Monday, February 28, 2011

రెండ్రోజులు మైకంలో ఉండిపోయా!

సాలూరి రాజేశ్వరరావు... గాలిపెంచల నరసింహారావు... మాస్టర్ వేణు...  సుసర్ల దక్షిణామూర్తి... సి.ఆర్.సుబ్బురామన్... ఘంటసాల... పెండ్యాల... ఆదినారాయణరావు... కె.వి.మహదేవన్... ఎమ్మెస్ విశ్వనాథన్... రమేశ్ నాయుడు... రాజన్ నాగేంద్ర... ఎస్.పి.కోదండపాణి... సత్యం...  జె.వి.రాఘవులు... చక్రవర్తి... ఇళయరాజా... ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం...
ఒకరా ఇద్దరా!!
30 మంది లెజెండ్స్... మ్యూజిక్ మాస్ట్రోస్...
వాళ్లందరి బాల్యం గురించి, సంగీతంలో ప్రవేశం గురించి వాళ్ల జీవితాల్లోని అద్భుత ఘట్టాల గురించీ...
ఒక్కచోట చదివే అవకాశం వస్తే..!
ఆ అదృష్టం ఈ శనివారం నాకు దక్కింది.
ఆ పుస్తకం పేరు... స్వర్ణయుగ సంగీత దర్శకులు

 
చేతికి రాగానే ఆవురావురుమంటూ చదవడం మొదలెట్టాను.
ముందుగా... ఇండెక్స్ పేజీ తీసి నాకు బాగా ఇష్టమైన రమేష్ నాయుడు గారి(294-325) గురించి చదివేశాను.ఆ తర్వాత మొదటికొచ్చి మొదట్నుంచీ చదివేశాను.
నాకు ఆరేడేళ్ల వయసప్పుడు దూరదర్శన్లో ఒక జంతువుల సినిమా వచ్చింది. అందులో ప్రధాన పాత్రలు రెండు కోతులు(శంకర్, గౌరీ). అంత చిన్న వయసులోనే ఆ సినిమా నా మనసులో బలంగా ముద్రపడిపోయింది. ఆ సినిమా తీసింది మన రమేశ్ నాయుడుగారేనని... బొంబాయి కలకత్తాల్లో దుమ్ము రేపి రచ్చ గెలిచాకే ఆయన ఇంట(తెలుగునాట) గెలిచారనీ... ఈ పుస్తకం చదివాకే తెలిసింది. అలాగే ఎమ్మెస్ విశ్వనాథన్ చెన్నైలో నటుడిగా అవకాశాల కోసం వెతుకుతూ కొన్నాళ్లు ఒక నిర్మాత దగ్గర ఆఫీసు బాయ్ గా  చేశారనీ... కె.వి.మహదేవన్ గురించి బాపురమణలు చెప్పిన ముచ్చట్లు... వాళ్లల్లో చాలామంది సంగీత దర్శకుల గురించి మన గానగంధర్వుడు బాలసుబ్రహ్మణ్యం చెప్పిన విశేషాలు...
ఏమని చెప్పను నా పరిస్థితి!!!
ముందు మూడొందల తొంభై ఐదు పేజీలు ఏకబిగిన చదివేశాను.
తర్వాత మిగతా పేజీలు పూర్తిచేసి పడుకునే సరికి తెల్లవారుజామున మూడయింది.
ఎలాంటి మహానుభావులండీ ఒక్కొక్కరూ..!
మనం ఎంతగానో అభిమానించే వ్యక్తుల గురించి అన్నేసి విషయాలు ఒకేసారి తెలుసుకోవడంలో ఉండే మజా అది అనుభవిస్తేగానీ అర్థం కాదు.
అదొక మైకం. ఆ మైకంలో రెండ్రోజులు ఉండిపోయాను.

ఇంత గొప్ప పుస్తకాన్ని తేవాలన్న ఆలోచన వచ్చినందుకు చిమట మ్యూజిక్ శ్రీనివాసరావుగారిని తెలుగు సినీ సంగీతాభిమానులందరూ అభినందించాల్సిందే. ఈ బృహత్తర యత్నాన్ని నెత్తిన వేసుకుని రెండేళ్లపాటు శ్రమించి ఆరొందల పేజీల అద్భుతాన్ని మన కళ్ల ముందు ఆవిష్కరించిన పులగం చిన్నారాయణగారికి నూటపదహారు వీరతాళ్లు వేసుకోవాల్సిందే.

ఇంతా చేసి, ఈ పుస్తకం ఖరీదు రూ.500 అంటే చాలా ఆశ్చర్యం వేసింది. ఆ విశేషాలకిగానీ... ఇందులోని అమూల్యమైన విశేషాలకి గానీ... వెలకట్టడం అసలు సాధ్యమయ్యే పనేనా అని.

సాధారణంగా ఏదైనా పుస్తకానికి సమీక్ష రాస్తే సమీక్షకుడికి ఒక కాపీ ఇవ్వడం ఆనవాయితీ. అందుకే ఈ పుస్తకానికి నేను సమీక్ష రాయదల్చుకోలేదు(పత్రికలో).
ఎందుకంటే... ఈ పుస్తకాన్ని డబ్బులిచ్చి కొనడమే ఆ మహానుభావుల పట్లా ఈ పుస్తక రూపకర్తల పట్లా నేను చూపగలిగిన గౌరవం అని నాకు అనిపించింది కాబట్టి.
అందుకే ఈ పుస్తకాన్ని కొని దాచుకుంటాను.
మళ్లీమళ్లీ చదువుకుంటాను.


పుస్తకం వివరాలు
స్వర్ణయుగ సంగీత దర్శకులు
రచయిత: పులగం చిన్నారాయణ
పేజీలు : 600
వెల : రూ.500
(డాలర్లలో అయితే  $60.)

ప్రతుల కోసం:
మన రాష్ట్రంలో అయితే అన్ని ప్రధాన పుస్తక కేంద్రాల్లో దొరుకుతాయి.

అమెరికాలో ఉండేవారు సంప్రదించవలసిన చిరునామా
శ్రీనివాస్ చిమట
34361 EUCALYPTUS TERRACE
FREMONT, CA 94555 USA

e-mail: Chimata.Music@gmail.com

10 comments:

  1. ఆ సినిమా పేరు "మాకూ స్వాతంత్రం కావాలి"
    చాలా బావుంటుంది. గుర్తు చేసినందుకు ధన్యవాదాలు.

    అయితే మీరూ రమేష్ నాయుడి గారి అభిమానే అన్నమాట.

    ReplyDelete
  2. ఔనండీ, శంకర్ గారూ ఆ సినిమా పేరదే.
    ఇంకో ఔను, నేను రమేష్ నాయుడి గారి అభిమానినే. మహదేవన్, ఇళయరాజా వంటివారి పాటలు కూడా నచ్చుతాయిగానీ, నాయుడిగారి పాటలు ఇంకొంచెం ఎక్కువ నచ్చుతాయెందుకో. లోకో భిన్నరుచి: అంటారు కదా.

    ‘‘అయితే మీరూ రమేష్ నాయుడి గారి అభిమానే అన్నమాట. ’’
    ...అన్నారంటే, మీరు కూడానా?

    ఉంకో విష్యం. మీ ఇంటిపేరు సరస్వతుల అని చూశాను. కొంపదీసి(తీయకుండా కూడా) మీరేమైనా సరసిగారికి చుట్టాలా?
    ఏదో కుతూహలం పట్టలేక అడుగుతున్నాను.

    ReplyDelete
  3. మన నవయుగ సంగీత దర్శకులు కూడా ఈ పుస్తకం చదివితే బాగుంటుంది.

    ReplyDelete
  4. "‘‘అయితే మీరూ రమేష్ నాయుడి గారి అభిమానే అన్నమాట. ’’
    ...అన్నారంటే, మీరు కూడానా?"

    మరనే కదా :). అన్నట్టు మీరు రమేష్ నాయుడి గారి స్వరకల్పనలో బాలు, ఏసుదాస్, మంగళం పల్లి బాలమురళీ కృష్ణ , ఆశ భోంస్లే , పి.సుశీల, వాణీ జయరాం, వేదవతీ ప్రభాకర్ గార్లు పాడిన అన్నమయ్య కీర్తనలు విన్నారా?

    ఉండే ఉంటుంది. ఇంట్లో పెద్దవాళ్ళని అడగాలి. నాకు ఈ బంధుత్వాలు, వరసలు వంటివి బొత్తిగా తెలియదు

    ReplyDelete
  5. బోనగిరి గారూ... అవునండీ, ఇప్పటి సంగీత దర్శకులందరూ తప్పక చదవాల్సిన పుస్తకం.

    శంకర్గారూ వినలేదండీ, నాకు కలెక్షన్లలాగా పెట్టుకుని వినడం కన్నా అప్పటికప్పుడు రేడియోలో రాండమ్ గా వచ్చే పాటలు విని ఆనందించడమే ఇష్టం. ఆ సస్పెన్స్ బాగుంటుంది. కాబట్టి రమేష్ నాయుడిదే కాదు, ఎవరి పాటలూ నా దగ్గర కలెక్షన్ లేవు.

    ReplyDelete
  6. స్వర్ణయుగ సంగీత దర్శకులు
    ----ఈ పుస్తకాన్ని ప్రచురించిన పబ్లిషర్స్ ఎవరండి కాస్త చెబుతురూ..చదువుదామంటే మాకు దగ్గరలోని విశాలాంద్ర బుక్ హౌస్ ఈ పుస్తకం లేదండి..

    ReplyDelete
  7. కథాసాగర్ గారు... సారీ, అండీ ఆలస్యంగా స్పందిస్తున్నందుకు.
    (అపురూపంగా దొరికిన పాత చందమామలు చదవడంలో పడి) వారం రోజులుగా బ్లాగు చూడట్లేదు. sweetstupid@rediffmail.com ఇది నా మెయిలైడీ. దీనికి మీరొక మెయిల్ పంపిస్తే పులగంగారి మెయిలైడీ వివరాలు చెబుతాను. ఆయన్నే కాంటాక్ట్ చేయొచ్చు.

    ReplyDelete
  8. Thanks Bongari గారు..

    బాలు అంటే SP Balu అని చాలా ఆతృతగా లింక్ ఓపెన్ చేశాను.. సాక్షాత్తు బాలు గారు కాకపోయినా.. మరొక సంగీతాభిమాని, బాలు గారి పరిచయం ఈ లింక్ ద్వారా అవ్వటం సంతోషంగా ఉంది..

    Thanks,
    Srini Chimata
    ChimataMusic.com

    ReplyDelete
  9. Katha Sagar gaaru,

    If you are in Hyd, you can either contact the writer, Pulagam at pulagamc@gmail.com or my father-in-law, Prasad gaaru 40- 3054419 (Kukatpally).

    If you are in Vijayawada, you can contact Surya Guduru gaaru (CTO of ChimataMusic.com) at suryaguduru@gmail.com

    Thanks,
    Srini

    ReplyDelete
  10. మంచి పుస్తక పరిచయం.
    మీకు, మీ కుటుంబ సభ్యులకు వినాయకచవితి శుభాకాంక్షలు
    శిరాకదంబం వెబ్ పత్రిక

    ReplyDelete