Friday, July 16, 2010

ఆహుతి ప్రసాద్ తో ముఖాముఖి

ఈనాడు ఆదివారం అనుబంధం కోసం నేను చేసిన ఇంటర్వ్యూ ముఖ్యాంశాలు. మొన్నాదివారం ఎడిషన్లో ప్రచురితమైందీ ఆర్టికల్

మద్రాస్‌ ఫిలిం ఇన్‌స్టిట్యూట్‌లో శిక్షణ పొందిన చిరంజీవి, రజనీకాంత్‌, రాజేంద్రప్రసాద్‌, నారాయణరావు... అందరూ స్టార్లయిపోతున్నారు. నేనుకూడా మద్రాసు వెళ్లాలి. నటనలో శిక్షణ పొందాలి, సినిమాల్లో నటించాలి. ఇంటర్మీడియట్‌ చదువుతున్నప్పటి నా ఆలోచనలివి. అసలు చిన్నప్పటి నుంచి సినిమాలంటే పిచ్చి నాకు.

ఆ పిచ్చితోనే స్కూల్లో కాలేజీల్లో నాటకాలు వేస్తుండేవాణ్ని. సినిమాలు విపరీతంగా చూస్తుండేవాణ్ని. ఏ సినిమా అయినా మార్నింగ్‌షో చూడాల్సిందే. ఎన్టీఆర్‌ అంటే మాటల్లో చెప్పలేనంత అభిమానం. మార్కెట్లోకి వచ్చే ఏ సినిమా పత్రికనూ వదిలేపని లేదు. ఇలా ఉండేది మన యవ్వారం.

కానీ మాది వ్యవసాయ కుటుంబం. ఎవరికీ సినిమా పరిశ్రమతో అసలు సంబంధాలు లేవు. ఒక్కణ్నే కొడుకుని. అందుకే సినిమా నటుణ్ని అవుతానంటే ఇంట్లోవాళ్లు ఒప్పుకోలేదు. దాంతో నేనూ అలిగాను. సెలవులు అయిపోయినా కాలేజీకి వెళ్లనని వెుండికేశాను. అలా అక్కడే నాలుగేళ్లు ఉండిపోయాను. నాకు ఇరవైరెండేళ్లు వచ్చాక తాతయ్యావాళ్లు 'వీడికింక పెళ్లి చెయ్యాల్సిందే' అని పట్టుబట్టి పెళ్లి చేసేశారు. పెళ్లయ్యాక నాలో చాలా మార్పువచ్చింది. అప్పటిదాకా నాలో లేని స్వతంత్ర భావాలు పెరిగాయి. ఫిలిం ఇన్‌స్టిట్యూట్‌లో చేరడానికి ఇంట్లోవాళ్ల అనుమతి అడిగేవాణ్ని కాస్తా 'నేను హైదరాబాద్‌ వెళ్లి నటనలో శిక్షణ పొందుతాను' అని చెప్పగలిగే ధైర్యం వచ్చింది. అలాచెప్పేసి ఇక్కడికి ప్రయాణం కట్టాను.

1983 జనవరి 26న హైదరాబాద్‌లో మధు ఫిలిం ఇన్‌స్టిట్యూట్‌ ప్రారంభమైంది. నటుడు అచ్యుత్‌, శివాజీరాజా, రాంజగన్‌, నేనూ... మేమందరం ఫస్ట్‌బ్యాచ్‌. ప్రారంభోత్సవం ఎన్టీఆర్‌తో చేయించారు విక్టరీ మధుసూదన్‌రావు. అంతకు ముందు ఎన్నికల ప్రచారంలో దూరంగా చూసిన ఎన్టీఆర్‌ని అంత దగ్గరగా చూడ్డం, ఆయనకి షేక్‌హ్యాండ్‌ ఇవ్వడం... అదంతా ఇప్పటికీ ఒక కలలాగా అనిపిస్తుంది. కానీ ఆయనతో కలిసి ఒక్క సినిమాలో కూడా చెయ్యలేకపోయాను, అది ఇక తీరని కోరిక.

ఫిలిం ఇన్‌స్టిట్యూట్‌లో శిక్షణ నామీద నాకు నమ్మకాన్ని పెంచింది. ఏ నటుడికైనా కావాల్సింది అదే. అక్కడ శిక్షణలో భాగంగా ఇంప్రొవైజేషన్‌ క్లాస్‌ ఉండేది. చాలా ముఖ్యమైన భాగం అది. అందులో నేనే ఎప్పుడూ ఫస్ట్‌ వచ్చేవాణ్ని. అప్పుడు లభించే ప్రశంసలు 'ఫర్లేదు, మనం సరైన దారిలోనే వెళ్తున్నాం' అనే భరోసా ఇచ్చేవి.

1984లో డిప్లొమా పూర్తయ్యాక అందరూ మద్రాసు వెళ్లారు. ఇంతలో దేవదాస్‌ కనకాల ఒక యాక్టింగ్‌ స్కూల్‌ పెట్టి నన్ను ఇన్‌ఛార్జ్‌గా ఉండమని అడిగితే వెళ్లాను. కొన్నాళ్ల తర్వాత మధుసూదనరావుగారు రెండు సినిమాలు డైరెక్ట్‌ చేస్తుంటే ఆయన దగ్గరకు వెళ్లాను. అందులో ఒకటి ఉషాకిరణ్‌ మూవీస్‌ వాళ్ల 'మల్లెవెుగ్గలు'. ఆ సినిమాకి అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా చేశాను. రెండో సినిమా 'విక్రమ్‌'. నటుడుగా అది నా తొలిసినిమా.

మరోవైపు... మేం ఇన్‌స్టిట్యూట్‌లో శిక్షణ పొందుతున్నప్పుడు తాతినేని ప్రకాశరావు అక్కడికి వస్తుండేవారు. నన్నాయన బాగా ఇష్టపడేవారు. ఆయన దూరదర్శన్‌ కోసం 'మీరూ ఆలోచించండి' అనే ప్రోగ్రాం చేస్తూ నన్ను అందులో నటించమని అడిగారు. ప్రతాప్‌ఆర్ట్స్‌ థియేటర్‌లో ఆ సినిమాకి డబ్బింగ్‌ చెప్పడానికి వచ్చాను. అక్కడ నాకు రాఘవగారబ్బాయి ప్రతాప్‌ పరిచయమయ్యాడు. తర్వాత వాళ్ల బ్యానర్‌లో 'ఈ ప్రశ్నకు బదులేది' అనే సినిమా తీస్తున్నప్పుడు అందులో నన్ను విలన్‌గా తీసుకున్నారు. నిర్మాత శ్యాంప్రసాద్‌రెడ్డి ఆ సినిమా ఫస్ట్‌కాపీ చూశారు. అప్పటికే ఆయన 'తలంబ్రాలు' తీశారు, రెండో సినిమాగా 'ఆహుతి' ప్లాన్‌ చేస్తున్నారు. 'ఈ ప్రశ్నకు బదులేది'లో నా నటన ఆయనకు బాగా నచ్చి 'ఆహుతి'లో శంభుప్రసాద్‌ పాత్రకు తీసుకున్నారు.

ఆ సినిమా నా కెరీర్‌లో పెద్ద మైలురాయి.

'ఆహుతి' సినిమాతో నాకు మంచి పేరొచ్చింది. అప్పట్లో ఆంధ్రప్రభలో పనిచేసే ఆంజనేయశాస్త్రి అనే పాత్రికేయుడు నన్ను ఇంటర్వ్యూ చేసి నా గురించి పత్రికలో రాశారు. అందులో ఆయన... 'ఇక నుంచి ఇతను శంభుప్రసాద్‌(ఆహుతి సినిమాలో నా పేరు) కాదు, జనార్దన వరప్రసాద్‌(అది నా అసలుపేరు) కాదు... ఆహుతి ప్రసాద్‌' అని రాశారు. దాంతో అందరూ అలాగే పిలవడం వెుదలుపెట్టారు. తర్వాత్తర్వాత చాలా మంది- 'పేరులో 'ఆహుతి' ఏంటయ్యా, అర్జెంటుగా ఆ పేరు మార్చుకో' అని చెప్పారు కానీ నేనెంత ప్రయత్నించినా ఆ పేరు అలాగే స్థిరపడిపోయింది.

'ఆహుతి' సినిమా హిట్టయినా నేను దాన్ని సరిగ్గా సద్వినియోగం చేసుకోలేకపోయాను. ఒక పీఆర్‌వోని పెట్టుకోవాలనీ పరిశ్రమలో వ్యక్తుల్ని ఎప్పటికప్పుడు కలిసి మాట్లాడాలనీ వాళ్ల దృష్టిలో ఉండాలనీ... ఇవేవీ తెలీదు. 'ఈ సినిమాతో మనకి మంచిపేరొచ్చింది కదా, వాళ్లే పిలిచి అవకాశాలు ఇస్తారులే' అనే భ్రమలో ఉండేవాణ్ని. ఒక మంచి హిట్‌ని క్యాష్‌ చేసుకోలేకపోయిన ప్రభావం నామీద బాగా పడింది. ఒకటీఅరా వేషాలు వస్తుండేవి. అప్పుడు కూడా వేషాలిమ్మని ఎవర్నీ అడగాలని తోచలేదు. ఇంతలో నేను నటించిన 'పోలీస్‌భార్య' హిట్టవడంతో ఆ సినిమా కన్నడ రైట్స్‌ తీసుకున్నాను. కర్ణాటకలో సెటిలైనవాళ్లం కాబట్టి కన్నడలో ఒక సినిమా తీయాలని ఉండేది నాకు. 'పోలీస్‌భార్య' కన్నడ వెర్షన్‌కి నాతోపాటు హరిప్రసాద్‌, గిరిబాబుగారబ్బాయి రఘుబాబు నిర్మాతలుగా కలిశారు. ఆ ఏడాది కన్నడలో సిల్వర్‌జూబ్లీ సినిమా అదే. దాంతో మాకు మంచి పేరొచ్చింది. తర్వాత మరో రెండు సినిమాలు తీశాం. అందులో ఒకటి బాగానే ఆడినా ఇంకోటి ఫ్లాప్‌ అయి నష్టాల పాల్జేసింది. ఇటు- నేను కన్నడ సినిమాలు తీయడంలో బిజీగా ఉండటంతో నిర్మాతలూ దర్శకులూ... 'ఆ ఎక్కడో కర్ణాటకలో సినిమాలు తీసుకుంటున్నాడు, మనకి అందుబాటులో ఉంటాడో ఉండడో' అని వేషాలివ్వడం తగ్గించేశారు. రెంటికీ చెడ్డ రేవడి అన్నట్టయింది నా పరిస్థితి.

నేను బెంగళూరులో ఉండగా 'అనగనగా ఒకరోజు' షూటింగ్‌ యూనిట్‌ కర్ణాటక వచ్చింది. అప్పుడు కృష్ణవంశీ నాకు ఫోన్‌ చేసి అందులో ఒక పోలీసాఫీసర్‌ పాత్ర ఉంది చేయమని అడిగాడు. తనకెందుకో వెుదట్నుంచి నా నటన అంటే ఇష్టం. చాలారోజుల తర్వాత మళ్లీ అవకాశం రావడంతో సరేనన్నాను. కొద్దిరోజులు షూటింగ్‌ అయ్యాక ఆ ప్రాజెక్ట్‌ కృష్ణవంశీ నుంచి వర్మ చేతుల్లోకి వెళ్లింది. నాకు వేషం పోయింది. 'గులాబి' హిట్టయ్యాక కృష్ణవంశీ 'నిన్నే పెళ్లాడతా' వెుదలుపెట్టేటప్పుడు మళ్లీ నాకు ఫోన్‌ చేసి అందులో హీరోయిన్‌ తండ్రి పాత్ర ఆఫర్‌ చేశాడు. ఆ సినిమాతో నా కెరీర్‌లో సెకండ్‌ ఇన్నింగ్స్‌ మొదలైంది.
అదే సమయంలో తెలుగు చిత్రపరిశ్రమ హైదరాబాదుకి పూర్తిగా షిఫ్టయింది. దాంతో పిల్లల్ని తీసుకుని ఇక్కడికి వచ్చేశాను. 'నిన్నే పెళ్లాడతా' తర్వాత అవకాశాలు వస్తున్నాయిగానీ, నా కన్నడ సినిమా పరాజయం తాలూకూ అప్పులు వెంటాడుతూనే ఉన్నాయి. ఆ దశలో నా స్నేహితులతో కలిసి స్థిరాస్తి వ్యాపారంలో అడుగుపెట్టాను. దేవుడిదయ వల్ల బాగానే కలిసొచ్చింది.

అలా రోజులు గడుస్తుండగా 'చందమామ' సినిమా నా జీవితాన్ని ఒక్కసారిగా మార్చేసింది. స్నేహితులూ బంధువులూ అయినవాళ్లూ ఇన్నేళ్లుగా నన్ను ఎరిగినవాళ్లూ అందరూ ఆశ్చర్యపోవడమే.
'చందమామ'తో నా కెరీర్‌గ్రాఫ్‌ ఎక్కడికో వెళ్లిపోయింది.
ఆ సినిమాలో అవకాశం రావడానికి కారణం అంతకుముందు నేను చేసిన 'చంటిగాడు' అనే సినిమా. అందులో నేను విలన్‌ పాత్ర చేశాను. ఆ చిత్రదర్శకురాలు బి.జయ. ఆవిడ నా పాత్ర గురించి చెప్పగానే నా డైలాగులు గోదావరి యాసలో చెప్తానన్నాను. ఆవిడ సరేనన్నారు.
ఇంతకీ నాకు గోదావరి యాసమీద అంతపట్టు ఎలా వచ్చిందంటే... చిన్నప్పుడే మేమెలా కర్ణాటకలో సెటిలర్లుగా ఉన్నావో అలాగే గోదావరిజిల్లాల నుంచి వచ్చినవాళ్లు చాలా మంది ఉండేవారు. వాళ్లు ఆ యాసలో మాట్లాడుతుంటే నేనూ అలాగే మాట్లాడుతూ వాళ్లని ఆటపట్టించేవాడిని. అదీగాక, వంశీ నేనూ మామూలుగా కలుసుకున్నప్పుడు కూడా సరదాగా ఆ యాసలో జోకులేస్తుండేవాణ్ని. 'చందమామ' డిస్కషన్స్‌ జరుగుతున్నప్పుడు 'చంటిగాడు' సినిమా ఒకసారి టీవీలో వస్తుంటే అనుకోకుండా చూశాడు కృష్ణవంశీ. వెంటనే తన సినిమాలోనూ అదేయాసలో చెయ్యమని అడిగాడు. ఆ క్యారెక్టర్‌ ఎంత అద్భుతంగా పండిందో అందరికీ తెలిసిందే.
ఆ పాత్ర అనే కాదు... కృష్ణవంశీ ఎప్పుడూ చాలా విభిన్నంగా ఆలోచిస్తాడు. చలపతిరావులాంటి ఆర్టిస్ట్‌ని కామెడీ పాత్ర(నిన్నేపెళ్లాడతా)లో చూపించడం అనేది కృష్ణవంశీకే చెల్లింది. 'చందమామ' తర్వాత కొత్తబంగారులోకం, బెండు అప్పారావు, సిద్ధు ఫ్రమ్‌ శ్రీకాకుళం ఇలా చాలా సినిమాల్లో మంచిపాత్రలు చేసే అవకాశం వచ్చింది. ఆ సినిమా తర్వాత... 'మన సినిమాలో ప్రసాద్‌ ఉండాలి, తనతో కొత్తగా చేయించుకోవాలి' అని చాలామంది నిర్మాతలూ దర్శకులూ అనుకోవడం నా అదృష్టం. ఆ పేరును పాడు చేసుకోకూడదు. అదొక్కటే నా కోరిక.
'ఈ క్యారెక్టర్‌ ఆహుతిప్రసాద్‌ కాకుండా ఇంకొకడు చేసి ఉంటే బాగుండేదిరా' అని ఎప్పటికీ అనిపించుకోకుండా ఉండాలి, అంతే!

మాసొంతూరు కృష్ణాజిల్లాలోని ముదినేపల్లి పక్కనే ఉన్న కోడూరు. అక్కడ మాకు చాలా భూములుండేవి. ఆ వూళ్లోని జనార్దనస్వామి ఆలయం మా పూర్వీకులు కట్టించిందేనంటారు. ఆ స్వామి పేరే నాకు పెట్టారు. నేను పుట్టాక మా వాళ్లు కర్ణాటకకు వలసవెళ్లి అక్కడే స్థిరపడ్డారు. మేం కర్ణాటకలో ఉన్నప్పుడు అక్కడ ఉర్దూ కలగలిసిన భాష మాట్లాడేవాళ్లు. నిజానికి అది ఒకప్పుడు తెలంగాణలో భాగమే. రాయచూరు, గుల్బర్గా, బీదరు... ఇప్పటికీ ఈ మూడు జిల్లాలనూ అక్కడివాళ్లు 'హైదరాబాద్‌ కర్ణాటక' అంటారు. అదీగాక నా విద్యాభ్యాసం మిర్యాలగూడ, కోదాడల్లో కూడా జరగడంతో హిందీ బాగా వచ్చింది. అదే నాకు హిందీ సూర్యవంశంలో 'అమితాబ్‌' సరసన నటించే అవకాశాన్నిచ్చింది.

'చందమామ' సినిమాకి బెస్ట్‌ క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గా నంది అవార్డుతో పాటు, గుమ్మడి అవార్డు అందుకోవడం ఒక మధురానుభూతి. అనారోగ్యం కారణంగా ఆయన ఆ వేడుకకు రాలేకపోయారు. నేనా మెడల్‌ తీసుకుని గుమ్మడిగారింటికి వెళ్లి ఆయన చేతులమీదుగా నా మెడలో వేయించుకున్న క్షణాలు మరపురానివి.
చెన్నైలో ఉన్నప్పుడు సత్యారెడ్డిగారి దర్శకత్వంలో 'నాయకురాలు' అనే సినిమాలో నలుగురు హీరోల్లో ఒకడిగా చేశాను. మిగతా ముగ్గురూ నాగబాబు, భానుచందర్‌, హరి. నాయకురాలు శారద. హీరోయిన్‌ సీత. ఆ సినిమా అయ్యేటప్పటికి నాగబాబు, నేను మంచి స్నేహితులమయ్యాం. అప్పటికి వాళ్ల అమ్మానాన్నలు నెల్లూరులో ఉండేవారు. నాగబాబుతో కలిసి సరదాగా వాళ్లింటికి వెళ్లి నాలుగైదురోజులు అక్కడ గడిపేవాళ్లం. వెంకట్రావుగారికి నేనంటే చాలా ఇష్టం. 'ఆహుతి ప్రసాద్‌' అనే పేరు మార్చుకోమని ఆయన చాలాసేపు కూర్చోబెట్టి మరీ చెప్పారు.

దర్శకుల్లో కృష్ణవంశీ కాకుండా నాకున్న మరో మంచి స్నేహితుడు వి.వి.వినాయక్‌. 'చెప్పాలని ఉంది' అనే సినిమాకి అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా చేస్తున్నప్పటి నుంచి వినయ్‌ నాకు పరిచయం. ఏ సీన్‌ ఎంతవరకూ తియ్యాలో వినాయక్‌కి బాగా తెలుసు. 'ముందు తీసేసి, తర్వాత ఎడిటింగ్‌ రూములో చూసుకుందాంలే' అనుకోడు. తాను తీయబోయే సినిమాలో ప్రతీ సీన్‌ ముందుగానే తన మైండ్‌లో ఫిక్సయిపోయి ఉంటుంది. దానివల్ల బడ్జెట్‌ నియంత్రణలో ఉంటుంది. నిర్మాతలు క్షేమంగా ఉంటారు. వినాయక్‌ మంచి దర్శకుడే కాదు, మంచి నటుడు కూడా. 'భాగ్యరాజాలాగా మంచి స్క్రిప్టు రాసుకుని నువ్వే చేయెుచ్చు కదా' అంటే... 'చేస్తే కృష్ణవంశీ దర్శకత్వంలోనే చేస్తాను' అంటాడు.

3 comments:

  1. బాగుంది. ప్రసాద్ గారు మనకున్న మంచి నటుల్లో ఒకరు. చందమామ తరవాత ఇటీవల ఇంకో సినిమా .. అదేదో ఇంటరు రెసిడెన్షియల్ కాలేజిలో ప్రేమాయణం .. అందులో కూడా హీరోయిన్ తండ్రిగా చాలా బాగా చేశారు.

    ReplyDelete
  2. ఔనండీ, అది ‘కొత్తబంగారులోకం’ సినిమా. వంశీ డైరెక్షన్లో ఇప్పుడు చేస్తున్న ‘సరదాగా కాసేపు’ సినిమాలో కూడా మంచి క్యారెక్టర్ అని చెప్పారు.

    ReplyDelete
  3. మంచి నటుని మనసులో మాటలను తెలియజేశారు ధన్యవాదములు

    ReplyDelete