Thursday, January 27, 2011

అచ్చవని నా ఆర్టికల్... బ్లాగుల్లో సాహితీ సేద్యం

పోస్టు చేయని ఉత్తరాల్లాగా ఈనాడు ఆదివారంలో అచ్చుకు నోచుకోని ఒకానొక పాత ఆర్టికల్ ఇది. 2008లో రాశాను. బ్లాగుల్లో కథ, పద్యం, కవిత్వం, పేరడీ... ఆఖరుకు అవధానంతో సహా అన్ని ప్రక్రియలూ వెలిగపోతున్నాయన్నదే కాన్సెప్టు.
===============
కథ, పద్యం, కవిత్వం, పేరడీ... ఆఖరుకు అవధానంతో సహా అన్ని ప్రక్రియలతోనూ బ్లాగుల్లో సాహిత్యం వెలిగిపోతోంది. కందాలూ సీసపద్యాలూ సమస్యాపూరణలూ కథలూ కవితలూ... భువనవిజయాన్ని తలపిస్తున్నాయి  తెలుగుబ్లాగులు. బ్లాగరులే అష్టదిగ్గజాలై చెలరేగిపోతున్నారు.

బ్లాగంటే... ఎవరో ఒకరి సొంతసోది. కానీ తెలుగు బ్లాగులు ఇంకో అడుగు ముందుకేశాయి. అభిప్రాయాల వెల్లడితోపాటు అవధానాలూ సాగుతున్నాయక్కడ. పద్యాలు రసగంగాప్రవాహమై పొంగుతున్నాయి. కథలూ కవితలూ పేరడీలూ ఇవన్నీ పిల్లకాలువలు!


కందాల వెల్లువ
కందం రాయనివాడు కవిగాడని సామెత. అలాగైతే బ్లాగుల్లో కవులు చాలామందే ఉన్నారు. అనగా కందాలు రాస్తున్నవారన్నమాట. సమస్యాపూరణం నుంచి... సమకాలీన విషయాల మీద తమంతట తాము స్పందించి రాసినవాటిదాకా ఎన్నెన్నో పద్యాలు. రాసేవాళ్లంతా గొప్ప అవధానులూ కారు. సామాన్యులే. చిన్నప్పటి నుంచీ పద్యం మీద ఉండే ఆసక్తీ అభిలాష, కొద్దోగొప్పో సహజ ప్రతిభ... ఇవే వారి సాహితీ సేద్యానికి పెట్టుబడులు. విశేషమేంటంటే ఇలా ప్రయత్నం చేసిన ప్రతి ఒక్కరూ క్రమంగా పద్యాలు రాయడంలో పట్టు సాదఇంచడం. పద్యం నడకను పట్టుకుని అలవోకగా కందాలల్లే స్థాయికి చేరుకోవడం. మధ్యలో ఎక్కడైనా నట్టుపడితే ఆదుకోవడానికి బ్లాగ్గురువులు అందుబాటులోనే ఉంటారు. రోజువారీ అందరూ వాడే, అందరికీ అర్థమయ్యే పదాలతో ఎంత సులభంగా పద్యాలు రాయొచ్చో ఆ కిటుకు విడమరిచి చెబుతారు. కొత్తవారు రాసిన పద్యాలకు మరికొన్ని విరుపులతో సరికొత్త సొగసులద్దుతారు. మొత్తమ్మీద పసందైన పద్యాలు ఊపిరి పోసుకుంటాయి. రాదురాదంటూనే ఔత్సాహిక కవులు ఉద్దండులవుతారు. కావాలంటే... ‘తెలుగులో తప్పటడుగులు’ అంటూనే పద్యాల గొప్పటడుగులు వేస్తున్న లంకాగిరిధర్ అనే ప్రవాసాంధ్రుడి బ్లాగు చూడొచ్చు. ‘పై చదువులకని కొన్నాళ్లూ ఉద్యోగరీత్యా కొన్నాళ్లూ మొత్తానికొ పదేళ్లపైగానే ఇంటికి దూరంగా ఉంటూ ఇంట్లో వాళ్లతో తప్ప తెలుగులో సంభాషఇంచే అవకాఅం లేక... తెలుగులో ధారాళంగా మాట్లాడగలిగే శక్తినే కోల్పోతున్న దళలో నాలో స్వభాషఆభిమానానికి పునర్జన్మనిచ్చిన గొప్పదనం తెలుగు బ్లాగరులకే చెందుతుంది. వారికి నా ప్రేమపూర్వక ధన్యవాదాలు’ అంటారాయన.

నెట్లో భువన విజయం
అవును... భువనవిజయమే! అంతర్జాలంలోనే! తెలుగు బ్లాగరుల్లో పద్యాల మీద ఆసక్తి ఆ స్థాయికి చేరింది మరి. పొద్దు అనే వెబ్ జైన్ ‘అంతర్జాల భువన విజయం’ పేరుతో సాహితీసేద్యానికి శ్రీకారం చుట్టింది. సమస్యల ఏరువాక... చమత్కార వ్యాఖ్యానాల ఎరువు జల్లడం... పూరణల పంట... అన్నీ ఒక్కరోజులోనే! 


అదీ ఏడాదిలో రెండుసార్లు. మొదటి భువన విజయం తెలుగువారి తొలిపండుగ ఉగాదినాడు జరగ్గా రెండోది ఇటీవలే విజయదశమినాడు జరిగింది. అప్పటిదాకా ఎవరిబ్లాగుల్లో వారుపద్యాలు రాసుకోవబడమే రివాజు. అలాంటిది పదిపదిహేను మంది బ్లాగర్లు ఇంటర్ నెట్ లో ఒకచోట కూడి తమ ప్రతిభను ప్రదర్శించడం అపూర్వం. మరే ప్రాంతీయ బ్లాగర్లూ ఇలాంటి ప్రయత్నం చేయలేదేమో బహుశా!

ఎందరో సాహితీప్రియులు
వాగ్విలాసం చిరునామాగా చెలరేగుతున్న శ్రీరాఘవ, ‘ఆంధ్రామృతం’ చిలికిస్తున్న చింతా రామకృష్ణారావు, అరుదైన పద్యాల ‘తెలుగు పద్యం’తో సాహితీప్రియులకు విందు చేసే భైరవభట్ల కామేశ్వరరావు, ‘అందం’గా కందాల్లే రాకేశ్వరుడు (కందపద్యాలకో ‘ఇమేజీ’నిచ్చారీయన), తాను రాస్తూ సమస్యలిచ్చి పూరించమనే ఊకదంపుడు(పేరడీ శ్లేషలకు పెట్టింది పేరు. ఈయన మాటల్లో అక్షరానికో చమత్కారబాణం)... కుస్తీ పట్టి యతిప్రాసలూ గణనియమాలూ కూడగట్టుకుంటూ కందప్రాశన చేసి ఓ వెలుగు వెలిగిపోతున్న చదువరి, రానారె లాంటి శిష్యులూ ఇంకా కొత్తపాళీ, కలగూరగంప, జోరుగాహుషారుగా, సిరివెన్నెల... ఇలా ఎందరో బ్లాగర్లు... కాదుకాదు సాహితీప్రియులున్నారు అంతర్జాలంలో.


పద్యాలపూరణే కాదు, కథాపూరణలూ జరుగుతున్నాయి నెట్లో. ఉదాహరణకు... కొత్తపాళీ అనే బ్లాగరు ‘తెల్లకాగితం’ అనేఅంశాన్నిచ్చి దాని మీద కథ రాయాల్సిందిగా సూచించారు. ఆసక్తి ఉన్న అనేకమంది ఈ కథాపూరణ ప్రక్రియలో పాల్గొన్నారు. వాటిని పొద్దు వారు ప్రచురించడం మరో ముచ్చట. 

ఆ కథల్లోనూ కవితల్లోనూ పద్యాల్లోనూ నాణ్యత సరైనదేనా... అన్న సందేహం వస్తే మాత్రం... ‘ఇంతమంది ఔత్సాహికుల, అలవాటు లేని వారు సైతం ఆసక్తితో ఈ పాటి ప్రయత్నం చేయడమే గొప్పవిషయం కదా’ అని సమాధానం వస్తుంది బ్లాగర్ల నుంచి.


నిజమే, తప్పుల్దేముంది, తర్వాతైనా సరిదిద్దుకోవచ్చు. ప్రయత్నమే ముఖ్యం, ఏమంటారు!
==================


అద్గదీ కథ!
కాకపోతే కొన్ని కారణాల వల్ల ఈ వ్యాసం ప్రచురణకు నోచుకోలేదు. నిన్న జరిపిన క్లీన్ అండ్ క్లీన్ కార్యక్రమంలో భాగంగా అనుకోకుండా నా డెస్కులో అట్టడుగున ఎక్కడో కంట పడిందీ రెండేళ్లనాటి కాపీ. ఒక టపాకైనా మేత దొరికిందిగదాని అక్కడ చదివి ఇక్కడ నెమరేస్తున్నా. 
ఇక్కడ నా అనుకోలు ఇంకోటుంది. ఇదంతా రెండేళ్లక్రితం సంగతి. ఇప్పుడు బ్లాగుల్లో చాలా మార్పులొచ్చేశాయి.
ఏంటా మార్పులంటారా... మంది ఎక్కువైపోయారు(నాతో సహా :) )

8 comments:

  1. జాల భువన విజయసభల్లో వచ్చిన పద్యాల క్వాలిటీ టాప్ క్లాస్.
    Of course, my opinion is biased, but any doubters can verify for themselves by visiting the proceedings published in Poddu. They are equal or better than many avadhanam padyalu from famous avadhanis. One has to remember that all these poets, with one or two exceptions, are engaged in professions not connected to Telugu language. Most did not study the language beyond high-school.

    ReplyDelete
  2. అయ్యో, నా ఉద్దేశం క్వాలిటీ లేదని కాదండీ! అసలీ ప్రక్రియలే అలవాటు లేని ఔత్సాహికులూ బాగా రాస్తున్నారు, వాళ్ల పద్యాల్లో ఏవైనా చిన్నచిన్న దిద్దుబాట్లు ఉన్నా పెద్దలు సరిదిద్దుతున్నారనే.

    ReplyDelete
  3. Nice review of blogs of those times.Now the trend has changed to certain extent.

    ReplyDelete
  4. బాలు, మీరేదో అన్నారని కాదు, ఊరికినే చెప్పాలనిపించింది.

    ReplyDelete
  5. సీబీరావుగారూ... అవునండీ, ఇటీవలి కాలంలో బ్లాగుల పంథాలో చాలా మార్పులొచ్చాయి. టైమ్... అంతే!
    కొత్తపాళీగారూ... ఓకే, ఓకే

    ReplyDelete
  6. ఇప్పుడే టపా మళ్ళీ పూర్తిగా చదివా. నేను కొద్ది రోజులు నడిపిన కథారచన పోటీని కూడా ప్రస్తావించినందుకు సంతోషం. ఇందాక గమనించలేదు. రచనల క్వాలిటీ చెప్పుకోవాలంటే ఈ పోటీలో కూడా కొన్ని మంచి కథలొచ్చాయి. ఈ పోటీనించి పుట్టి ఈమాటలో ప్రచురితమైన "అటో ఇటో", "అంతర్మథనం", "పేరు గలవాడేను మనిషోయ్" చాలా మంచి కథలు. పోటీకి వచ్చిన మరి కొన్ని కథలు కూడా బాగున్నై.

    ReplyDelete
  7. కొత్తపాళీగారూ... అవునండీ మంచి కథలే వచ్చాయి. ఈప్రక్రియను మీరు ఎందుకు పున:ప్రారంభించకూడదు?

    ReplyDelete
  8. హ హ హ. భలే వారే. ఇట్లాంటి ట్రిక్కులు ఉపయోగించి బ్లాగర్లందర్నీ మాయజేసి బ్లాగులోకాన్ని ఏదో నా సొంత పెరడులాగా తయారు చేసుకున్నానని జనాలు ఏడిచి చచ్చారు. ఎందుకులేండి మళ్ళీ, ఎవరి బ్లాగులు వాళ్ళు రాసుకోడమే ఉత్తమం. అందుకనే బ్లాగు ఆధారిత పత్రికలన్నిటికీ కూడ దూరంగా ఉంటున్నా. కవి సమ్మేళనం నిర్వహణ కూడా ఇతరులకి అప్పగించేశా. కామేశ్వర్రావుగారు చక్కగా నిర్వహించారు మొన్న దసరాలకి.

    ReplyDelete