Saturday, April 9, 2011

శక్తి సినిమా ఎందుకు ఫ్లాపయ్యిందంటే...

బ్లాగుల్లో ఎంతమంది చెప్తున్నా శక్తి సినిమా చూసే సాహసం చేసేశాను. దీనిక్కారణం నాకు ఫ్యాంటసీ సినిమాలంటే ఇష్టం కాబట్టి.
అంజి సినిమా చూశాక ఎలాంటి ఫీలింగ్ కలిగిందో శక్తి చూశాక కూడా అలాగే అనిపించింది.
రెంటిలోనూ కామన్ పాయింటు... సినిమా మొత్తం హీరో ప్యాసివ్ గా ఉండిపోవడం.
అందులో చిరంజీవి ఆత్మలింగం కోసం ఎలాంటి ప్రయత్నాలూ చేయడు. అతని ప్రమేయం లేకుండానే దొరుకుతుంది. దొరికాకైనా దాంతో ఏమైనా చేస్తాడా అంటే చేయడు. భద్రంగా గూడేనికి తీసుకొచ్చి నాగబాబు గుడిసెలో దాస్తాడు. విలన్ వచ్చాక పిల్లల్ని కిడ్నాప్ చేసి కథ నడిపిస్తాడు. సినిమా మొత్తానికీ హీరో ఏమైనా చేశాడా అని తరచి చూస్తే ప్చ్! ఏం కనిపించదు.
ఎవడో కథ నడిపిస్తుంటే దానివెంట హీరోపోతుంటే చూడబుద్ధేయదు. కనీసం... చిరంజీవి, జూనియర్ ఎన్టీఆర్ లాంటి మాస్ హీరోల విషయంలో.
శక్తిలోనూ అంతే. ఫస్టాఫ్ అంతా హీరోయిన్ వెంటపడి ఆమె ఎక్కడికి పోతే అక్కడికి పోతుంటాడు జూనియర్. పోనీ సెకండాఫ్ లో విషయమేదైనా ఉందా అంటే అదీ లేదు. రుద్రశూలాన్ని ఉపయోగించి హంపిలోని అధిష్ఠాన శక్తిపీఠానికి (ఇది అష్టాదశ శక్తిపీఠాలకూ మూలపీఠం అని కథారచయిత కల్పన) చేరుకునే సీన్లు చాలా పేలవంగా అనిపిస్తాయి. క్లైమాక్స్ కు అరగంట ముందు దాకా హీరోకి ఒక లక్ష్యం ఉండదు. గాలి ఎటు వీస్తే అటు పోతుంటాడు.
ఇలా హీరో ప్యాసివ్ గా ఉంటే ఏం నచ్చుతుందీ!

దీన్ని రివర్సులో చూద్దాం.
ఒక్కడు, దిల్, ఇడియట్... పాతసినిమాలు తీసుకుంటే విజేత, మగమహారాజు,
ఇంకా నాకు పేర్లు అంతగా గుర్తురావడంలేదుగానీ, ఇలా హిట్టయిన సినిమా దేన్ని తీసుకున్నా కథ బలంగా ఉంటుంది. దాన్ని నడిపించే మెయిన్ క్యారెక్టర్ హీరోనే అయి ఉంటాడు.
ఇదంతా నా అనుకోలు మాత్రమే. నా థీరీకి కూడా కొన్ని ఎక్సెప్షన్లు ఉండొచ్చు. కథ అత్యద్భుతంగా ఉంటే ఈ లాజిక్కులేవీ పనిచేయకపోవచ్చు కూడా. హీరో డమ్మీ అయినా నడిచిపోతుంది. ఉదాహరణకు... బొమ్మరిల్లు.
(బొమ్మరిల్లు కథ మరీ అంత ఎక్ట్రార్డినరీనా అని నా మీదకు పోట్లాటకు దిగద్దండోయ్! అది నా సొంత అభిప్రాయం మాత్రమే).

థియేటరుకి వెళ్లి చూసేకన్నా... ఐదారునెల్లు ఆగితే టీవీలో వస్తుంది. అలా వచ్చినప్పుడు హాయిగా ఇంట్లోనే పడక్కుర్చీలో కూర్చుని చూడొచ్చు.

18 comments:

  1. pch.. మరో 'భారీ' ఫ్లాప్..

    ReplyDelete
  2. చిరంజీవికీ, జూనియర్ కూ పోలికేమిటండీ? జూనియర్ కు చిరంజీవి స్థాయికి చేరేంత సీను ఉందని(ఎప్పటికయినా వస్తుందని) నేననుకోవడంలేదు

    ReplyDelete
  3. మీ అభిప్రాయాలు చదూతుంటే ఇప్పుడే చిన్న బల్బు వెలిగింది. అలనాటి పాతాళభైరవిలోనూ సరిగ్గా ఇదే పరిస్థితి. హీరో తాను పనిగట్టుకుని ఏదీ చెయ్యడు. ముందు విధి (రాజుగారు, రాజకుమారి) తరవాత విలన్ చేసే పనులకి ప్రతిగానే హీరో అడుగులు నిర్దేశించబడతాయ్. అతను పాతాళభైరవి శక్తిని సాధించడం కూడా అలాగే యాదృఛ్ఛికంగా జరుగుతుంది. కానీ అప్పుడది సూపర్ హిట్టు - ఇప్పుడివి ఫ్లాపులు.

    ReplyDelete
  4. @అజ్ఞాత: అవును చిరంజీవికీ, జూనియర్ కీ పోలికేమిటీ, తెలుగుదేశం పార్టీని ఎప్పటికీ కాంగ్రెస్లో కలపలేడు.

    ReplyDelete
  5. రాజకీయాలు పక్కన పెడితే చిరంజీవిని చేరుకోవాలంటే జూనియర్‌కి ఇప్పట్లో సాధ్యం కాకపోవచ్చు.

    ReplyDelete
  6. చిరంజీవి సినేమాలలో ఎంత పేరు తెచ్చుకొన్నాడో దానితో అతనికి వచ్చిన "విలువ" ఎమైనా ఉందంటె అది కాంగ్రేస్ పార్టీలో చేరటం ద్వారా మొత్తం పోయింది. అదికాక తప్పు మీద మీద తప్పులు చేస్తూ పోతూన్నాడు. అతను రాజకీయాలలో మనలేను అని అనుకొని ఉంటె కనీసం యం యల్ ఏ లను ఆపార్టిలో చేరిపించి ఇతను గమ్ముగా ఉండవలసినది. అలా చేయకుండా రాబోయే ఎన్నికలలో ఇతనికి మంచి ప్రాముఖ్యత ఉన్న పోస్ట్ ఇస్తారని పేపర్లు రాయటం ద్వారా అతను అనవసరంగా అధికారానికి అమ్ముడయిన వ్యక్తి లాగా అనిపిస్తున్నాది. అదేకాక ఇప్పటి వరకు అతనికి ఆపార్టిలో జాయిన్ అయిన తరువాత జరిగిన లాభం ఒక్కటి లేదు. ఇతను ఎదో కొంపలు మునిగిపోతున్నట్లు ఆ పార్టిలొ విలీనం గురించి ప్రకటించాడు.

    SRI

    ReplyDelete
  7. @jaggampeta
    : )

    మురళిగారు... ప్చ్!

    కొత్తపాళీగారూ,
    నేను ఊహించాను, కొందరికైనా ఈ పొలిక గుర్తొస్తుందని. అయితే, నా టపా చదివాక ఎంత మందికి ఆ సినిమా గుర్తొస్తుందో చూద్దామనే ప్రస్తావించలేదు. ఆ సినిమా కె.వి.రెడ్డి దర్శకత్వ ప్రతిభే.
    వేణువు వేణుగారితో ఈ సినిమా గురించి మాట్లాడుతున్నప్పుడే కె.వి.రెడ్డిగారి గురించి, ఆయన సినిమాల గురించి ప్రస్తావించాను.
    పాతాళభైరవిలో హీరో ప్యాసివ్ గా కనిపించే యాక్టివ్ క్యారెక్టర్.
    సినిమా మొదట్లోనే తోటరాముడికి ఒక లక్ష్యాన్ని నిర్దేశిస్తాడు దర్శకుడు.
    ఆ లక్ష్యం... రాకుమారిని పొందడం. అందుకోసం ఏమైనా చేయడానికి సిద్ధం వాడు(ఈ పదం ఎన్టీఆర్ని ఉద్దేశించి కాదు, తోటరాముణ్ని ఉద్దేశించి:)).
    ‘సాహసం శాయరా డింభకా’ అని మాంత్రికుడు ప్రేరేపించినప్పుడల్లా ఎంతకైనా తెగిస్తాడు. ప్రేక్షకులు కూడా దాన్ని సాహసంగానే పరిగణిస్తారు(పరిగణించారు కూడా).
    హీరోకి సాహసం ఉచితమే కాబట్టి చెల్లిపోయింది.
    ఇక పాతాళభైరవి బొమ్మ మళ్లీ మాంత్రికుడి చేతుల్లోకి వెళ్లాక... ఇంకేముందీ, క్లైమాక్స్.
    చివరాఖర్లో విలన్ హీరోని ప్రతిఘటించడం, హీరో నెగ్గడం... రొటీన్ కమర్షియల్ ఫార్ములా. బ్రహ్మాండంగా వర్కవుట్ అయిపోయింది.
    మీరు కావాలంటే చూడండి, కె.వి.రెడ్డి సినిమాలన్నింటిలోనూ హీరో దుడుగ్గానే ఉంటాడు.
    దొంగరాముడులో అక్కినేని, గుణసుందరి కథలో కమెడియన్ శివరావు(నాకు భలే ఇష్టం ఈ సినిమా. ఇప్పటికి ఎన్నిసార్లు చూశానో లెక్కలేదు),
    జగదేక వీరుని కథలో ఎన్టీఆర్, మాయాబజార్లో మళ్లీ అక్కినేని నాగేశ్వరరావు(ఘటోత్కచుడి పాత్రలో ఎస్వీఆరూ)...
    ఆయన హీరోలందరి శైలీ అంతే. దటీజ్ కె.వి.రెడ్డి స్టైల్.
    మొత్తానికి నా ఆలోచనకు బాగా దగ్గరగా వచ్చారు.

    కృష్ణగారూ (KRISHNA'S చెప్పు దెబ్బలు-పూలదండలు)
    మీతో నూటికి నూరుపాళ్లూ ఏకీభవిస్తాను.

    ఇహపోతే, అజ్ఞాతలకు...
    వాళ్లిద్దరికీ పోలిక పెట్టడం నా ఉద్దేశం కాదు. అలాంటి మాస్ హీరోలు అని నా ఉద్దేశం.
    అన్నగారి(సీనియర్ ఎన్టీఆర్)కీ చిరంజీవికీ పోటీ పెట్టగలమా? పోలిక తేగలమా?
    ఇద్దరివీ వేర్వేరు జనరేషన్లు. చిరు, జూనియర్ల విషయమూ అంతే.
    దయచేసి విషయాన్ని పక్కదోవ పట్టించవద్దు.

    ReplyDelete
  8. శక్తి సినిమా నేను చూడలేదు కాని, టి వి లో ట్రైలర్ చూసాకా ఖలేజా గుర్తొచ్చింది.
    అందుకే ఫ్లాప్ అయ్యుంటుంది.

    ReplyDelete
  9. విజయా వారి ‘చంద్రహారం’లో హీరో ఎన్టీఆర్ సినిమా సగం గడిచిందాకా నిద్రపోతూనే ఉంటాడు (దర్శకుడు కమలాకర కామేశ్వరరావు). ఆ చిత్రం చూస్తున్న చక్రపాణి, నాగిరెడ్డి గార్లకు ‘హీరో ఇంటర్వెల్ కైనా లేస్తాడా?’ అనే ప్రేక్షకుల వ్యాఖ్య సూటిగా తగిలి, సినిమా ఫలితం అప్పుడే తెలిసిపోయిందట.

    ఏ చిత్రంలోనైనా హీరో పాసివ్ గా ఉండటమంటే అది ‘నిద్రపోవటం’తో సమానమే అనుకోవచ్చు!:))

    ReplyDelete
  10. వేణుగారూ,
    భలే గుర్తుచేశారండీ. నేనసలు మర్చేపోయానా సినిమాని. ప్యాసివ్ హీరో సినిమాలన్నింటిలోకీ పరాకాష్ట ఆ సినిమా. :)

    ReplyDelete
  11. వేణు, అవును, బాగా చెప్పారు! ఈ సంగతి "చక్రపాణీయం" పుస్తకంలో చదివా నేను కూడా!

    ఎంతయినా, బాలూ గారికి సాహసాలెక్కువే సుమా!

    ReplyDelete
  12. బోనగిరిగారూ నేనలా అనుకుని ఊరుకోలేనండీ, బాలేదూ అంటే ఎందుకు బాగులేదూ అని తెలుసుకునేదాకా మనశ్శాంతిగా ఉండి చావదు. ఈ ప్రయత్నంలో చాలాసార్లు కన్ను లొట్టబోతూనే ఉంటుంది.

    సుజాతగారూ
    అవును, ప్రతిసారీ ఈ సాహసం చెయ్యొద్దు అనుకుంటాగానీ... నేలకుపోయేదాన్ని నెత్తికి రాసుకోవడం అలవాటైపోయింది. ప్చ్!!

    ReplyDelete
  13. పైన చర్చ అంతా చదివాక నాకు చంద్రహారం సినిమావే గుర్తొచ్చింది, వేణూ గారు అదే చెప్పరు. ఆలాగే అర్థాంగి సినిమాలో నాగేశ్వర్రావు పాత్ర కూడా చాలా పేసివ్ గా ఉంటుంది.

    పాతాళభైరవి సినిమా విషయానికొస్తే హీరో పేసివ్ గా ఉన్నా యెస్వీఆర్ మొత్తం కథని నడిపించేస్తారు. ఈ సినిమాలో తోటరాముడికన్నా నేపాళ మాంత్రికుడికే లక్ష్యం, దిశా నిర్డేశం ఉంటాయి. ఇంక నటనా చాతుర్యంతో రంగారావుగారు మొత్త క్రెడిట్ కొట్టేస్తారు. ప్రేక్షకులని మైమరపించి సినిమాలో లీనమైపోయేలా చేస్తారు. ప్రతి ప్రేక్షకుడు దృష్తి సినిమా చూస్తున్నంత సేపూ మాంత్రికుడిమీదే ఉంటుంది. కథా బలం కూడా ఉంది కాబట్టి సినిమా సూపరు డూపరు హిట్టు.

    ReplyDelete
  14. సౌమ్యగారూ
    అవును, అర్ధాంగిలోనూ అంతే హీరో.
    ‘తోడికోడళ్లు’లో కూడా నాగేశ్వరరావు పాత్ర అంతే. మొత్తం సినిమానీ సూర్యకాంతం ఒంటి(పుర్ర)చేతిమీద నడిపించేస్తుంది. విలన్ పాత్రలో మరికొంత వాట జగ్గయ్యకూ పంచొచ్చు అందులో.

    ReplyDelete
  15. అర్థాంగి సినిమాలో నాగేశ్వర్రావు మతి స్థిమితం లేని వ్యక్తి! అతడిని భార్య నెమ్మదిగా దారి లో పెట్టిన తర్వాత కూడా ఆ పాత్రకి భార్య సహకారం అణువణువునా కావాలి. ఆ పాత్రని ఈ పాత్రలతో పోల్చి పాసివ్ అనలేం!

    ReplyDelete
  16. పోల్చకపోతే సరి :)

    ReplyDelete
  17. సుజాత గారు,అర్థాంగి సినిమాలో అక్కినేని మతిస్థిమితం లేని వ్యక్తికాదండోయ్.చిన్నప్పటినుంచి ఆయా పనులకు అడ్దం వస్తున్నాడని నల్లమందుఅలవాటుచేసే సరికి మత్తుగా అదో మాలోకంలా ఉంటాడు.
    పాసివ్ హీరో అంటే పాతసినిమాలలో చాలా ఉన్నాయి.స్త్రీ సాహసం సినిమాలో అంజలీ దేవే హీరోయినూ హీరోనూ నాగేశ్వర్రావు సినిమాలో ఉంటాడంతే.అదేదో సినిమాలో కథానాయకుడు ఎన్టీఆర్ ఎంటరయ్యాక సరిగ్గా పదినిమిషాల్లో విశ్రాంతి దొరుకుతుంది మనకు.
    సాక్షి,అమాయకుడు,సిరిమల్లెనవ్వింది ఇలా చాలా సినిమాల్లో కృష్ణ పాసివే అయితే చివరకు హిలన్ని చితగ్గొడతాడు అదివేరే విషయం.
    కథకు తగ్గట్టు ఆరోజుల్లో హీరోలు తగ్గుండేవాళ్ళు ఇవ్వాళ హీరోలున్నారుగానీ పాపం కథలే లేవు.

    ReplyDelete