Friday, May 28, 2010

అన్ని సినిమాల్లో అవే పేర్లు...

వీరో అనగానే గోపీ... వీరోయిన్ రాధ... ఇనస్పెక్టర్ రంజిత్... కలెక్టర్ జానకి... ఇలా మన తెలుగు సినిమాల్లో పాత్రతల పేర్లకో పడికట్టు ఫార్ములా ఉంది. విలన్లందరూ సర్పభూషణ్రావ్, ఫణిభూషణ్రావు(ఇలాంటి పేర్లు మన సూపర్ స్టార్ సినిమాల్లో మరీ ఎక్కువ. కావాలంటే ఒక్కసారి కృష్ణ టోన్ లో పై రెండుపేర్లూ పలికి చూడండి), భుజంగం... ఇలా పామును స్ఫురింపజేసే ‘ఘనమైన’ పేర్లే.  తల్లి పాత్రధారులంతా శాంతమ్మలో జానకమ్మలో అయ్యుంటారు. హీరో కూసంత చిలిపివాడైతే గోపీ... సాత్వికుడూ, నెమ్మదస్తుడూ, బుద్ధిమంతుడూ గట్రా మంచి లక్షణాలుంటే రాము. కథనాయికల పేర్లు పాత్ర తీరుతెన్నుల్ని బట్టీ రాధ, సరోజ, సీత ఇలాగుండేవన్నమాట. ఇదంతా పాతసినిమాల సంగతి. ఇప్పటి దర్శకుల స్టైలే వేరు. ఒకే పేరుని దాదాపు తమ సినిమాలన్నింట్లోనూ కొనసాగిస్తున్నారు.


ఈ లిస్టులో మొదటిపేరు వి.ఎన్.ఆదిత్యది. ‘మన సంతా నువ్వే’  హిట్ మహత్యమో ఏమో కానీ... వేణు, అను, శృతి అనే పేర్లను ఆయన వదల్లేకపోతున్నట్టు కనిపిస్తోంది. ఆ సినిమాలో ఉదయ్ కిరణ్ పేరు వేణు. హీరోయిన్లు అను(రీమాసేన్), శృతి (తనూరాయ్). ఆ తర్వాత తీసిన ‘నేనున్నాను’, ‘బాస్’ సినిమాల్లోనూ నాయికానాయకుల నామధేయాలు అవే. ఆయనే తీసిన ‘మనసు మాట వినదు’లో ఒకే హీరోయిన్(రస్నా బేబీ అంకిత) పేరు అనూయే. ఆదిత్య సినిమాల్లో ఆ పేర్లు కనిపించనివి మూడే. ‘ఆట’ సినిమాలో ఇలియానా పేరు సత్య. తమిళ ‘దిల్’ రీమేక్ ‘శ్రీరామ్’లో కథానాయిక అనిత పాత్ర ‘మధు’. మొన్నామధ్య వచ్చిన ‘రెయిన్ బో’ చిత్రంలోనూ తన పేర్ల సెంటిమెంటును ఎంచేతనో అనుసరించలేదాయన.
వి.ఎన్.ఆదిత్య సినిమాల్లో కనిపించే మరో కొసమెరుపు... వేణు పాత్రధారి చివరకు పెళ్లి చేసుకునేది ‘అనూ’నే!


ఈవిషయంలో ఆదిత్యకు దీటుగా నిలిచే దర్శకుడు వి.వి.వినాయక్.  నందు, నందిని, సంధ్య... వినాయక్ చిత్రాల్లో కథానాయిక పేరు కచ్చితంగా ఈ మూడిట్లో ఏదో ఒకటి అయి ఉంటుంది. ‘ఆది’లో కీర్తీచావ్లా పేరు నందు. ‘దిల్’ సినిమాలో నేహ, ‘ఠాగూర్’లో జ్యోతిక పాత్రల పేర్లు నందినీయే. లక్ష్మి, యోగి సినిమాల్లో కథనాయిక నయనతార పేరు ఆ రెండు సినిమాల్లోనూ నందినీయే.  ‘సాంబ’ సినిమాలో భూమిక పేరు నందు. ఈ రెండు పేర్లనూ వదిలిపెడితే వినాయక్ మూడో ఛాయిస్.. సంధ్య అనే పేరు.  ‘సాంబ’లో జెనీలియా, ‘కృష్ణ’లో త్రిష పాత్రల పేర్లు అదే మరి. ఈ పేర్లు పెట్టకుండా వినాయక్ తీసిన సినిమాలు ‘చెన్నకేశవరెడ్డి(అందులో టబు పేరు సీత, శ్రియ పాత్ర పేరు ప్రీతి), బన్ని(గౌరీముంజల్ పేరు మహాలక్ష్మి).


వీళ్లిద్దరిలాగా ఒకే పేరు కాదుగానీ ఎక్కువసార్లు ఒకే పేరుపై మక్కువ చూపే దర్శకులున్నారు. కృష్ణవంశీ, రాజమౌళి ఈ కోవలోకి వస్తారు. ఉదాహరణకు కృష్ణవంశీ తీసిన నిన్నే పెళ్లాడతా, డేంజర్, చందమామ సినిమాల్లో హీరోయిన్ల కామన్ పేరు ‘మహాలక్ష్మి’. చక్రం సినిమాలో ఇద్దరు హీరోయిన్ల పేర్లూ ‘లక్ష్మి’నే. ‘ఖడ్గం’లో హీరోయిన్ సంగీత పేరు కూడా ఇదే. తెలుగుదనం ఉట్టిపడేట్టుగా ఉంటుందనో మరే కారణమో తెలీదుగానీ గురువుగారు ఎక్కువగా పెట్టే పేర్లు ఈ రెండే.
మగధీర విడుదలైనప్పుడు వివాదాల సుడిగుండంలో చిక్కుకుంది గుర్తుందా... ఆ సినిమా ‘చండేరీ’ అనే నవలకు కాపీ అనీ నవలలో కథనాయిక పేరు(ఇందు)నే సినిమాలో కాజల్ కి కూడా వాడేశారనీ రచయిత వాపోయారు. కానీ తరచి చూస్తే విజయేంద్రప్రసాద్, రాజమౌళి కాంబినేషన్లో వచ్చిన సినిమాలన్నింటిలోనూ ‘ఇందు’ అనే పేరు కామన్. ‘సై’లో జెనీలియా పేరు అదే. అంతకుముందొచ్చిన ‘సింహాద్రి’ సినిమాలోనూ భూమిక పేరు అదే. మరి ‘మగధీర’ హీరోయిన్ పేరు ‘ఇందు’ కావడంలో పెద్ద ఆశ్చర్యం లేదు ఏమంటారు!


ఇలా వ్యక్తిగతంగా దర్శకులూ రచయితల అభిరుచులే పాత్రధారుల పేర్లను నిర్ణయించడం ఒక పద్ధతి. దానికి భిన్నం ‘రాజశ్రీ ప్రొడక్షన్స్’ వారి పద్ధతి. ‘మైనే ప్యార్ కియా’ నుంచి వారి సినీమాల్లో హీరోగారి శాశ్వతనామధేయం... ప్రేమ్.
హమ్ ఆప్ కే హై కౌన్, హమ్ సాథ్ సాథ్ హై, వివాహ్... ఇలా సినిమా పేరేదైనా కావొచ్చు. సల్మాన్ ఖాన్, షారుక్ ఖాన్, హృతిక్ రోషన్, షాహిద్ కపూర్.. ఆ సినిమాల్లో హీరో ఎవరైనా కావొచ్చు. రాజశ్రీ బ్యానర్ మీద బర్జాత్యాలు తీసే సినిమాల్లో కథనాయకుడు మాత్రం ప్రేమే. వాళ్లు తీసిన ‘మై ప్రేమ్ కీ దీవానీ హూ’ అనే సినిమాలో అయితే ఇద్దరు హీరోల పేర్లూ(హృతిక్, అభిషేక్) అదే. ఒకరు ప్రేమ్ కిషన్ అయితే, మరొకరు ప్రేమ్ కుమార్. ఆ పేరుతో సాగే డ్రామానే సినిమా కథాంశం.
     ఇందులో ఇంకో విశేషమూ ఉందండోయ్. రాజశ్రీ బ్యానర్లో తాను చేసిన సినిమాలు హిట్లయిన ప్రభావమో ఏమో కానీ ‘ప్రేమ్’ అనే పేరు తనకు బాగా కలిసొచ్చినట్టు ఫిక్సయిపోయాడు సల్మాన్ ఖాన్. అత్యధికంగా 11 సినిమాల్లో అతని పేరు అదే. ఇక పరిశ్రమలో అతని ప్రత్యర్థి షారుక్ ఖాన్ తక్కువేం తినలేదు. కింగ్ ఖాన్ సినిమాల్లో ఎక్కువసార్లు అతని పేరు రాజ్, రాహుల్... ఈ రెండింట్లో ఏదో ఒకటి అయి ఉంటుంది. అతనాపేరుతో నటించిన సినిమాలు దాదాపుగా అన్నీ హిట్టయ్యాయి మరి. సినిమా వాళ్లు సెంటిమెంటుగతజీవులు అనడానికి ఇంతకన్నా ఉదాహరణ అక్కర్లేదేమో!

8 comments:

  1. కొత్తపాళీగారూ... మీరు ఇలా ఇక్కడ నా బ్లాగులో... ధన్యోస్మి.

    ReplyDelete
  2. రాజ్‌కపూర్ చాలా సినిమాల్లో అతని పేరు రాజ్. అమితాభ్ బచ్చన్ యాంగ్రీ యంగ్‌మాన్‌గా విజృంభిస్తున్న రోజుల్లో దాదాపు అన్ని సినిమాల్లోనూ అతని పేరు విజయ్ అని ఉండేది.

    ReplyDelete
  3. జంపాల చౌదరిగారూ నమస్కారం,
    అవునండీ, నిజమే. అమితాబ్-విజయ్ కాంబినేషన్ తెలుసుగానీ ఈ టపా రాసేటప్పుడు ఆ విషయమే గుర్తుకురాలేదు. :)

    ReplyDelete
  4. మహేష్ కి అజయ్ అన్న పేరుపై ఉన్న సెంటిమెంటు గురించి చెప్పలేదు.
    ఆ విషయం ఏమో గానీ మొత్తం బ్లాగంతా చాలా బాగా రాస్తున్నారు. ఇన్నాళ్లూ మీ బ్లాగు నేనెలా మిస్సయ్యానో అర్ధమవ్వడం లేదు.

    ReplyDelete
  5. బలే ఉన్నాయి మీ findings
    అలాగే ANR కి గోపి, వేణు...చాలా కామన్ గా ఉంటాయి.

    ReplyDelete
  6. నాగభూషణుడు అంటే శివుడు కదా. సినిమాలలోకి వచ్చేసరికి నాగభూషణం అనేది విలన్ పేరు అయిపోతుంది.

    ReplyDelete
  7. షోలే సినిమాలో అమితాబ్ బచ్చన్ పేరు జైదేవ్. పేరూ, పాత్ర రెండూ భిన్నమైనవే. హిందీ సినిమాలలో బందిపోట్లు అందరికీ పేరు చివర సింగ్ (సింహం) అని ఉంటుంది. నిజ జీవితంలో చంబల్ లోయలో హరిబాబా, నిర్భయ్ గుజ్జార్ వంటి కరడుగట్టిన బందిపోట్లు ఉండేవాళ్ళు. వాళ్ళ పేరు చివర సింగ్ లేదు. మాన్ సింగ్ లాంటి కొంత మంది నిజ జీవిత బందిపోట్లకి మాత్రం పేరు చివర సింగ్ అని ఉండేది.

    ReplyDelete