Sunday, January 23, 2011

గాజులమ్మేసి రైలెక్కా

ఈవీవీ సత్యనారాయణ... బూతుకామెడీకి పెట్టింది పేరు. ద్వంద్వార్థ సంభాషణలకు కేరాఫ్ అడ్రస్...
ఇదీ మీ సినిమాలపైనా మీమీదా చాలామందికి ఉన్న అభిప్రాయం. దీనికి మీరేమంటారు?

చిన్నప్పుడు మేం ఏ సినిమా చూసినా హాల్లోంచి బయటికొచ్చేటప్పుడు ‘...గాడు ఏం చేశాడ్రా, లం... కొడుకు’అనే కామెంట్లు వినిపించేవి. ఆ సందర్భంలో అది తిట్టు కాదు. ఒక హీరోమీద లేదా నటుడిమీద సాధారణ ప్రేక్షకుడు తన అభిమానాన్ని ఆ ఒక్క మాటలో చెప్పే విధానం.  బాగా పాలిష్డ్;,,గా మాట్లాడేవాళ్ల సంగతి నాకు మద్రాసుకొచ్చేదాకా తెలీదు. మనసులో ఏమున్నా అలా బయటికి మాట్లాడే మనుషుల్ని చూస్తూ పెరిగాను. అందుకే నా సినిమాల్లో పాత్రలు అలాగే మాట్లాడతాయి, ప్రవర్తిస్తాయి. నా టార్గెట్ కూడా ఆ ప్రేక్షకులే.
...అని కచ్చితంగా చెప్పారాయన. కనీసం ఆయనకు ఆ క్లారిటీ ఉన్నందుకైనా ఫరవాలేదనిపించింది నాకు.  2009లో ఈవీవీని ఇంటర్వ్యూ చేయడానికి వెళ్లినప్పుడు మా మధ్య జరిగిన సంభాషణ ఇది. ఈవీవీ సినిమాలు అలా ఉంటాయని తెలిసీ వెళ్లి, చూసి ఎంజాయ్ చేసిన సవాలక్ష మందిలో నేనూ ఒకణ్ని. ఆయన శ్రుతి మరీ మించినప్పుడు(ఉదాహరణకు ‘అల్లుడా మజాకా’. ఇంకా ఇలాంటివి చాలానే ఉన్నాయి) తిట్టుకున్న సవాలక్ష మందిలోనూ నేనొకణ్ని.  ఈ ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు అవకాశాన్ని వదులుకోకుండా... ‘అల్లుడా మజాకా’లో అత్తగారిని పట్టుకునే సీన్ గురించి కూడా అడిగాను. ఆయన ఏదో సమర్థించుకున్నాడుగానీ... ఆయన ఇంటెన్షన్ మాత్రం సూటిగా జనాలకు చేరిందన్నది వాస్తవం.
    సరే, ఇవాళేదో ఈవీవీ చనిపోయాడని ఆయన్ని బి.ఎన్.రెడ్డి సరసనో కె.వి.రెడ్డి సరసనో కూర్చోబెట్టంగానీ... కచ్చితంగా తెలుగు సినిమా చరిత్రలో ఆయనదంటూ ఒక ప్రత్యేక పేజీ ఉంది.
అది ఈవీవీ స్కూల్. 
    ఇక్కడితో నా సోది ఆపేస్తాను. ఇక ఆ ఇంటర్వ్యూ విశేషాలు చదవండి.

=====================
తేదీ గుర్తులేదుకానీ... చెన్నైలో నేను అడుగు పెటి్టన మొదటి రోజది. సెంట్రల్ స్టేషన్లో దిగాను. జోరున వర్షం కురుస్తోంది. నేను వెళ్లాల్సింది టి నగర్. ఎక్కడో తెలీదు. ఎలా వెళ్లాలో తెలీదు. పోనీ, ఎవరినైనా అడుగుదామా అంటే భాష రాదు. అలాగే నానా తిప్పలూ పడుతూ లేస్తూ నడుచుకుంటూనే టి నగర్ చేరుకున్నాను. పొద్దున ఆరింటికి స్టేషన్ దగ్గర బయల్దేరితే అక్కడికి చేరేసరికి పదకొండంయింది. అది... నవతా కృష్ణం రాజుగారి ఆఫీసు.
*        *        *
వానలో తడిసి నీళ్లోడుతున్న బట్టలతోనే ఆయన్ను కలిసి ‘నా పేరు సత్యమండీ, కోరుమామిడి నుంచొచ్చాను. మీ మేనల్లుడు సుబ్బరాజు స్నేహితుణ్నండీ’ అని పరిచయం చేసుకుంటూనే మా సుబ్బరాజు రాసిన ఉత్తరం ఆయన చేతికిచ్చాను.
    ఏం మాట్లాడకుండా నేనిచ్చిన ఉత్తరం తీసుకుని చదివి... అప్పుడడిగారాయన. ‘ఏమైనా తిన్నావా’ అని. తిన్లేదంటే ఇడ్లీలు తెప్పించి పెట్టారు. అవి తినేదాకా ఆగి... ‘ఏంచేస్తావు’ అన్నారు.
‘ఏమైనా చేస్తానండీ’ అన్నాను.
‘మీరేదో అనుకుని వచ్చేస్తారుగానీ... ఇక్కడేం ఉండదమ్మా, మీ ఊరెళ్లిపో’ అన్నారాయన.
నా నెత్తిన పిడుగుపడ్డట్టయింది.
వ్యవసాయంలో అప్పులపాలై బతకి చెడ్డ కుటుంబం మాది, ఇంటికి పెద్ద కొడుకుని. పోషించాల్సిన బాధ్యత నాదే. అన్నిటికీ మించి... మా ఆవిడ గాజులమ్మేసి మరీ చెన్నపట్నం వచ్చాను. అవన్నీ ఆలోచించుకుంటూ అక్కడే నుంచున్నాను. మధ్యాహ్నం ఒంటిగంటప్పుడు ఆయన భోజనానికెళ్తూ నన్ను చూశారు. మళ్లీ అదే మాట చెప్పి వెళ్లిపోయారు. ఆయన భోజనం నుంచి వచ్చేదాకా అక్కడే నుంచున్నా. ఏం మాట్లాడకుండా లోపలికి వెళ్లిపోయారు. రాత్రి తొమ్మిదింటప్పుడు ఆయన బయటికొచ్చేటప్పటికి కూడా చేతులు కట్టుకుని అక్కడే నిలబడి ఉన్నాను.
కొంచెం విసుక్కుని ‘ఇప్పుడెక్కడికి వెళ్తావులే, ఇక్కడే ఉండు. కానీ పొద్దున్నే వెళ్లిపోవాలి’ అని భోజనం పెట్టించి అక్కడే పడుకోమన్నారు. నేను మర్నాడు పొద్దునా వెళ్లలేదు.
ఇహ మా మధ్య మాటల్లేవు. రోజూ ఆయనొచ్చే సమయానికి చేతులు కట్టుకుని అక్కడ నిలబడేవాణ్ని. రెండ్రోజులు, మూడ్రోజులు.... అలా పదిరోజులు గడిచాయి!!
ఆయనకు నా మీద జాలేసినట్టుంది. ఒకరోజు పిలిచి ‘వచ్చేనెల మా సినిమా ఒకటి మొదలవబోతోంది. అందులో అసిస్టెంట్ డైరెక్టరుగా చేద్దువుగానివిలే. అప్పటిదాకా ఇంటికెళ్లిరా’ అన్నారు.
కొండంత బరువు నెత్తిమీది నుంచి దింపినట్టయింది.
హుషారుగా ఇంటికి బయల్దేరాను.

*        *        *
నెలరోజుల తర్వాత మళ్లీ చెన్నై వెళ్లాను. కృష్ణంరాజుగారి సినిమాకి దేవదాస్ కనకాల దర్శకుడు. ఆయన దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్గా చేరాను. ఆ సినిమా పేరు ‘ఓ ఇంటి భాగోతం’. హీరో చంద్రమోహన్. మొదటి సారి సినిమా నటుల్ని చూడ్డం కదా... ఏదో తెలియని ఆనందం. చంద్రమోహన్తో ఫొటోలు దిగి ఇంటికి పంపించడం, ఎడిటింగ్ రూములో కిందపడి ఉండే నెగెటివులు తీసుకుని కవర్లో పెట్టి స్నేహితులకు పోస్టు చేయడం లాంటి పనులు చేసేవాణ్ని. ఇప్పడవన్నీ తల్చుకుంటుంటే నాకే నవ్వొస్తుంది.
    ఆ సినిమా షూటింగ్ సమయంలో నా పనితీరు నచ్చడంతో దేవదాస్ కనకాల తాను తర్వాత తీయబోయే సినిమాలకు కూడా నన్నే సహాయకుడిగా పెట్టుకుంటానన్నారు. అన్నట్టుగానే తర్వాత మూడు సినిమాలు తీశారు. అవి మూడూ ఫ్లాపవడంతో చెన్నై వదిలేసి హైదరాబాదుకి వెళ్లిపోయారు.
    మళ్లీ మొదటికి వచ్చినట్టయింది నా పరిస్థితి. ఆయన కాకుండా ఇండస్ట్రీలో నాకు తెలిసిన వ్యక్తి నవతా కృష్ణంరాజుగారే. మళ్లీ ఆయన దగ్గరికే వెళ్లాను. అదృష్టవశాత్తూ మరోనెలలో వాళ్లు జంధ్యాలతో ఒక సినిమా మొదలుపెడుతున్నారని తెలిసింది. ‘ఆయన దగ్గర చేరుదువుగానిలే’ అని భరోసా ఇచ్చారు కృష్ణంరాజుగారు.
    ఆ సినిమా... ‘నాలుగు స్తంభాలాట’.
    జంధ్యాలగారి దగ్గర అప్పటికే నలుగురు అసిస్టెంట్లు ఉన్నారు. ప్రొడ్యూసర్ బలవంతమ్మీద నన్ను అయిదో వాడిగా తీసుకున్నారు. యూనిట్లో అందరూ కూడా నన్ను మొదట్లో హీనంగా చూసేవారు. ఇక ఆ అసిస్టెంట్ దర్శకుల గురించి అయితే చెప్పనక్కర్లేదు. కానీ... రానురానూ జంధ్యాలకు నేను కుడిభుజాన్ని అయిపోయాను. షూటింగ్ ముగిసేసరికి జంధ్యాలగారే తనంతటతాను ‘నువ్వు నా దగ్గర ఉండిపో’ అన్నారు. ఆ తర్వాత వరసపెట్టి సినిమాలు.
    నాలుగుస్తంభాలాటతో మొదలుపెట్టి అహ నా పెళ్లంట దాకా 23 సినిమాలకు ఆయన దగ్గర పనిచేశాను.

*        *        *
ఇవాళ ఎన్ని అడుగులు(ఫిలిం) ఎక్స్ పోజ్ చేశారు... రేపు షూటింగ్ ఎక్కడ... ఆర్టిస్టులెవరు...
రామానాయుడుగారు షూటింగ్కి వచ్చినప్పుడల్లా ఇలా అడగటం అలవాటు. అదే అలవాటుతో ‘అహ నా పెళ్లంట’షూటింగ్ సమయంలో ఆయన అడిగే ప్రశ్నలన్నిటికీ నేను తడుముకోకుండా, డైరీ చూడకుండా టకాటకా సమాధానాలు చెపే్పసేవాణ్ని. అదాయన మనసులో రిజిస్టరయింది.
    ఆ సినిమా విడుదలై హిట్టయ్యాక ఒకసారి ఆయన్ని కలవడానికి వెళ్తే... ‘జంధ్యాల దగ్గర ఎన్నాళ్ల నుంచి పనిచేస్తున్నావు’ అనడిగారు.
    ‘ఏడెనిమిదేళ్ల నుంచి’ అని చెప్పాను.
    ‘ఎన్నాళ్లిలా ఉండిపోతావు, డైరెక్షన్ చెయ్యవా’ అనడిగారాయన. ‘అవకాశం వస్తే చేస్తానండీ’ అన్నాను. ‘అయితే మంచి కథ తయారుచేసుకో, నీకు ఛాన్సిస్తాను’అన్నారాయన.
    కథ రెడిగా ఉందండీ, అని అప్పటికే నేను తయారుచేసుకున్న ‘చెవిలో పువ్వు’ కథ తీసుకెళ్లి ఆయనకు చూపించాను. నేను రాసుకున్న మొదటిస్క్రిప్టు కదా... రంగురంగుల స్కెచ్చు పెన్నులతో చాలా అందంగా తయారుచేసుకున్నానా స్క్రిప్టుని.
    ఆ కథ నాయుడుగారికి బాగా నచ్చింది. ‘బావుందయ్యా కథ, మనం చేద్దాం ఈ సినిమా’ అన్నారు.
ఆ మాటకి నేను ఆల్మోస్ట్ మబ్బుల్లో ఎగిరాను. పదేళ్ల కల అది... డైరెక్టర్ కావడం! కానీ....
    నాలుగైదు రోజుల తర్వాత నాయుడుగారు నాకు ఫోన్ చేసి... ‘కమల్ హాసన్ డేట్లు దొరికాయయ్యా, కాబట్టి ముందు ఆ సినిమా చేసి, తర్వాత నీ కథ చేద్దాం’ అన్నారు. అంటే ఎంత లేదన్నా నా ప్రాజెక్టు ఐదార్నెల్లు ఆలస్యమవుతుంది. సరేనన్నాను.
    మళ్లీ రెండ్రోజుల తర్వాత ఆయనే ఫోన్ చేసి... ‘కమల్,కి ఓ కో-డైరెక్టర్ కావాలంటయ్యా, నీకు స్క్రిప్టు బాగా రాసే అలవాటుందిగా, నువ్వు రాకూడదూ’ అనడిగారు. ఎగ్గిరి గంతేసినంత పనిచేశాను. నేను కమల్ హాసన్ కి పెద్ద అభిమానిని. ఆయనతో కలిసి పనిచేసే అవకాశం వచ్చిందనేసరికి ఆనందం పట్టలేకపోయాను.  మర్నాడే వెళ్లి కమల్ని కలిశాను. ఆయన ఇంట్లోనో ఆఫీసులోనో రోజూ స్టోరీ సిట్టింగ్స్ పెట్టేవాళ్లం. నా కెరీర్లో మొదటిసారి ఆ సినిమాకి సంభాషణలు రాశాను. నేను రాసే డైలాగులు ఆయనకు విపరీతంగా నచ్చేవి.
    ఆ సినిమాలో కమల్ హాసన్ తాగి ఇంటికొచ్చి తలుపుకొట్టే సీనొకటుంది. కమలే వచ్చి రెండుసార్లు తలుపుకొట్టి, తనే ‘కమిన్’ అనేటట్టుగా ఆ సీన్ రాశాను. పగలబడి నవ్వారాయన ఆ సీన్ చెప్తే. అదేకాదు, ఆ సినిమాలో నే రాసిన చాలా సీన్లు తల్చుకుని తల్చుకుని నవ్వేవారాయన. అలా ఆ సినిమాకి పదకొండు నెలలు కమల్ హాసన్తో కలిసి పనిచేయడం ఓ గొప్ప అనుభవం.
    సరే, మళ్లీ నా విషయానికి వస్తే... ‘ఇంద్రుడు-చంద్రుడు’సినిమా విడుదలడమూ హిట్టవడమూ జరిగిపోయాయి. ఇక నా సినిమా మొదలెడతారేమో అనుకున్న టైములో నాయుడుగారికి అనిల్ కపూర్ డేట్లు దొరికాయి. దాంతో ఏదో హిందీ సినిమా మొదలుపెట్టారాయన. నా సినిమా మరో ఏడాది వాయిదా పడింది. అప్పుడు నిర్మాత అశోక్ కుమార్,కి నా స్క్రిప్టు గురించి తెలిసి ఆ సినిమా తాను తీస్తానన్నారు. తానే నాయుడుగార్ని సంప్రదించి అందుకు ఒప్పించారు. అలా అశోక్ కుమార్ నిర్మాతగా నా తొలిసినిమా ‘చెవిలో పువ్వు’ మొదలైంది.
     ఆ సినిమా షూటింగుకి చాలా అడ్డంకులు ఎదురయ్యాయి. షెడ్యూలు మధ్యలో సీత పార్తీబన్ ని వివాహం చేసుకోవడం వల్ల మాకిచ్చిన డేట్లలో అందుబాటులో లేకుండా పోయింది. షూటింగ్ ప్రణాళిక ప్రకారం జరక్కపోవడంతో మిగతా ఆర్టిస్టుల కాల్షీట్లు సర్దుబాటు కష్టమయింది. దీంతో తక్కువ సమయంలోనే హడావుడి హడావుడిగా తీసేయడంతో సినిమా కంగాళీగా తీసేశాం. సినిమా విడుదలకు ముందురోజు రాత్రికి గానీ రషెస్ చూడ్డం కుదర్లేదు నాకు. కానీ... రషెస్ చూడగానే అర్థమైపోయిందినాకు ఆ సినిమా ఫలితమేంటో!

*        *        *
మొదటి సినిమా ఫ్లాపయినా నాకు తన బ్యానర్లో దర్శకత్వం వహించే అవకాశం ఇచ్చారు రామానాయుడుగారు. ఎందుకంటే ‘చెవిలోపువ్వు’ సినిమా ఎంత హడావుడిగా తీశామో ఆయనకు తెలుసు. ఆయనకు నామీద పూర్తి నమ్మకం ఉండటంతో మరో ఆలోచన లేకుండా ఛాన్సిచ్చారు. కాకపోతే ఈసారి నా స్క్రిప్టు కాకుండా పరుచూరి బ్రదర్స్ రాసిన ఒక సినిమా స్క్రిప్టు నా చేతికిచ్చి చదవమన్నారు. అది నాకు పెద్దగా నచ్చలేదు. ఆ మాటే చెప్పాను.
    ‘నాకూ అలాగే అనిపించింది, నువ్వూరాస్తావుగా... ఎలా ఉంటే బాగుంటుందో రాసి చూపించు’ అన్నారు. దాదాపు నెలరోజులలో 18 వెర్షన్లు రాశానా సినిమాకి. చివరిది పరుచూరి బ్రదర్స్ కి నచ్చడంతో షూటింగ్ మొదలుపెట్టాం.
    నాకో అలవాటుంది... స్క్రిప్టులో ఉన్నదానికి అవసరాన్ని బట్టీ షూటింగులో కాస్తంత మార్పుచేర్పులు చేస్తుంటాను. అలా సినిమా 90 శాతం పూర్తయ్యేసరికి స్క్రిప్టులో వాళ్లు రాసినదానికీ నేను తీసినదానికీ సంబంధం లేకుండా పోయింది. రషెస్ చూసిన పరుచూరి బ్రదర్స్ నామీద మండిపడ్డారు. సినిమాని నాశనం చేసేశానని రామానాయుడుగారికి చెప్పారు.
    దాంతో రామానాయుడికి బాగా కోపం వచ్చింది. పరుచూరి బ్రదర్స్ అంతటి వాళ్లు బాగాలేదన్నారంటే నిజమేనేమో అనుకుని రషెస్ చూసి నిర్ధరించుకోకుండానే, నన్ను బాగా తిట్టారు. ఆ బాధతో ఆయన ఆఫీసు బయట కూర్చున్నాను. అంతలో...  దర్శకులు మురళీమోహనరావు, బి.గోపాల్ నాయుడిగారి ఆఫీసుకి వచ్చారు. నా ముఖంచూసి... ‘ఏంజరిగింది’ అని అడిగారు. విషయం చెప్పాను. ‘నువ్వేం బాధపడకు’ అని లోపలికి వెళ్లారు వాళ్లు. ఆయన తనగోడు వాళ్ల దగ్గర వెళ్లబోసుకుని ‘మీరొకసారి రషెస్ చూసి ఏవైనా మార్పులూ చేర్పులూ చేయండి’అన్నారట. వాళ్లు ప్రివ్యూ చూసొచ్చి... ‘సినిమా బ్రహ్మాండంగా ఉంది, కామెడీ అదిరిపోయింది’ అని చెప్పారు. దాంతో రామానాయుడు ఒకసారి ఆలోచించుకున్నారు. తనుకూడా రషెస్ చూశారు. ఆయనకు కూడా బాగా నచ్చింది. నా దగ్గరకు వచ్చి ‘నీకు ఫుల్ ఫ్రీడం ఇచ్చేస్తున్నానయ్యా, క్లైమాక్స్ నీ ఇష్టప్రకారమే తియ్యి’ అని పూర్తి స్వేచ్ఛ ఇచ్చేశారు.

*        *        *
జంధ్యాల కామెడీ సినిమాలే కాదు, ఆనందభైరవి సత్యాగ్రహం లాంటి విభిన్నమైన సినిమాలూ చేశారు. కానీ ఆయన మీద కామెడీ డైరెక్టర్ అనే ముద్ర పడిపోయింది. అలాగే రేలంగి నరసిహారావుగారికి కూడా. ఆ ముద్ర నా మీద పడకూడదనే సెంటిమెంట్, యాక్షన్, కామెడీ... ఇలా అన్నిరకాల సినిమాలూ తీస్తూ వచ్చాను. నా కుటుంబం నిలబడాలి, దర్శకుడిగా నాకంటూ ఒక పేరు తెచ్చుకోవాలనే కసితో పదిపదిహేనేళ్లపాటు కుటుంబాన్ని పట్టించుకోకుండా సినిమాలు తీశాను.
    రాజేష్ నరేష్ చేతికందిరావడంతో ఇదుగో గత ఐదేళ్లుగా రిలాక్స్ డ్;,గా ఉన్నాను. ఇంకో ఐదారేళ్లు ఇలాగే ఇంకొన్ని సినిమాలు తీసి ఆ పై విశ్రాంత జీవితం గడిపేస్తా.

================
...ఐదారేళ్లు సినిమాలు తీస్తానన్న ఈవీవీ కత్తి కాంతారావు సినిమా తర్వాత మరో సినిమా తీయకుండానే చనిపోయారు. May his soul rest in peace.

5 comments:

  1. హ్మ్ బావుంది ఇంటర్వ్యూ...ఎంత కష్టపడి ఈ సినిమా ఫీల్డ్ లో నిలదొక్కుకుంటారో కదా. ఈవీవీ గారికి నా శ్రద్ధాంజలి.

    ReplyDelete
  2. సారీ ఫర్ ది లేట్...
    వేణూరాం గారూ, నెనర్లండీ
    సౌమ్యగారూ, థాంక్యూ. ఈవీవీ చిత్రరంగ ప్రవేశం వెనక ఇంత పెద్ద కథ ఉందని నేనూ ఊహించలేదు. ఆయన చదివింది ఏడో తరగతో ఎనిమిదో తరగతో అంతే. వ్యవసాయంలో నష్టాలొచ్చి పొలాలన్నీ అమ్మేసుకుని చాలా దీనావస్థలో చెన్నై చేరారు. ’తర్వాత అవే పొలాలను మళ్లీ కొన్నప్పుడు, మా అమ్మా నాన్నలు ఎంత సంతోషించారో’ అన్నప్పుడు ఆ సంతోషం ఆయన కళ్లల్లోనే కనపడింది.
    బాధ కలిగించే విషయమేంటంటే... నేను ఈ ఇంటర్వ్యూ చేసే సమయానికి ఆయనకు కీమోథెరపీ జరిగి నెల రోజులు కూడా కాలేదనుకుంటా బహుశా (తలమీద ఒక్క వెంట్రుక కూడా లేదు. మీసాలూ ఆఖరికి కనుబొమలు కూడా లేవు). కానీ నేనున్న గంటన్నరలోనే దాదాపు ఏడెనిమిది సిగిరెట్లు తాగారు. సగటున పదినిమిషాలకొకటి. ‘ఇదేంటిది... క్యాన్సర్ కి చికిత్స చేయించుకుంటూ ఇలా సిగిరెట్లు తాగేస్తున్నారు’ అనుకున్నాను.
    అంత బాధలోనూ నవ్వుతూనే మాట్లాడిన ఆయన విల్ పవర్కి హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే. ఆరోజు ఆయన ‘బురిడీ’ సినిమా కథాచర్చల్లో పాల్గొంటున్నారు. అదయిపోయాక అప్పుల అప్పారావు సెకండ్ పార్ట్ తీస్తాననీ(అదే కత్తి కాంతారావు అనుకుంటా, If i am not wrong) తర్వాత ఎవడి గోల వాడిదే సినిమాకి కూడా సీక్వెల్ తీస్తాననీ ఉత్సాహంగా చెప్పారు.
    ఆయన చనిపోయారన్న వార్త వినగానే ఏంటో ఆ ఉత్సాహమే గుర్తొచ్చింది. ప్చ్..!

    ReplyDelete
  3. హ్మ్ అంత బాధలోనూ ఆ ఉత్సాహం మెచ్చుకోదగ్గదే కానీ ఆ సిగరెట్లేమిటి....చావుని కోరితెచ్చుకున్నట్టుగా ఉంది.

    ReplyDelete
  4. నేనూ అదే అనుకున్నానండీ!

    ReplyDelete