారు పడకండి, ఇదే లాస్టుసారి కట్ చెయ్యడం)
          మళ్లీ ఇంకోఊళ్లో ఆగిందీ బస్సు. అది దిగేసి వేరే బస్సెక్కా. ఈ మాదిర్తో తిరపతి నుంచి ఒంగోలు వెళ్లేలోపు ఐదారు బస్సులు మారాను. ఒంగోలు చేరాక మనసు కుదుటపడ్డది. టైం రెండో పావుతక్కువ మూడుంపావో అయ్యింది. అక్కణ్నుంచి విజయవాడకి కుక్కని తంతే బస్సు రాల్తుంది కాబట్టి నిమ్మళం. 
           ఏమాటకామాటే... వాజ్పేయీ పుణ్యమా అని స్వర్ణచతుర్భుజి రోడ్లమీద రయ్యిరయ్యిన దూసుకొచ్చాయి బస్సులు. అంచేత అంతదూరం జర్నీ చేసినా ఒంటికి పెద్దగా అలుపు తెలీలా.
            మొత్తానికి ఒంగోల్లో బస్సెక్కి(బస్సా అది... ఎద్దుల బండి కన్నా కనా కష్టం) ఆరింటికి విజయవాడ కనకదుర్గమ్మ వారధి దగ్గర బస్సు దిగి ఆటో కట్టించుకుని అర్జెంటుగా (కాబోయే)అత్తారింటికి చేరుకున్నా. అప్పటికి టైము పావుతక్కువ ఆరున్నర. ముహుర్తం దాటిపోతోందని నేను లేకుండానే తాంబూలాలు మార్చేసుకున్నారు. అంతా అయిపోయాక ‘ఊరికి మొనగాడు’ సినిమాలో కిష్టిగాడిలా ఓ బ్యాగు బుజానేసుకుని జిడ్డుమొహంతో ఆటో దిగాను. 
              మెట్లెక్కి పైకెళ్లేసరికి నాకిష్టమైన నల్లచీర కట్టుకుని బాపుగారి అభిసారికలా ఎదురుచూస్తోంది నా అప్సరస(అదేంటో అప్పట్లో అలానే కనిపించేది. పాపం నేను).
             కిక్కు సినిమాలో బ్రహ్మానందంచుట్టూ చేరి వయొలిన్లు వాయిస్తారు చూడండీ... అదీ మన పొజిషను. 
             తను మాత్రం కొంచెం కోపం, కొంచెం సంతోషం, కొంచెం ఉప్పు, కొంచెం నిప్పు, కొంచెం గరళం, కొంచెం అమృతం... కలిపి కొట్టరా కావేటి రంగా అన్నట్టు అన్ని ఎక్స్ ప్రెషన్లూ ఒక్క లుక్కులో చూపించింది.  
            బెటర్ లేట్ దాన్ నెవ్వర్ కాబట్టి సర్దుకుపోయి స్మైలిచ్చింది. ఇద్దరం ప్రైవేటుగా కాసేపు కబుర్లు చెప్పుకొన్నాం. ఇంతలో భోజనాలకు రమ్మన్నారు. తినేసరికి తొమ్మిదిన్నర. పదింటికి హైదరాబాద్ బస్సు.
             టాటా వీడుకోలూ అంటూ భారగుండెతో బైబై చెప్పి బస్సెక్కాను.
             అదండీ సంగతి!         
              ఇతి శ్రీ బాలు నిశ్చితార్థ పురాణం సమాప్త:

తాజాకలం :  మా బుడ్డిదాని పుట్టినరోజు ఫంక్షన్ కోసమని నిన్ననే మా అత్తగారొచ్చారు.  ఇవ్వాళే(అంటే నిన్నే) మా ఎంగేజ్ మెంట్ డే అని చెప్తే ‘అవును కదా,’ అని ఆశ్చర్యం వ్యక్తం చేశారు.  అది పెద్ద మ్యాటర్ కాదుగానీ... ఆవిడ వస్తూవస్తూ మినప సున్నుండలు తెచ్చారు. ఆ కథాకమామిషూ ఇంకో పోస్టులో.

10 comments:

  1. హ హ బాగుంది మీ అడ్వెంచర్ :-)

    ReplyDelete
  2. This comment has been removed by the author.

    ReplyDelete
  3. hmmmm.. అంటే అప్పట్లో నల్లచీరలో అప్సరసలా కనపడింది .మరి ఇప్పుడెలా కనిపిస్తుందో.. మీ ఆవిడకు ఈ డవిలాగు చేర్చేదా?? అంతే మరి కొత్తొకవింత పాతొక...

    ReplyDelete
  4. @ వేణూశ్రీకాంత్... అంత అడ్వెంచర్ చేసీ నేను ఆదా చేసిన టైము అరగంటో ముప్పావుగంటో అంతే! కడుపుకి తిండి లేదు(మా ఆవిడ ముందు ఇలాగే బిల్డప్పిచ్చా. నిజానికి చిప్సులూ బిస్కత్తులూ అన్నంకన్నా ఎక్కువగానే తినేశాననుకోండీ. ఈ రగస్యం మూడోకంటోడికి తెలీకూడదు మరి). ఖుదాహఫీజ్
    @ ప్రవీణ... thank you
    @ 3g... మీకలా నవ్వులాటగానే ఉంటుంది సార్, అప్పటి నా ఆందోళనా మరియూ ఆత్రమూ మీకెలా చెప్తే అర్థమవుతుందీ అంట!
    @ దుర్గేశ్వర... థాంకులు
    @ జ్యోతిగారూ... ఇప్పుడు అప్పరసన్నర(ఇది మీకు అప్పలనరసమ్మ లాగా ధ్వనిస్తే నా తప్పు కాదోచ్) లాగా కనపడుతోంది. అయినా ఇది రాస్తున్నప్పుడు నా పక్కనే కూర్చుని గాఠిగా ఒకటికి రెండుసార్లు ట్యూషన్ చెప్పేసింది(రేడియో సౌండు పెంచి మరీ). మీకేం తెలుసండీ నా బాధలూ :(

    ReplyDelete
  5. దీన్నిబట్టి నే చెప్పొచ్చేదేటంటే అద్దెచ్చా....తిరుపతెంకటేశుడి దగ్గర్కి రికమండేసన్సుతో ఎల్లకూడదని..:)...ఎలాగైతేనేంలెండి,చివరకి చేరుకున్నారు....అలా అయ్యుండకపోతే,మీకు మీ శ్రీమతిగారు అప్సరసలా అనిపించకపోయుండేవారేమో!(ఆత్రపు పెళ్ళికొడుకుగ్గా మారారు కదా,ఈ హడావుడి ప్రయాణం మూలాన)...మాతో పంచుకోను మీ నిశ్చితార్థం ఇంతోటి మధురానుభూతి కాకపోయుండేను...:)

    ReplyDelete
  6. హ హ హ బావుంది మీ ప్రయాణం యవ్వారం :).....అలా చెప్తూ చెప్తూ మినపసున్నుండల దగ్గర ఆపేస్తే ఎలా? అంత ప్రశస్త్యమైనవాటిదగ్గర ఆపేస్తే మా గుండెలు అల్లాడిపోవూ?

    ReplyDelete