అందరూ అద్భుతంగా ఉందంటున్నారుగానీ... ఏమో, నాకైతే ‘వేదం’ సినిమా నచ్చలేదు. అల్లు అర్జున్, అనుష్క, మంచు మనోజ్ లాంటి మాంచి క్రేజ్ ఉన్న తారలను సైతం కథకి మాత్రమే కట్టుబడేలా చేసిన క్రిష్ ప్రయత్నం చెప్పుకోదగ్గదే, కానీ సినిమా మాత్రం అందరూ అంటున్నంత గొప్పగా మాత్రం లేదు.
ఈపాటికే కథ అందరికీ తెలిసిపోయి ఉంటుంది. మొత్తం ఐదు క్యారెక్టర్లు. వాటి ప్రాధాన్యతను బట్టి రివర్స్ ఆర్డర్లో చెప్పుకుంటే....
అనుష్కకథకి ఏ మాత్రం సంబంధం లేని క్యారెక్టర్ అనుష్క(అమలాపురం సరోజ)ది. ఆ క్యారెక్టర్ ద్వారా దర్శకుడు ఏం చెప్పదలుచుకున్నాడో అర్థం కాలేదు. అదొక పాసివ్(passive) క్యారెక్టర్. సినిమా మొదట్నుంచీ చివరిదాకా ఇతర పాత్రల యాక్షన్ కి రియాక్షన్ గా మాత్రమే సాగుతుంది. అమలాపురం సరోజగా పరిచయమైన పాత్ర హైదరాబాద్ లోని ఒక బ్రోకర్ ఫోన్ చేయగానే అప్పటిదాకా ఉంటున్న వేశ్యగృహం నుంచి పారిపోయి హైదరాబాదుకి చేరుతుంది. ఆమెకి తోడుగా ఒక హిజ్డా. రాజధాని నగరంలో వాళ్లిద్దరూ పడే కష్టాలు మిగతా ట్రాక్. క్లైమాక్స్ లో అల్లు అర్జున్ టెర్రరిస్టుల బారి నుంచి అనుష్కను కాపాడతాడు. అలా కాపాడటానికి అనుష్కే అక్కర్లేదు. హాస్పటల్లో ఉన్న ఏ పేషెంట్ అయినా చాలు. కాబట్టి ఈ పాత్ర కథకి పూర్తిగా...పూర్తిగా....పూర్తిగా... అనవసరం.
మంచు మనోజ్తన స్వార్థం తాను చూసుకునే, బాధ్యతారహితమైన(మోస్ట్ ఇర్రెస్పాన్సిబుల్) కుర్రాడు. రాక్ స్టార్ అవాలన్నది ఇతగాడి ఆశయం. జీవితంలో తొలిసారి లైవ్ షో ఇచ్చే అవకాశం వస్తే బెంగుళూరు నుంచి హైదరాబాదుకి బయల్దేరతాడు. కానీ కేవలం ఇతగాడి నిర్లక్ష్యం(ఆలశ్యం) వల్ల ఫ్లైట్ తప్పిపోతుంది. అయినా పెద్దగా బాధపడక కార్లో వెళ్లిపోదామంటాడు స్నేహితులతో. అంతదూరం ప్రయాణించాక మరి పెర్ఫార్మెన్స్ ఎలా ఇద్దామనుకుంటాడో అతడికే(దర్శకుడికే) తెలియాలి. దార్లో రెండు ప్రహసనాలు. అస్సలు ఆసక్తి కలిగించని ఎపిసోడ్ అది.
ఇతగాడి తాత, తండ్రి దేశం కోసం ప్రాణాలర్పించిన వీర సైనికులు. ‘జీవితంలో అసలు ఏమవ్వాలనుకుంటున్నావురా నువ్వు’ అని తల్లి అడిగితే... ‘దేశం మొత్తం నీ కొడుకు గురించి చెప్పుకునే రోజు వస్తుందమ్మా’ (అచ్చం ఇవే మాటలు కాదుగానీ, భావం ఇదే) అని చెప్పినప్పుడే చివరికి ఈక్యారెక్టర్ గతి ఏమవబోతోందో చూచాయగా అర్థమైపోతుంది. అనుకున్నట్టుగానే చివరికి టెర్రరిస్టుల బారి నుంచి ఆస్పత్రిలో రోగులను రక్షించే క్రమంలో చచ్చిపోతాడు.
ఇలా అర్థం లేకుండా చచ్చిపోవడానికి మంచు మనోజే అక్కర్లేదు. ఏట్లో గన్నయ్య ఎవడైనా ఒకటే. కాబట్టి ఈ పాత్రా సినిమాకి అనవసరమే. ఈపాత్రకి మంచుమనోజ్ అంతకన్నా అనవసరం.
నాగయ్యఈ పాత్ర పేరు రాములు. చేనేత కార్మికుడు. అప్పులు తీర్చలేదన్న కోపంతో ఇతడి మనవడిని బలవంతంగా తీసుకెళ్లి పనిలో పెట్టుకుంటాడొక దొర. 50వేలు కట్టి విడిపించుకోమంటాడు. కోడలు కిడ్నీ అమ్మి డబ్బు తీసుకురావడానికి ఆమెతో కలిసి హైదరాబాదుకు పయనమవుతాడు. ఈ పాత్ర ద్వారా అవయవాల వ్యాపారం ఎంత దారుణంగా జరుగుతోందో, అమాయకులు ఎలా మోసపోతున్నారో బాగానే చూపగలిగారు. నటన అనుభవం లేని నాగయ్య ను తీసుకోవడం వల్ల పాత్ర చాలా సహజంగా అనిపించింది. చివర్లో... కోడలు కిడ్నీ అమ్మి సంపాదించిన డబ్బును ఎవడో ఎత్తుకుపోతుంటే అతడి కాళ్లు పట్టుకుని ఏడ్చే సీను హృదయవిదారకంగా ఉంటుంది.
అల్లు అర్జున్కేబుల్ రాజుగా అందరూ పిలుచుకునే ఆనందరాజు అనబడే ఒకానొక బస్తీ కుర్రాడి పాత్ర ఇది. డబ్బున్న అమ్మాయికి వలవేసి పట్టాలనే తాపత్రయంతో నానా భ్రష్టుత్వం పడతాడు. ఆ అమ్మాయిని పార్టీకి తీసుకెళ్లడానికి 40వేలు అవసరమవుతాయి. చెయిన్ స్నాచింగ్ చెయ్యబోయి పోలీసులకి దొరికిపోతాడు. అయినా మారడు. రాములు పాత్ర దగ్గర నలభైవేలు కొట్టేసినా... సంఘర్షణకు గురై మంచివాడుగా మారి ఆ డబ్బును ఆ ముసలాడికి ఇచ్చేస్తాడు. అల్లు అర్జున్ ఈ సంఘర్షణను బాగానే చూపగలిగాడు.
మనోజ్ బాజ్ పాయిహైదరాబాదులో ఉంటూ గణేష్ ఉత్సవాల సమయంలో కొందరు హిందువులు తనకు చేసిన అమానుషం కారణంగా షార్జాకు వెళ్లిపోదామనుకునే ముస్లిం క్యారెక్టర్. పత్రికల్లో చూస్తున్న చాలా అంశాలను బట్టి మనది మైనారిటీ పక్షపాత ప్రభుత్వం, ముస్లింల గురించి మాట్లాడే ధైర్యం ఎవ్వరికీ లేదు అని ఇన్నాళ్లూ అనుకుంటూ వచ్చానే కానీ, హైదరాబాదులో ముస్లింలు ఇంత అవమానాల పాలవుతున్నారనీ కష్టాలు పడుతున్నారనీ తెలీని అగ్నానంతో ‘ఇదేంటీ ఇలా చూపిస్తున్నాడు డైరెక్టరు’ అని ఆశ్చర్యం వేసింది. కానీ... తర్వాత మరొక జర్నలస్టు మిత్రుడ చెప్పిన దాని ప్రకారం ఇలా బాధలు పడుతున్న వాళ్లు కూడా ఉన్నారని తెలసి చాలా బాధవేసింది. నా సొంత అభిప్రాయాల సంగతి పక్కన పెడితే...
పేరు రహీముద్దీన్ ఖురేషీ. హిందూ ఛాందసవాదులు, ముస్లింలను అనుమానంగా చూసే పోలీస్ అధికారి... లాంటి వాళ్లను ఎదర్కోవాల్సి వచ్చినప్పడు పాసివ్ గా ఉండకుండా తిరగబడే యాక్టివ్ క్యారెక్టర్. చివర్లో టెర్రరిస్టులు ఇతడికి పారిపోయే అవకాశం ఇచ్చినా ప్రాణాలకు తెగించి హాస్పిటల్ లోనే ఉండి తోటి మనుషులను రక్షించాలనుకునే మనసున్న పాత్ర.
సినిమాకి నిజమైన హీరో ఈ క్యారెక్టరే.
....మొత్తంగా చూస్తే ‘గమ్యం’తో పోలిస్తే అంతగా అనిపించదు. ఎందుకో గాలి శీనుతో పోలిస్తే కేబుల్ రాజు తేలిపోయాడనిపించింది. గాలిశీను చచ్చిపోతే బాగా పరిచయమున్న దగ్గరివ్యక్తి చనిపోయినంత బాధ వేసింది. ‘అరె, వీణ్ని చంపకుండా ఉంటే ఎంత బాగుండేది’ అనుకోని వాళ్లు ఉన్నారనుకోను. అంతగా టచ్ చేసే క్యారెక్టర్ లేకపోవడం ఈ సినిమాకి ప్రధాన లోపం. మనసును కదిలించే నాలుగైదు సీన్లు మినహా మిగతాసినిమా అంతా నీరసంగా, బోరుగా సాగినట్టు అనిపించింది.
అసలు ఆ సినిమాకీ ఈసినిమాకీ పోలిక పెట్టడం ఎందుకంటారా.... గమ్యం అనే సినిమా లేకపోతే ‘వేదం’కి ఇంత హైప్ ఎక్కణ్నించి వచ్చేదండీ బాబూ
ఆసినిమాతో పోల్చకపోయినా సరే...
ఏమోనబ్బా......... వేదం సినిమా నాకైతే నచ్చలేదు.