Tuesday, November 23, 2010

నలుపు, తెలుపు, కొంచెం కలరు.... తనికెళ్ల భరణి ఇంటర్వ్యూ

తనికెళ్ల భరణి అంటే నాకు చాలా ఇష్టం.
నటుడిగా కన్నా రచయితగా ఇంకా బోలెడంత ఇష్టం.
పద్యాలు అలవోకగా చెప్పే ఆయన కవితా ధార అంటే ఇంకా చాలా చాలా ఇష్టం.
మాటలతో ఆయన ఆడుకునే తీరంటే ఇంకా చాలాచాలాచాలా చాలాచాలాచాలాచాలా ఇష్టం.
 హాసంలో ఆయన రాసిన ‘ఎందరో మహానుభావులు’ చదివి చాలా ఆశ్చర్యపోయాను. 
తర్వాత ఆయన సాహితీఅభిలాష గురించి తెలుసుకుని అభిమానినైపోయాను.
అలాంటిది ఆయన్ని ఇంటర్వ్యూ చేసే అవకాశం రావడం అంటే ఎగిరి గంతేయలేదుకానీ... 
మనసులో అంతపనీ చేశాను. ఆయనతో ఏం చెప్పిస్తే బాగుంటుంది... 
ఆయన సాహిత్యాభిమానం గురించి ఇప్పటికే చాలాచోట్ల పుంఖాను పుంఖాలుగా చెప్పేశారు. 
వ్యక్తిగత జీవితం గురించీ అడపాదడపా చెప్పేశారు.  కాబట్టి కాసేపు ఆలోచించాను.
ఏదడిగినా సరిగ్గా మాట్లాడని వ్యక్తుల దగ్గరికైతే ప్రిపరేషన్ తో వెళ్లాలి కానీ, భరణిలాంటి ప్రతిభావంతుల దగ్గరికెళ్లేటప్పడు ప్రిపరేషన్ కన్నా స్పాంటేనియస్గా మాట్లాడ్డమే కరెక్ట్ అనిపించింది.
సో, ఏం తేల్చుకోకుండానే ఆయనింటికి వెళ్లిపోయాను.

గేటు పక్కగా ఉన్న నేమ్ బోర్డు మీద ఆయన ఇంటి పేరు కనిపించింది... ‘సౌందర్య లహరి’ అని.
జగద్గురువు ఆదిశంకరాచార్యులవారి రచన అది. ఆహా, ఎంతైనా భరణిగారు కదా అనిపించింది.
సరే, పైకెళ్లాను. వెళ్లిన కొద్దిసేపటికి  పక్కా మన పక్కింటాయనలా లుంగీ పాతచొక్కాతో బయటికొచ్చారు.
కుశలప్రశ్నలయ్యాక దేనికీ ఆర్టికల్ అని అడిగారు. సండే మ్యాగజైన్ కోసం అని చెప్పాను. 
నా మనసులో మాట అర్థమైనట్టు... ‘నా వ్యక్తిగత జీవితం గురించి చాలాసార్లే చెప్పాను కదా... 
ఈసారి కొత్తగా ఏమైనా చేద్దామా’ అన్నారాయన. 
       

సడన్ గా అప్పటికప్పడు ఈ వెధవ బుర్రకి ఒక ఐడియా తట్టింది. అదేంటంటే... ఆయన నాటక రచయితగా సినిమా రంగానికి వచ్చారు. సినిమా నిర్మాణంలో దర్శకుడికీ రచయితకీ వేవ్ లెంత్ సరిగ్గా కుదరకపోతే అది ఫట్టే కాబట్టి ఎందరో దర్శకులతో పనిచేసిన  అనుభవాలను చెప్పిద్దామన్న ఐడియా తట్టింది. మనసులోనే వరసపెట్టి నాలుగైదు వీరతాళ్లు నాకునేనే వేసేసుకుని విషయం ఆయనకి చెప్పాను. ‘బావుంది, బావుంది... మంచి ఆలోచన’ అంటూ పెన్నూ పేపరూ పట్టుకుని వరసగా పేర్లు రాయడం మొదలుపెట్టారు. పూజారి పూజచేస్తుంటే చూసే భక్తుడిలా శ్రద్ధగా తలవంచి ఆయన ఏం రాస్తున్నారో చూస్తున్నా. ఏడు పేర్లు రాసి పెన్ను పక్కన పెట్టారు. వీళ్ల గురించి చెప్తాను అని పేపర్ నా చేతికిచ్చారు. ‘అయితే ఓకే’ అనగానే మొదలెట్టారు. నేను  వాయిస్ రికార్డర్ ఆన్ చేశాను. ఆ తర్వాత...
మీరే చదవండి.....
***********************************************

చిన్నప్పటి నుంచి నాకు లెక్కలంటే భయం. ఆ భయాన్ని తెలుగుమీద ఇష్టంగా మార్చుకున్నాను. సిగరెట్లకు ఆశుకవిత్వం చెప్పడంతో వెుదలుపెట్టి క్రమంగా నాటకాలు రాశాను, ఆ నాటకాల ద్వారా రాళ్లపల్లిగారితో పరిచయం అయితే, ఆ పరిచయం సినీరంగ ప్రవేశానికి నాంది అయింది. చిత్రపరిశ్రమలోకి వచ్చాక రచయితగా నాకు బ్రేక్‌ ఇచ్చిన వ్యక్తి... వంశీ.

వంశీ
నేను మద్రాసులో రాళ్లపల్లిగారింట్లో ఉన్నప్పుడు ప్రసాద్‌ ల్యాబ్స్‌లో ఎడిటింగ్‌ జరుగుతోంది. నన్ను పరిచయం చేస్తానని చెప్పి ఒకరోజు పొద్దున్నే ఆయన దగ్గరకు తీసుకెళ్లారు రాళ్లపల్లి. మేం లోపలికెళ్లేటప్పటికి మూవీయోలాలో 'గోపెమ్మ చేతిలో గోరుముద్ద' పాట చూసుకుంటున్నారు వంశీ. పరిచయాలయ్యాక... 'కామెడీ రాస్తావా' అన్నారు వంశీ. రాస్తానన్నాను. ఆయన నాకొక సిట్యుయేషన్‌ చెప్పి 'ఒకవారం రోజులు టైం తీస్కొని, ఏడు సీన్లు రాయండి' అన్నారు. సరేనని ఇంటికెళ్లి సాయంత్రానికల్లా ఏడు సీన్లు రాసుకుని తీసుకెళ్లాను. ఒక్కొక్కసీన్‌ చెప్తుంటే పగలబడి నవ్వారు వంశీ. చెప్పడం పూర్తయ్యాక 'మీరే నా తర్వాత సినిమా రచయిత' అన్నారు. అప్పటికే 'ప్రేమించుపెళ్లాడు' షూటింగ్‌ పూర్తయిపోయింది. కానీ దానికి నాతో ఏదైనా రాయించాలని పట్టుబట్టి టైటిల్స్‌కు ముందు ఒక కామెడీట్రాక్‌ రాయించుకున్నారు. ఆ సినిమాకి రావోజీరావుగారు నాకు 2000 రూపాయలు పారితోషికం పంపించారు. ట్రాజెడీ ఏంటంటే... ఆ డబ్బుల్ని రాళ్లపల్లిగారి అసిస్టెంట్‌ కొట్టేశాడు.

తర్వాత వంశీ 'ఆలాపన' సినిమాకి మాటలు రాశాను. అప్పట్లోనే ఆయన 'లేడీస్‌ టైలర్‌' కథ చెప్పారు. ఆ సినిమాతో మా కాంబినేషన్‌ సెన్సేషనల్‌ అయిపోయింది. వరసపెట్టి కనకమాలక్ష్మీ రికార్డింగ్‌ డాన్స్‌ట్రూప్‌, చెట్టుకింద ప్లీడర్‌, లింగబాబు లవ్‌స్టోరీ... ఇలా చాలా సినిమాలు చేశాం. 'లేడీస్‌టైలర్‌' తీసేటప్పుడు నేను ఆర్టిస్టులకు డైలాగులు చెబుతుంటే చూసి 'మీలో మంచి ఆర్టిస్ట్‌ ఉన్నాడండీ' అన్నారు వంశీ. నేను రంగస్థల నటుణ్ని అనే విషయం తెలీదాయనకి. 'నేను నాటకాలు వేసేవాణ్నండీ' అన్నాను. 'ఔనా, మరి నాకెందుకు చెప్పలేదు' అంటూ తన తర్వాత సినిమా 'కనకమాలక్ష్మీ రికార్డింగ్‌డాన్స్‌ ట్రూప్‌'లో దొరబాబు క్యారెక్టర్‌ ఇచ్చారు. ఆ సినిమాలోని 'సీతతో అదంత వీజీకాదు' అనే డైలాగ్‌తో బాగా పాపులరయిపోయాను.

క్రాంతికుమార్‌
క్రాంతిగారిని అందరూ 'సింహం' అనేవాళ్లు. ఆయన గురించి కథలుకథలుగా చెప్పి భయపెట్టేవారు. రాళ్లపల్లిగారు అప్పుడప్పుడూ ఆయనదగ్గరికి వెళ్తూ నన్ను కూడా రమ్మనేవారుగానీ భయంతో వెళ్లేవాణ్నికాదు. ఒకసారి... వేమూరిసత్యంగారితో కలిసి తప్పనిసరి పరిస్థితుల్లో వెళ్లాను. మేమెళ్లేసరికి క్రాంతికుమార్‌ సిగరెట్‌ కాలుస్తున్నారు. నాకూ ఆ అలవాటుంది. మిగతావాళ్లంతా ఆయనముందు సిగరెట్‌ తాగేవారు కాదు. ఒకసారి నా ముఖం చూసి 'ఏఁవయ్యా, సిగరెట్‌ తాగుతావా' అన్నారు క్రాంతిగారు. తాగుతానన్నాను. 'తీస్కో' అంటూ పెట్టె నా ముందుకి తోశారు. అప్పట్నుంచి మేం సిగరెట్‌ ఫ్రెండ్స్‌ అయ్యాం. ఎన్నో వందల సాయంత్రాలు ఆయనతో గడిపాను. ఆ సమయంలోనే 'శారదాంబ' కథ పుట్టింది. దానికి కథ, మాటలు రాశాను. అందులో 'బేబీరావు' అనే నీచమైన క్యారెక్టర్‌ చేశాను. 'సీతారామయ్యగారి మనవరాలు', '9నెలలు' సినిమాల్లో ప్రేక్షకులకు గుర్తుండిపోయే క్యారెక్టర్లు ఇచ్చారాయన.

రాంగోపాల్‌వర్మ
'రావుగారిల్లు' సినిమా షూటింగ్‌ జరుగుతున్నప్పుడు శివనాగేశ్వరరావు ద్వారా పరిచయమయ్యాడు రాంగోపాల్‌వర్మ. అప్పట్లో తను ఇంగ్లిష్‌ బాగా మాట్లాడేవాడు. అందుకని 'వీడు ఇంగ్లీషు మీడియం వాడు' అన్నారు పక్కనున్నవాళ్లు వేళాకోళంగా. పరిచయం పెరిగేకొద్దీ రామూనేనూ బాగా కనెక్టయ్యాం. ఒకసారి రాము దగ్గర్నుంచి కలవమని ఫోనొస్తే వెళ్లాను. నేనెళ్లేసరికి అన్నపూర్ణస్టూడియోస్‌లోని ఆఫీసులో డైరెక్టర్‌ కుర్చీలో కూర్చుని ఉన్నాడు తను. అదేంటన్నట్టుగా చూస్తే 'నేను సినిమా డైరెక్ట్‌ చేస్తున్నాను' అన్నాడు.
'అప్పుడేనా' అన్నాను. 'నువ్వు నా సినిమాకి రాస్తావో లేదో తెలీదుకానీ, నీ కంపెనీ నాకు బావుంటుంది' అన్నాడు రాము. తర్వాత 'శివ' సినిమా కథ చెప్పాడు. కొద్దిరోజుల తర్వాత ఫస్టాఫ్‌ డైలాగులు రాసి తీసుకెళ్లాను. అప్పటికి వంశీవి చాలా సినిమాలు చేసిన ప్రభావం నా మీద బాగా ఉంది. వెుత్తం కామెడీతో నింపేశాను. ఆ స్క్రిప్టు చూసి షాకయ్యాడు వర్మ.
'ఇదేంటి కామెడీ సినిమా చేశారు, నాది సీరియస్‌ సినిమా, ఒక్క కామెడీ డైలాగ్‌ కూడా ఉండటానికి వీల్లేదు' అన్నాడు.

'అయితే ఇది ఫ్లాపేనేవో' అనుకుని తను అడిగినట్టు రాశాను. ఆ సినిమా ఎంత పెద్ద హిట్టో అందరికీ తెలిసిందే. అందులో 'నానాజీ' క్యారెక్టర్‌కి ముందు నన్ను అనుకోలేదు. వేరెవరో నటుడిని అనుకున్నారు, కానీ అతను కాల్షీట్లు లేవన్నాడు. నేను స్క్రిప్టు రాసిచ్చాక అప్పుడప్పుడూ సరదాగా షూటింగ్‌కి వెళ్తుండేవాణ్ని. ఒకరోజు రామ్‌గోపాల్‌వర్మ 'భరణీ, నానాజీ వేషం మీరే వేసెయ్యండి' అన్నాడు ఉన్నట్టుండి. నావైపొకసారి చూసి 'ఈ గెటప్‌ ఓకే నాకు' అన్నాడు. అప్పట్లో నేను లాల్చీ జీన్స్‌పాంట్‌ వేస్తుండేవాణ్ని. పాన్‌, సిగరెట్‌ సరేసరి. కానీ, స్క్రిప్టు రాయడం వల్ల... ఆ పాత్ర ఎలా ఉండాలో నాకొక ఐడియా మనసులో ఉంది. అదొక తెలంగాణ ప్రాంతపు యాదవ యువకుడి వేషం. నేనిక్కడే పుట్టిపెరిగినవాణ్ని. ఇక్కడి సంస్కృతి నాకు బాగా తెలుసు. అందుకని కొద్దిసేపటితర్వాత లాల్చీ, పైజమా వేసుకుని బొట్టు, కళ్లకి సుర్మా పెట్టుకుని, తాయెుత్తు కట్టుకుని బుగ్గన పాన్‌తో రాము ఎదుటికెళ్లాను. 'పర్‌ఫెక్ట్‌, నాకిదే కావాలి' అన్నాడు. అదీ నానాజీ క్యారెక్టర్‌ వెనక కథ. తర్వాత రాము తీసిన 'గాయం'లో చేశాను. ఇప్పటికీ ఇద్దరం అప్పుడప్పుడూ ఫోన్‌లో మాట్లాడుకుంటుంటాం.

రాఘవేంద్రరావు
నేను చెన్నైలో ఉండేటప్పుడే రాఘవేంద్రరావుగారితో పరిచయం. ఆయన సినిమాలకు రాయకపోయినా రోజూ ఆయనింటికి వెళ్తుండేవాణ్ని. ఈ దశలో నేను చేసిన 'శివ' సినిమా హిట్టయింది. అప్పుడు నాకు ఆయన తీసిన 'జగదేకవీరుడు అతిలోకసుందరి'లో ఒక రోల్‌ ఇచ్చారు. తమాషా ఏంటంటే... అందులో రావుగోపాలరావుగారు ఒక వేషం వెయ్యాలి. అప్పుడాయనకు ఒంట్లో బాగోలేకపోతే ఆ పాత్రను రెండు భాగాలు చేసి ఫైట్ల కోసం రామిరెడ్డినీ, ఎంటర్‌టైన్‌మెంట్‌కి నన్నూ పెట్టారు. అప్పట్నుంచి రాఘవేంద్రరావుగారు తీసిన ప్రతీసినిమాలోనూ ఉన్నాను... ఇటీవలే విడుదలైన 'ఝుమ్మంది నాదం'తో సహా. 'పెళ్లిసందడి' సినిమా షూటింగులో ఒకసారి ఆర్టిస్టులందరం ఒక గదిలో చేరి కబుర్లు చెప్పుకుంటున్నాం. నేల మీద అరంగుళం మందాన దుమ్ము పేరుకుపోయి ఉంది. ఆ గదిలోకి అడుగుపెడుతూనే...
'ఏంటయ్యా బాబూ ఈ డస్ట్‌' అన్నారు రాఘవేంద్రరావు.

'స్టార్‌డస్ట్‌ సార్‌' అన్నాను వెంటనే. పెద్దగా నవ్వి చప్పట్లు కొట్టేశారు. మంచి హాస్యప్రియుడాయన. తమాషా ఏంటంటే... రాఘవేంద్రరావుగారి సినిమాల్లో ఒక్కదానికి కూడా నేను స్క్రిప్టు రాయలేదు. చాలాసార్లు రాయమని అడ్వాన్సులిచ్చారు కానీ నాకు కుదర్లేదు. ఆయనకి నా సాహిత్యం అన్నా నేను రాసిన శివస్తుతులన్నా చాలా ఇష్టం. ప్రతీ సంవత్సరం డిసెంబర్‌ 31న 'సరసవినోదిని' పేరుతో రాఘవేంద్రరావుగారి ఆఫీసులో ఒక సాహిత్య కార్యక్రమం ఏర్పాటు చేసేవారు. ఇటీవలి కాలంలో ఆ అలవాటు తప్పిందిగానీ... నేనివాళ కూర్చుందామన్నా ఆయన రెడీనే. అంత చనువుంది ఆయనతో.

ఇ.వి.వి.సత్యనారాయణ
ఈవీవీ వెుదటి సినిమా 'చెవిలోపువ్వు' డైలాగ్స్‌ నేనే రాశాను. అందులో భగవాన్‌ అనే పరమశాడిస్టు వేషం వేశాను. ఆసినిమా రిలీజయ్యాక ఒకసారి రైల్లో ఎక్కడికో వెళ్తూ నెల్లూరు స్టేషన్‌లో దిగితే అక్కడ ఇడ్లీలమ్ముకునే అతనొకడు నన్ను బూతులు తిట్టాడు. అంత ఇంపాక్ట్‌ ఉన్న పాత్ర అది. 'వారసుడు' సినిమాలోనూ మంచి క్యారెక్టర్‌ ఇచ్చారు ఈవీవీ. ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది 'ఆమె' సినిమాలో పాత్ర. అందులో మరదలి మీద కన్నేసిన దుర్మార్గుడైన బావ క్యారెక్టర్‌ అది. నటుడిగా నా కెరీర్‌కి చాలా హెల్ప్‌ అయిందా వేషం. నా ఖర్మేంటంటే, ఆ సినిమాకి నేనూ మా ఆవిడా మా మరదలూ వెళ్లాం. ఇంక చూడండి నా పరిస్థితి!

ఈవీవీ గొప్పదనం ఏంటంటే... ఆయన స్క్రిప్ట్‌ని అపారంగా గౌరవిస్తారు. టైటిల్స్‌ నుంచి శుభం కార్డు వరకూ ప్రతిసినిమాలోనూ ఏదోఒక కొత్తదనం కోసం తాపత్రయపడుతుంటారు.

ఎస్వీ కృష్ణారెడ్డి
నేను ఆల్‌వోస్ట్‌ పెన్ను మడిచి జేబులో పెట్టెయ్యడానికి కారణమైన వ్యక్తి ఎస్వీకృష్ణారెడ్డి. 'యమలీల'లో ఆయన ఇచ్చిన తోటరాముడి క్యారెక్టర్‌ నన్ను ఆర్టిస్టుగా ఎంత బిజీ చేసిందంటే... ఆ సినిమా రిలీజైన ఏడాదిలో నేను 27 సినిమాల్లో నటించాను. అందులో 'చెల్లి పెళ్లి... జరగాలి మళ్లీమళ్లీ' లాంటివి విని ఆ సినిమాలో డైలాగ్స్‌ నేనే రాశాననుకున్నారు చాలామంది. కానీ నేను ఒక్క అక్షరమ్ముక్క కూడా రాయలేదు. ఆ క్రెడిట్‌ అంతా రచయిత దివాకర్‌బాబుదే. ఆ సినిమా తర్వాత మావిచిగురు, వినోదం, ఘటోత్కచుడు... ఇలా ఎన్నో సినిమాల్లో నాకు మంచి క్యారెక్టర్లు ఇచ్చారు కృష్ణారెడ్డి.

కృష్ణవంశీ
'సముద్రం సినిమాలో చేపలకృష్ణ వేషం నువ్వే వెయ్యాలన్నా' అంటూ ఒకరోజు నాకు ఫోన్‌ చేశాడు కృష్ణవంశీ. తను నాకు 'శివ' సినిమా చేసేటప్పుడు పరిచయం. అప్పట్నుంచి మా ఇద్దరిమధ్యా మంచి అనుబంధం ఏర్పడింది.

'సముద్రం' సినిమాలో నేను చేసిన చేపలకృష్ణ వేషానికి తొలిసారి నంది పురస్కారం వచ్చింది. ఆ సినిమా షూటింగ్‌ చేస్తున్నప్పుడు రషెస్‌ చూసిన ప్రకాష్‌రాజ్‌ అదిరిపోయి, 'బాబోయ్‌ ఈయన ఇలా చేసేస్తుంటే నా పరిస్థితి ఏంటి' అని ఒకరోజు షూటింగ్‌ ఆపేసి తన క్యారెక్టర్‌ని బాగా అధ్యయనం చేసి మళ్లీ పోటాపోటీగా చేశాడు. ఆ సినిమా షూటింగ్‌ చేసేటప్పుడు చాలాకష్టపడ్డాం, కానీ అదంతా ఓ మధురానుభూతి.

తేజ
'శివ' సినిమా చేసేటప్పుడే తేజతో కూడా పరిచయం. ఆ సినిమాకి తను అసిస్టెంట్‌ కెమెరామెన్‌. 1999లో ఒకరోజు ఉత్తేజ్‌ నాకు ఫోన్‌ చేసి 'అన్నా, తేజ మీకొక కథ చెబుదామనుకుంటున్నాడు, అందులో మీకొక వేషం ఉంది, మీరు డబ్బులెక్కువ అడుగుతారేవోనని సంశయిస్తున్నాడు' అన్నాడు. 'సరే, అతని నెంబరివ్వు' అని అడిగి నేనే తేజకు ఫోన్‌ చేసి కథ చెప్పమన్నాను. తను చెప్పాడు. 'నీ కథ నాకు బాగా నచ్చింది. నేను చేస్తున్నాను, సినిమా విడుదలై వంద రోజులు ఆడిన తర్వాత నువ్వు నాకొక రూపాయి ఇవ్వు చాలు' అన్నాను. అదే ఉషాకిరణ్‌ మూవీస్‌ వారి 'చిత్రం'. 'చిత్రం' తర్వాత తన అన్ని సినిమాల్లో నాకు చక్కటి వేషాలిచ్చాడు తేజ. తనుతీసిన 'నువ్వునేను'లో నేను చేసిన క్యారెక్టర్‌ మంచిపేరుతో పాటు నాకు నంది అవార్డునూ తెచ్చిపెట్టింది. అంతకన్నా ఆనందకరమైన విషయమేంటంటే... ఆ సినిమా తర్వాత నేను వేరే సినిమా షూటింగ్‌కి వైజాగ్‌కి వెళ్లాను. కార్లో వెళ్తుంటే వూరంతా 'నువ్వునేను' వందరోజుల పోస్టర్లే. ఆ పోస్టర్లో నేనొక్కణ్నే ఉన్నాను. సాధారణంగా హీరోహీరోయిన్ల పోస్టర్లు వేస్తారు. వెంటనే తేజకి ఫోన్‌ చేసి అడిగితే 'మీరే సార్‌, మాకు హీరో' అన్నాడు. నిజంగా తన అభిమానానికి కళ్లల్లో నీళ్లు తిరిగాయి. ఆ పోస్టర్‌ని ఫ్రేమ్‌ చేయించి నా యింట్లో పెట్టుకున్నాను.

...రచయితగానూ నటుడిగానూ కెరీర్‌ పరంగా నన్ను అనేక మైలురాళ్లు దాటించిన దర్శకులతో ఇదండీ నా అనుబంధం. వీళ్లే కాదు, వి.వి.వినాయక్‌, త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ లాంటి ఈతరం దర్శకులతోనూ మంచి సంబంధాలు ఉన్నాయి. త్వరలో నా ఈ సినిమా అనుభవాలూ బాల్యజ్ఞాపకాలతో ఆత్మకథ రాయాలనుకుంటున్నాను.
దానికి నేను పెట్టాలనుకుంటున్న పేరు...
నలుపు, తెలుపు, కొంచెం రు.

21 comments:

  1. He is one of the good telugu actors we are having.
    Thanks a lot for sharing.

    BTW, You said "recorded", Is it possible for you to upload and share auido version, please?

    ReplyDelete
  2. సాక్షి,ఈనాడు, ఆంద్రజ్యోతి లాంటి పేపర్లలోని తాజా అప్ డేట్స్... ఇంకా తెలుగు బ్లాగుల తాజా టపాలూ, తెలుగు రేడియోలూ, టీవీలూ,... లాంటి సమాచారాలతో సరిక్రొత్త వెబ్ సైట్ ఇదిగో...
    ఇక్కడ నొక్కండి : http://telugumedia.tk/

    ReplyDelete
  3. నిన్నే ఈనాడు సండే బుక్ లో చదివి చాలా బాగుందనుకున్నానండీ! ఆ వ్యాసం రాసింది (రాయించింది) మీరేనని తెలియడం సంతోషంగా ఉంది. చాలా మంచి వ్యాసం అందించారు. అభినందనలు. :)

    ReplyDelete
  4. సూపరో, మీ జయప్రకాష్ గారి ఇంటర్యూ కుడా చదివాను చాలా బాగున్నది, కాని అప్పుడు టైం లేక ఇప్పుడు పెడుతున్నాను రెండీటికీ కలిపి, రెండూ చాలా బాగున్నాయి.

    కానీ ఇలా నెలకొకసారే కనపడటం మాత్రం ఏమీ బాలేదు, మీరు ఇంకొన్ని మంచి టపాలతో మమ్మల్ని అలరించాలని కోరుకుంటున్నాను

    ReplyDelete
  5. బాలు గారు, చాలా బాగా వచ్చినయ్ భరణిగారితో కబుర్లు. మా వేపునించి కూడా ఓ వీరతాడు మీకు.

    తారగారి పై మాటల్ని బలపరుస్తున్నాను. పత్రిక కోసం చేసే స్పెషల్ ఫీచర్సే కాక మిగతా సమయాల్లో ఇంకా చిన్న టాపిక్స్ అయినా సరే బ్లాగులో ఏదో ఒకటి రాస్తుండండి.

    ReplyDelete
  6. రాజేష్ గారూ... థాంక్యూ. మనకున్న అతికొద్ది మంది మంచి నటుల్లో భరణి ఒకరు.

    మధురవాణిగారూ... నెనర్లు. రాయించడం కాదండీ, నేనే రాశాను. ఆయన చెప్పిందాన్ని రికార్డ్ చేసుకుని. దాదాపు గంటన్నరపైనే సాగాయి మా ముచ్చట్లు. వాటిల్లోంచి ఆఫ్ ద రికార్డ్ విషయాలూ గట్రా తీసేసి ‘దర్శకులతో భరణి అనుభవాలు‘అనే కాన్సెప్టు చెడకుండా సారాంశం మాత్రమే అందించాను.
    అన్నట్టు చెప్పడం మరిచాను. మ్యాగజైన్ లో నేను రాసే ’సిల్లీ పాయింట్‘ ఆయనకు చాలా ఇష్టమట. ఆ మాట వినగానే ‘కిక్’లో బ్రహ్మానందం చుట్టూ పదిమంది చేరి వయొలిన్ వాయిస్తారు చూడండీ... వర్చ్యువల్ గా నా పొజిషన్ అదే! ‘ఎవరు రాస్తారు వాటిని’ అని అడిగితే గంభీరంగా ముఖం పెట్టి ‘నేనేనండీ’ అన్నాను. ‘ఔనా, సోర్స్ ఏంటీ’ అని ఆయన అడగటం, నేను చెప్పటం... ఒక పావుగంట హస్కు.

    తారగారూ... రెండుసార్లు నెనర్లు. నిజమేనండీ, ఇలా నెలకోసారి కనపడ్డం నాకే బాలేదు. అప్పటికీ శరత్ కాలం శరత్ గారి బ్లాగు చూసినప్పుడల్లా రోజుకు రెండు టపాలు రాయాలన్న ఆవేశం వస్తుందిగానీ బద్ధకం దాన్ని డామినేట్ చేసేస్తోంది. ‘ఆ, ఇప్పుడేం రాస్తావులే పడుకోగురూ, మళ్లీ రేపు చూసుకుందాంగా’ అని ఏ రోజుకారోజు బజ్జోపెట్టేస్తోంది. ఇంక లాభం లేదు, దానికి గాఠిగా ప్రైవేటు జెప్పేయాలి.

    కొత్తపాళీగారూ... అలమలం, అలమలం(మాయాబజార్ రేంజిలో... వీరతాడు వేశారు కదా, అందుకన్నమాట). నిజంగానే ఇకమీదట తరచుగా రాస్తానండీ.

    కతపవన్ గారూ... థాంక్యూ!

    ReplyDelete
  7. బాలుగారు సిల్లీపాయింట్ మీదేనా, సాధారణంగా పేపర్లలో అలాంటి కాలంస్లో ఓ రేంజిలో జోకులు ఉంటాయి, కానీ ఈనాడు ఒక్కటే ఎలా తప్పించుకుంటున్నదో అని అర్ధం కాలేదు, నాకు తెలిసి, అంతరిక్షం నుంచి చుస్తే చైనా గోడ కనిపిస్తుంది అని అనుకోవడం ఒక రూమరు అని ఒక న్యూస్ పేపర్లో చదవటం సిల్లీ పాయింట్లోనే, హమయ్య ఒక్కరు ఐనా ఫార్వార్డ్ మెయిల్స్ కాకుండా కాస్త తెలుసుకోని వేశాడే అనుకున్నాను, బాగు బాగు.

    కాకపొతే ఈ మధ్య అలాంటివారి చేత ఎకనామిక్స్ విషయాలు వ్రాయిస్తున్నారు అనుకుంటా ఈనాడులో, ఈ మధ్య బిజినెస్ వార్తలు మా అన్నగారి సాహిత్యావనలోకనం చదివి వ్రాసినట్టు ఉంటున్నాయి.

    ReplyDelete
  8. ఓహ్... ’సిల్లీ పాయింట్’ రాసేది మీరేనా. ఆదివారం మేగజైన్లో మిగతావి చదవటం ఒకరోజు వాయిదా వేసినా ఇదిమాత్రం వెంటనే చదివుతాను.

    భరణిగారి ఇంటర్వూబాగుంది, ఆయన చేసిన సినిమాల్లో నచ్చినవి చాలాఉన్నాయి కాని అతడులో బ్రహ్మాజీతో ఒక సీన్ ఉంటుంది. దాంట్లో బ్రహ్మాజీ "పోనీ ఏసైనా" అంటాడు దానికి భరణి గారు డైలాగ్స్ ఏమీ లేకుండా మెల్లగా పైకి చూసి ఒక ఎక్స్ప్రెషన్ ఇస్తారు చూడండి.... ఓహ్... ఎక్సలెంట్ అసలు.

    మీరు మేగజైన్ కోసం ఇంటర్వూ ఎడిట్ చేసినా మీ బ్లాగులో మొత్తం ప్రచురించిఉంటే బాగుండేది.

    ReplyDelete
  9. బాలు గారు.. ఆదివారం స్పెషల్లో చూసినప్పుడే చాలా నచ్చింది భరణి గారితో ఇంటర్వ్యూ..:) ఇక సిల్లీ పాయింట్ కాలం మీదని తెలియగానే ఎందుకో చాలా సంతోషం వేసింది. ఆదివారం అనుబంధంలో ఏవైనా పక్కన పెటేస్తాను కానీ సిల్లీ పాయింట్ ఒకటి ఇంకా వారం వారం ప్రచురించే రక రకాల కథలు.. ఈ రెండూ మాత్రం ముందుగా చదివేస్తా..:)

    ReplyDelete
  10. బాలూ గారూ, సూపరు. భరణి గారంటే నాకు చాలా ఇష్టం. మొన్న మాటీవీలో ఆయనకు చేసిన సన్మానం చూపిస్తే ప్రీతిగా చూసాను. ఒక్క అంకురం సినిమా చాలు ఆయన టేలెంట్ ఏమిటో తెలియడానికి. ఎంతగొప్పగా రాసారో అందులో. ఆయన నటన గురించి చెప్పేదేముంది. శివ మొదలుకుని విజృంభించేస్తూ వచ్చారు. రచయితగా ఇంత ప్రతిభ ఉండి కూడా ఆయన తెలుగు సినిమకి ఆ రంగంలో సేవ చెయ్యట్లేదే అని బాధ ఉంటుంది నాకు. భరణి గారిని కదిపితే కుప్పలు కుప్పలు అందమైన, గంభీరమైన మాటలు రాలుతాయి. వాటిని మన సినిమాల్లో చొప్పిస్తే తెలుగు సినిమాకే కొత్త అందం రాదూ!, ప్చ్ కానీ ఏమిటో ఆయనే రాయడం మానేసారో, ఎవరూ రాయించుకోవట్లేదో? మళ్ళీ ఆయన పెన్ను విదిలిస్తే బావున్ను.

    ReplyDelete
  11. బాలుగారు వైవిధ్యమైన అంశంతో ఆయా దర్శకుల తో తనికెళ్ళ గారి అనుభంధం గురించి చదవడం బాగుందండి చక్కని వ్యాసం అందించినందుకు ధన్యవాదాలు.

    సిల్లీపాయింట్ మీదని తెలుసుకోవడం కూడా చాలా సంతోషంగా అనిపించింది. చాలా వైవిథ్యమైన అంశాలతో భలే ఆసక్తికరమైన సమాచారాన్ని ఇస్తుంటారు. నాకూ చాలా ఇష్టం ఆ శీర్షిక, కుదిరినపుడల్లా వెదికి మరీ చదివే వాటిలో అదొకటి. భరణి గారితో పంచుకున్న ఆ సోర్స్ వివరాలు ఇంకా అసలా శీర్షిక ఐడియా వెనకున్న కథతో ఓ టపా రాయడానికి కుదురుతుందా.

    ReplyDelete
  12. తారగారూ దానివెనక పెద్ద రహస్యమేమీ లేదండీ, ఇచ్చే పాయింట్ ను ఒకటికి నాలుగుసార్లు చెక్ చేసుకుని ఇస్తామంతే. ఇక ఎకనామిక్స్ విషయాల కాన్సెప్టు నాకు అర్థం కాలేదండీ. కొంచెం వివరంగా చెప్తారా?

    త్రీజీగారూ... థాంక్సండీ. ఇంకోసారి థాంక్సండీ. అతడులో ఆ సీన్ నాకూ చాలా ఇష్టం. అందులోనే ‘ఆడు మగాడ్రా.’ అనే డవిలాగూ, ‘ఎవరైనా కోపంగా కొడతారు, బలంగా కొడతారు... కానీ వాడు శ్రద్ధగా కొట్టాడ్రా... ఏదో గోడ కట్టినట్టు, మొక్కకు అంటు కట్టినట్టు’ అనే డైలాగ్ కూడా సూపరో సూపర్. ఇక మొత్తం ఇంటర్వ్యూ అంటే.... మా ఇబ్బందులు కూడా అర్థం చేసుకోండి సార్!

    మనసుపలికే గారూ... నెనర్లు. కథలంటే ఇష్టం అన్నారు. కథలా... కథనాలా?

    సౌమ్యగారూ.... నెనర్లు. నేను కూడా ఇటీవలి కాలంలో ఒక ప్రోగ్రాం మొత్తం టీవీ ముందునుంచి కదలకుండా చూసింది అదేనండీ. ఇకపోతే భరణిగారు రచయితగా... ఇకమీద రాయరేమోనండీ, మరీ ఏదైనా అద్భుతం జరిగితే తప్ప. పెన్ను మడిచి జేబులో పెట్టేశానని చెప్పేశారు కదా, ప్చ్!

    వేణూశ్రీకాంత్ గారూ... నెనర్లు. సోర్స్ అంటే ఏమీ లేదండీ, ట్రివియల్ పాయింట్లు నెట్లో బోలెడు దొరుకుతాయి. కానీ వాటి విశ్వసనీయత సందేహం. అందుకని అట్నుంచి నరుక్కొస్తాను, ఎలాగంటే... చాక్లెట్ గురించి ఒక పాయింట్ రాయాలని ముందే డిసైడై తర్వాత దాని గురించి విశ్వసనీయమైన సైట్లు వెతుకుతా. జంతువుల గురించి రాయాలంటే నేషనల్ జియోగ్రాఫిక్ చానెల్ వారి వెబ్సైటూ... ఇలాగన్నమాట. నాసా వాళ్ల అపోలో యాత్రలన్నిటినీ ఫాలో అయితే బోలెడన్ని సిల్లీ పాయింట్లు. వాళ్లక్కడ ఏం తిన్నారు, ఏం ఆట ఆడారు లాంటివన్నీ ఎమేజింగ్ నిజాలే. అలాగే మనం రోజువారీ చూసే విషయాల్లో కూడా బోలెడన్ని సిల్లీ పాయింట్లు దొరుకుతాయి. ఉదాహరణకు పేకల్లో రాజులెవరు, వాళ్లల్లో ఎవరికి మీసాలున్నాయి, ఎవరి ఫోజు ఏంటీ... కొత్త పాయింట్లను మనమే కొత్తగా సృష్టించుకోవడం అన్నమాట.

    ReplyDelete
  13. చచ్చు పుచ్చు కధలన్నీ వ్రాస్తున్నారండి, అంటే ఎవో ఇంగ్లీష్ పేపర్ల చదివి వాటిని అలానే, లేదా కొన్ని ఆన్లైన్ విష్లేషణలు తర్జుమా చేస్తున్నారు, పనిలో పనిగా వాళ్ళ తప్పులు కుడా, ఎక్కువగా ఈ తర్జుమా అప్పుడు చాలా తప్పులు దొర్లుతున్నాయి, ఇంకొన్ని వారికి అర్ధం కాకో, లేదా లెంగ్త్ తగ్గించే క్రమంలో అవసరం ఐనవి కోసేస్తున్నారు, అవేమో అర్ధం పర్ధం లేకుండా తగలడుతున్నాయి. ఈ సారి ఒకటి మీకు ఉదాహరణగా చూపిస్తాలేండి.

    ReplyDelete
  14. http://vivaadavanam.blogspot.com/2010/11/blog-post_24.html

    ReplyDelete
  15. వావ్ ..మీరా సిల్లీ పాయింట్ రాసేది....
    నాక్కూడా సిల్లిపాయింట్ ఇస్టం. బుక్ దొరకితేముందు చదివేది అదే...
    3జి చెప్పినట్టు... అతడు లొ తనికెళ్ళ భరణి నటన బాగుంటుంది. అయితే సినిమా కన్నా బయట సింపల్ గా మాట్లాడినప్పుడు ఇంకా బావుంటుంది ..

    ReplyDelete
  16. నేను తనికెళ్ళ భరణికి అభిమానిని
    సముద్రం సినిమా లో చాలా బాగా చేసారు

    ReplyDelete
  17. బాలుగారు,
    నేను కూడా సిల్లీపాయింట్ అవుతుంటానండి. భలే పాయింట్స్ పట్టుకొస్తారు. చాలా బావుంటాయి.

    భరణిగారి గురించి ప్రస్తావించినవారు ఆయన రాసిన శివస్తుతుల గురించి తప్పక ప్రస్తావిస్తారు(ఈ మద్య ట్విట్టర్ లో రానా, సుమంత్ లాంటి యువహీరోలు కూడా ప్రస్తావించారు). అవి బయట ఎక్కడన్నా దొరికే అవకాశం వుందాండి ?

    ReplyDelete
  18. తారగారూ నేను ఎకనామిక్సూ షేర్మార్కెటూ బిజినెస్సూ వగైరాల్లో నేను చాలా వీక్. అంచేత పేపర్లో నేన్చదవని పేజీ ఏదైనా ఉంటే అదే.

    మంచుగారూ నెనర్లండీ. నటన నటనే... బయట బయటేనండీ! సినిమాల్లో ఎక్కువ భాగం పరమ నీచమైన క్యారెక్టర్లు వేసే ఆయన భయట పరమ సాత్వికుడు.

    అప్పారావు శాస్త్రిగారూ... సేమ్ పించ్, నేనూ సముద్రం సినిమాలో భరణగారి నటనకు వీరాభిమానిని. అందులో ఆయన మాటిమాటికి ‘అద్దెచ్చా’ అనడాన్ని మస్కా సినిమాలో ప్రదీప్ రావత్ క్యారెక్టర్కి వాడుకున్నారు. కాకపోతే అందులో ప్రదీప్ రావత్ ‘అద్దెచ్చా’ అనడు. ‘మై శివాజీ షిండే భగవాన్ కె ప్రతిసమత్ నేతా హోంగీ...’ టైపులో ఏదో ఉంటుందా డైలాగ్.

    బద్రిగారూ... చెప్పాను కదండీ నెట్లోవి గుడ్డిగా ఫాలో అయిపోకుండా కూతంత బుర్రపెట్టి ఆలోచించి రాస్తానంతే. భరణిగారి శివస్తుతులు ‘ఆటగదరా శివా’ పుస్తకం మార్కెట్లో దొరుకుతోందండీ. విశాలాంధ్ర, నవోదయ బుక్ షాపుల్లో అడిగి చూడండి.

    ReplyDelete
  19. తారగారూ, న్యూస్ సిండికేట్ అనే మాట ఎప్పుడైనా విన్నారా?

    ReplyDelete
  20. అభినందనలు.

    ReplyDelete
  21. anni patralllo ranincha gala manchi natudu

    buchi reddy

    ReplyDelete